నెహ్రూ ప్రారంభించిన విశాలాంధ్రను ఇందిరాగాంధీ భావాలకు, రాజీవ్‌గాంధీ ఆశయాలకు విరుద్ధంగా సోనియాగాంధీ ఇపుడు ముక్కలు చేసేందుకు పూనుకుని సీమాంధ్రుల గొంతు కోసిందని కమలాపురం శాసనసభ్యుడు వీరశివారెడ్డి విరుచుకుపడ్డారు. ప్రొద్దుటూరులోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రులు, ఎంపీలే కారణమని ఆరోపించారు. వారే ఆంటోని కమిటీ ముందుకొచ్చి ఇబ్బందులను వివరించి విభజన ప్రక్రియను ఆపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన కోసం యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరునెలల ముందు నుంచే కుట్ర చేశారని విమర్శించారు. ఏకపక్షంగా మీ ఇష్టానుసారం రాష్ట్ర విభజన సాగిస్తే నదీజలాల కోసం ఇరు ప్రాంతాల మధ్య రక్తపాతాలు జరుగుతాయని హెచ్చరించారు.
హైదరాబాదును కలుపుకుని 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం కావడం భావ్యం కాదన్నారు. అందరికి అమోదయోగ్యంగా సమన్యాయం చేసిన తర్వాతనే రాష్ట్ర విభజన అనేది చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడాన్ని అన్ని ప్రాంతాల వారు హర్షిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. విభజనకు సీఎం వ్యతిరేకం కాదని, అందరికి మేలు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరిన ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి డిస్మిస్ చేయాలని తెలంగాణవాదులు, టీఆర్ఎస్ వాళ్లు డిమాండు చేయడం సబబు కాదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం, వైఎస్ఆర్‌కాంగ్రెస్‌పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు.
విభజనకు ఆరునెలలకు ముందునుంచే సోనియాగాంధీ కుట్ర చేసి సీమాంధ్రకు చెందిన ఎంపీలకు మంత్రి పదవులను కట్టబెట్టి వారి నోరు మూయించిందని విమర్శించారు. కావూరి సాంబశివరావు, చిరంజీవి, పురందేశ్వరీలు విభజనపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. కావూరి సాంబశివరావు, చిరంజీవి, పురందేశ్వరీలు విభజనపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. హైదరాబాదులో అన్నదమ్ముల్లా వుంటున్న సీమాంధ్ర ఉద్యోగులను హైదరాబాదు వదిలిపెట్టిపోవాలని అంటూ కేసీఆర్ ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టాడన్నారు.