ఆ బువ్వ అంటే తెలుసా మీకు? నా చిన్నప్పటి స్నేహితులు తెలీదు, మా వూరు తెలీదు, అవి ఏవీ తెలీనప్పుడు ఆబువ్వ అంటే ఎట్ట తెలుస్తుందిలెండి? ఆబువ్వ అంటే ఏ బువ్వో కాదండి, ఇప్పుడు మనందరం తింటున్న వరి బియ్యం బువ్వ. అందరం తినే అన్నానికి అంతగా చెప్పాల్నా అనొచ్చు.
ఇప్పుడు అందరం తింటున్నాం కాని అప్పుడు మేం తినేవాళ్ళం కాదండి. తినేవాళ్ళం కాదంటే కొవ్వెక్కి తినేవాళ్ళంకాదని కాదు. అప్పుడు మాకు ఆబువ్వ అందుబాటులో వుండేది కాదు, ఈబువ్వ మాత్రమే వుండేది. ఈబువ్వ అంటే జొన్నసంకటి, కొర్రబువ్వ, ఆరికబువ్వ అన్నమాట.
ఎవరింటికన్నా సుట్టాలొస్తే వాళ్ళకు మాత్రం ఆబువ్వ వండిపెట్టేవాళ్ళు. ఆఇంటి పిల్లోడో, పిల్లో ఆడుకోడానికి వచ్చినప్పుడు “మా ఇంట్లో ఈ పొద్దు ఆబువ్వే” అని గొప్పగా చెప్పేవాళ్ళు. రోజూ ఇంట్లో తినే బువ్వకు ఏ గొప్పా లేదు.
ఇప్పుడు అదే బువ్వను ఆరోగ్యం కోసమంటూ వరి బియ్యం కంటే ఎక్కువ ధర పెట్టుకొని, తింటూవుంటే అప్పుడు లేని గౌరవం ఇప్పుడు జొన్నలకూ, కొర్రలకూ, ఆరికెలకూ దొరికిన్నందుకు సంతోషంగా వుంది. “నీయవ్వ.. ఆబువ్వా.. ఇప్పుడేమయిందే నీ గొప్ప?” అనడగాలనిపిస్తోంది. అట్లనే “ఒరే పిచ్చోళ్ళూ, అవి పండించిన మాకూ, వాటికీ, అప్పుడు ఏ గౌరవం ఇచ్చారర్రా!..ఇప్పుడు మీ ఆరోగ్యం కోసం మా పంట అవసరమయిందా?” అనీ అడగాలనిపిస్తోంది.