
ఈ రోజు ఆర్ట్స్ కళాశాల మైదానంలో సమైక్య గర్జన
సమైక్య ఉద్యమ తీవ్రత తెలియచేప్పెందుకు రెండు లక్షల మందితో చేపట్టనున్న సమైక్య గర్జనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జన ప్రవాహం కదిలిరానున్నందున ఆందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కడప కళాశాల మైదానంలో ఈ రోజు (శనివారం) ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు సమైక్యాంధ్ర పరిరక్షణ వేదికప్రతినిధులు సమాయత్తమయ్యారు.
‘సమైక్య గర్జన’ నిర్వహణ స్థలం విషయంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 31వ తేదీన జిల్లా కేంద్రంలోని కోటిరెడ్డి కూడలిలో నిర్వహించాలని రాజకీయేతర ఐకాస ఇదివరకే ప్రకటన చేసింది. ప్రకటన చేసిన నాటి నుంచి కిమ్మనకుండా ఉన్న పోలీసు అధికారులు బుధవారం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులను పిలిపించి కోటిరెడ్డి కూడల్లో అనుమతి ఇవ్వబోమని తెగేసి చెప్పారు.
‘సమైక్య గర్జన’ కోటిరెడ్డి కూడలి నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానంలోకి మార్పు చేస్తున్నట్లు గురువారం రాత్రి పోద్దుపోయాక సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు ప్రకటించారు.
కార్యక్రమానికి వచ్చే వాహనాల నిలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పులివెందుల, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల నుంచి వచ్చే వారు వాహనాలను బిల్టప్ సమీప కల్యాణమండపం వెనుక ఉన్న ఖాళీ జాగాలో ఉంచాలి. రాజంపేట, బద్వేలు, కోడూరు నియోజకవర్గాల వారు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణంలో.. మరిన్ని వస్తే సమీపంలోని స్పిరిట్ కళాశాల వద్ద ఆపవచ్చని నిర్వాహకులు సూచించారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల వారు రైల్వే గేటు దగ్గర నిలిపేయాలని పోలీసు అధికారులు వేదిక ప్రతినిధులకు సూచించారు.