
అయ్యోపోయఁ బ్రాయముఁ గాలము
॥పల్లవి॥ అయ్యోపోయఁ బ్రాయముఁ గాలము ముయ్యంచు మనసున నే మోహమతినైతి ॥చ1॥ చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులు వట్టి యాసలఁ బెట్టువారే కాక నెట్టుకొని వీరు గడు నిజమనుచు హరి నాత్మఁ బెట్టనేరక వృధా పిరివీకులైతి ॥చ2॥ తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును వగలఁ బెట్టుచుఁ దిరుగువారే కాక మిగుల వీరలపొందు మేలనుచు హరినాత్మఁ దగిలించ లేక చింతాపరుఁడనైతి ॥చ3॥ అంత హితులా తనకు నన్నలునుఁ దమ్ములును వంతువాసికిఁ బెనఁగువారే కాక అంతరాత్ముఁడు శ్రీవేంకటాద్రీశుఁ గొలువ కిటు సంత కూటముల యలజడికి లోనైతి |
రాగము: సామంతం రేకు: 0029-04 సంపుటము: 1-179 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం