అలసిన గుండెలు (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి

అలసిన గుండెలు (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి

అలసిన గుండెలు

ఆరో కాన్పుకు అమ్మగారింటికి పోవడానికి సిగ్గయింది శేషమ్మకు. పోయిన సారి పుట్టింటికి పోయినప్పుడు తమ్ముని భార్య ములికివంటి మాట అన్నది:

“కనడానికేం – నేనూ కంటాను. సంవత్సరానికి ఒక పిల్లను. చాకిరీ చేసేవాళ్లు ఉండొద్దూ.”

ఆ మాట విన్నప్పుడు ముసలి తల్లిని పట్టుకొని మూడు రోజులు ఏడ్చింది శేషమ్మ. “గొడ్డుమోతుది దాని మాటలకేం లేమ్మా” అని తల్లి ఎంత ఓదార్చినా, ఆనాడే తీర్మానం చేసుకున్నది — ఇక పుట్టింటికి పోకూడదని. ఇప్పుడు మళ్లీ అమ్మగారింటికి పోతే బాగుండుననే ఆలోచన తనకు తెలియకుండానే రావడంతో, ఆమెకు సిగ్గుతోబాటు కోపం కూడా వచ్చింది.

“ఆ రాకాసిదాని కొంపకు చచ్చినా పోను. అంతగా అయితే మా అమ్మను ఇక్కడికే రమ్మంటాను” అనుకుంది.

సీతారామయ్య ఇంటికి రాగానే, శేషమ్మ వంటింట్లో నుండి నేరుగా వచ్చి చెప్పింది:

“ఏమండీ, ఈ సారి నేను మా ఊరికి పోను.”

సందర్భం అర్థం కాక సీతారామయ్య అడిగాడు:

“ఏమి సంగతి?”

“ఒకరింటికి ఎందుకు పోవాలండీ ప్రతి సారీ – మనమేం బ్రతకలేక చస్తున్నామా?”

విషయం అర్థం గాకపోయినా సీతారామయ్య జవాబు చెప్పినాడు:

“బ్రతకలేక చస్తున్నామని ఎవరన్నారు? మనమంతా చావలేక బ్రతుకుతున్నాం — అంతే.”

“అబ్బా! మీ మాటలు మీవేనండీ.”

“మరి నాకు అర్థమయ్యేటట్లు అచ్చ తెనుగులో చెప్పరాదూ?”

భర్త సరసాలకు శేషమ్మ నవ్వడం మానుకొని చాలా ఏళ్లయింది. తన మామూలు ధోరణిలోనే ఆమె అన్నది:

“ఈసారి ఇక్కడే పురుడు పోసుకుంటాను. ఈ సంగతి చెప్తామనుకుంటే ఎంత సాగదీస్తారండీ మీరూ!”

“దానికేం — లక్షణంగా కానీయ్. అంత శుభకార్యానికి నేను మాత్రం అడుపడతానా?”

చదవండి :  తాతాచార్ల కథలు - సిపి బ్రౌన్

పరిహాసం సీతారామయ్య తన బాధలమీద కప్పుకున్న ముసుగు. మొదటి కాన్పుకు భార్యను పుట్టింటికి పంపినప్పుడే పగటి కలలన్నీ ప్రక్కకు నెట్టి ఎలిమెంటరీ స్కూలు టీచర్ అయినాడు. ముగ్గురు పిల్లలు పుట్టేటప్పటికి నిరాశ అతన్ని పూర్తిగా జయించింది. బాగా బ్రతకడానికి ప్రయత్నించడం తలకు మించిన పని అని ఆనాడే అనుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా బ్రతుకులోని భారాన్ని నవ్వులాటగా తీసుకోవడం నేర్చుకున్నాడు.

ఆత్మహత్య చేసుకోలేని వాళ్లలో చాలా మంది బ్రతుకు మీద కసిని భార్యా బిడ్డల మీద తీర్చుకుంటారు. కొంతమంది వేదాంతం పూసుకుంటారు. సీతారామయ్య వంటి వాళ్లు తమ బాధలను పరిహాసం క్రింద దాచుకుంటారు. “ఈ మూడు నాళ్ల బ్రతుకులో వుత్త సుఖాలే కోరుకోవడం మానవుని దురహంకారం. కష్టాలు వస్తే ఏం? యెల్లకాలం ఉంటాయా? చచ్చిందాకానే కదా!” అని అతని అంతరాత్మ చేసే వాదం.

ఆ తర్వాత అతనికి జీవితంలో ఎవరితోనూ పేచీలు రాలేదు. అప్పటి నుండి అతను భార్యను ఆజ్ఞాపించడం గానీ, దండించడం గానీ లేదు. ఈ మార్పు శేషమ్మకు అర్థం గాకపోయినా, ఆమెకు తృప్తికరంగానే ఉంది.

ఆ రాత్రే భర్తకు అన్నం వడ్డిస్తూ ఆమె అడిగింది:

“అయితే మా అమ్మను రమ్మని జాబు వ్రాయండి.”

“వ్రాస్తానుగానీ ఒక విషయం ఆలోచించినావా?”

“ఏమిటి?”

“నీకు కోపం వస్తుందేమో! అయినా చెప్తాను. మీ అమ్మ వస్తే ఒక నెలైనా ఉంటుంది గదా?”

“ఉండదా మరి?”

“మీ అమ్మ కూడా అన్నం తింటుంది గదా?”

శేషమ్మకు చురుక్కుమంది. మగని మాటలకు నవ్వడం మానుకున్నా, కోపగించుకునే శక్తి ఆమె ఇంకా కోల్పోలేదు.

“ఎవరమ్మైనా గడ్డి తింటుందా?”

సీతారామయ్య చిరునవ్వుతో సమాధానం చెప్పినాడు:

చదవండి :  ఆయనను మర్చిపోతే ‘‘సాహిత్య విమర్శ’’ను మరిచిపోయినట్లే !

“అదే నేననేదీ. ఇప్పుడు ఒక పూటైనా అన్నం తింటున్నాము. అమ్మ వస్తే — గడ్డి తినకపోయినా జొన్నలో, రాగిలో తినాలి రెండుపూటలా.”

శేషమ్మకు కండ్ల నీళ్ళు పర్యంతమైంది. భర్త చెప్పిందాంట్లో అబద్ధమేమీ లేదు. తన తల్లికి తాను నెల రోజులు అన్నం పెట్టే స్థితిలో లేదు. పదేళ్లకు పూర్వం అయితే, ఈ దుస్థితికి భర్తను నిందించి ఉండేదే — మీకు సంపాదించే యోగ్యత లేక గదా అని. ఈ పదేళ్లలో దేశంలో తన భర్తలాంటి వాళ్లు ఎంతమంది ఉండేదీ తెలుసుకుంది. తన అశక్తతకు లోలోపల కుమ్మడం తప్ప ఏమి చేయాలో ఆమెకు తెలియదు.

సీతారామయ్య అన్నం తిని పోయి మంచంమీద కూర్చున్నాడు. శేషమ్మ అన్నం ముందు కూర్చొని ముద్ద ముద్దకూ మనసులోని బాధను నెమరు వేసుకుంటూ ఉంది.

ఈ రెండేళ్లలోనూ సంసారం ఎంత బరువైందో జ్ఞాపకం చేసుకుంది. అన్ని వస్తువులూ క్రమక్రమంగా ధరలు పెరిగినాయి. సంవత్సరం నుండి ఒక పూట మాత్రమే బియ్యం వండుకుంటున్నారు. “పుట్టిన ఐదుగురిలో ఇద్దరు పోయినా సంసారం ఇంత బరువుగా ఉందే” అనుకుంది ఆమె. వెంటనే “ఛీ — పాడు ఆలోచన! ఆయన వల్లనే ఈ ఆలోచన నన్నూ పట్టుకుంది.” అనుకొని తల విదలించుకుంది.

ఒక నెలలోనే ఇద్దరు పిల్లలు చచ్చి తాను మొత్తుకుంటుంటే “ఎందుకేడుస్తావ్ — ఖర్చు తగ్గిందనా?” అన్నాడు మగడు. ఇది జరిగి రెండేళ్లకు పైగా అయినా “వాళ్లు బ్రతికి ఉంటే ఎంత కష్టంగా ఉండేది?” అన్న ఆలోచన ఆమెకు అప్పుడప్పుడూ వస్తూనే ఉంది. ఈ ఆలోచన వచ్చినప్పుడల్లా “పిల్లలు చచ్చినందుకు సంతోషిస్తున్నావా?” అని ఆమె అంతరాత్మ ఆక్రోశించేది. ఆమె ఉక్కిరిబిక్కిరై తన పిల్లలను తానే హత్యచేసినట్లు బాధపడేది.

చదవండి :  మనువు (కథ) - సొదుం జయరాం

ప్రొద్దుండగా పొరుగింటికి పోయిన ఎనిమిదేళ్ల శారద వచ్చి అంది:

“అమ్మా, సీతమ్మ వాళ్లు తిరుపతికి పోతున్నారే.”

శేషమ్మ కండ్లు తుడుచుకొని బిడ్డవేపు చూసింది.

“వాళ్లకు ఇనకంటాక్సు తప్పిపోయిందటమ్మా. అందుకని ముడుపు చెల్లించడానికి పోతున్నారే.”

శేషమ్మ పరధ్యానంగా “సరే, లేవే” అంటూ చేయి కడుక్కొని లేచింది.

“నకంటాక్సు అంటే ఏందమ్మా?”

అడిగింది శారద. శేషమ్మ పలక్కుండా పోయి పసిపిల్లవాని ఉయ్యాల దగ్గర కూర్చుంది.

ఉట్టిపాటుగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. బ్రహ్మాండమైన ఆలోచన. “తిరుపతి వెంకటేశ్వరునికి ముందుగా ముడుపు కట్టుకుంటే!” తన ఆలోచనకు తానే మురిసిపోతూ, “నా తెలివి తగలెయ్యా, ఇన్నాళ్లూ ఎందుకు తోచలేదో!” అనుకుంది ఆమె.

వెంటనే భర్త వైపు తిరిగి అంది:

“నాకు రెండు రూపాయలు ఇవ్వండి.”

“ఈ నెలలో జీతం పెరిగిందనా? అయినా నీ భాగానికి రెండు రూపాయలు రాదే.”

“అదిగాదండీ — తిరుపతి వెంకటేశ్వరునికి ముడుపు కట్టుకుంటాను.”

“ఏం, మన ఐశ్వర్యం మీద ఆయనకూ కన్ను పడిందా!”

“మనకింక పిల్లలు వద్దని ముడుపు కట్టుకుంటాను.”

ఈ మాటలకు భర్త సంతోషిస్తాడని ఆశగా అతని ముఖంలోకి చూసింది శేషమ్మ.

సీతారామయ్య నవ్వుతూ అన్నాడు:

“పిచ్చిదానా! మన దేవుళ్లకు ఇవ్వడమే తెలుసు. ఇవ్వకుండా ఉండడం చేతగాదు.”

“అయితే మరి ఏం చేయమంటారూ?”

“మన పన్నుల మంత్రికి ఇంకా పది మంది పిల్లల్నివ్వమని ముడుపు కట్టుకో. లేకపోతే ఆ వెంకటేశ్వరున్నే వచ్చి ఒక నెల ఈ సంసారం ఈదమని కోరుకో.”

శేషమ్మకు అర్థంకాక వెర్రి చూపులు చూస్తూ కూర్చుంది.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: