ఐజీకార్ల్: కడప జిల్లాలో ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ లైవ్‌స్టాక్ (IGCARL) అనే పేరుతో ఒక (supposedly) ప్రపంచస్థాయి పరిశోధనా సంస్థ ఏర్పాటై ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వివిధ దేశాల, సంస్థల ప్రతినిధుల రాకపోకలు నిరాటంకంగా, సౌకర్యవంతంగా సాగడానికి వీలుగా కడప విమానాశ్రయం నుంచి ఈ సంస్థ దాకా నాలుగు వరుసల రహదారితో సహా IGCARLలో భవంతులు, ఇతర మౌలిక సౌకర్యాలైతే సిద్ధమయ్యాయిగానీ వాటిని సద్వినియోగం చేసుకుని, ఆ సంస్థ గురించి ఇంటా బయటా విస్తృతంగా ప్రచారం కల్పించి దాని స్థాపన వెనకున్న ఆశయాన్ని నెరవేర్చే సంకల్పం, సామర్థ్యం కొత్త ప్రభుత్వానికి ఉన్నాయా?
* * *
నారాయణ గారి “నడిమధ్య” లాజిక్: పాలనాకేంద్రంగా రాజధాని మొత్తం పదమూడు జిల్లాలకు నట్టనడుమ ఉండాలని పట్టుదలగా ఉన్న నారాయణ గారు ప్రాంతీయ కార్యాలయాలకు కూడా అదే లాజిక్ వర్తింపజేసి ప్రస్తుతం తిరుపతిలో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రం, APSPDCL, కర్నూలులోని డి.ఐ.జి. ఆఫీసు మొదలైన కార్యాలయాలను కడపకు తరలించే ఏర్పాట్లు చేస్తారని ఆశించవచ్చా?
* * *
తిరుపతి పేరిట దగా పడుతున్న రాయలసీమ
రాయలసీమ అంటే కరువు కాటకాలు, కక్షల మూలంగా ఒక విషవలయంలో చిక్కుకుని, అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతం.
i. చారిత్రికంగా చూస్తే తిరుపతితో సహా చిత్తూరు జిల్లాలో అధిక భాగం (మదనపల్లె, వాయల్పాడు తాలూకాలు మినహాయించి) సీడెడ్ (అంటే రాయలసీమ) ప్రాంతంలో భాగం కాదు. అది మద్రాసు ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉండేది. తెలుగు, తమిళ ప్రాంతాలకు మధ్య బఫ్ఫర్ జోన్ గా ఉండి, అరవనాడు అని పిలవబడిన ప్రాంతమది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రులు చెన్నై నగరాన్ని కోరితే తెలుగు, తమిళ భాషలు రెండూ ప్రాచుర్యంలో ఉన్న తిరుపతిని ఇచ్చి సరిపెట్టుకొమ్మన్నారు. అలా చారిత్రికంగా అది రాజకీయ కారణాల వల్ల చివరి దశలో బయటి నుంచి వచ్చి రాయలసీమలో చేరిన ఒక outsider.
ii. ప్రాకృతికంగా చూస్తే రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల సగటు వార్షిక వర్షపాతాలు వరుసగా 553, 636, 747 మి.మీ. ఐతే చిత్తూరు జిల్లాలో అది రాష్ట్ర సగటుతో దాదాపు సమానంగా 934 మి.మీ. ఉంది. వర్షపాతం ఎక్కువ కాబట్టి చిత్తూరు జిల్లాలో వ్యవసాయానికి వచ్చిన లోటేమీ లేదు. అందువల్ల ప్రాకృతికంగా కూడా ఆ జిల్లాను రాయలసీమలో భాగంగా పరిగణించలేం.
iii. ఇక ఇంకో ముఖ్యమైన అంశం ముఠాకక్షల విషయంలో చూస్తే దశాబ్దాల తరబడి కక్షలతో కునారిల్లిన జిల్లాలు పై మూడూ ఐతే ఫాక్షనిజం ఛాయలు సోకని జిల్లా చిత్తూరు.
iv. భౌగోళికంగా – ఉనికిని (location), రవాణా సౌకర్యాలను బట్టి చూస్తే అది రాయలసీమలోని ఇతర ప్రాంతాల కంటే కోస్తాంధ్రలోని ప్రాంతాలకే రాకపోకలకు అనుకూలంగా ఉండే నగరం. ఉదాహరణకు రాయలసీమలో భాగమైన కర్నూలుకు తిరుపతి కంటే హైదరాబాదే దగ్గర. మనం గమనించినట్లైతే రాష్ట్రం మొత్తమ్మీద కోస్టల్ బెల్ట్ వెడల్పు సగటున 150 కి.మీ. అనుకుంటే తిరుపతి సముద్ర తీరం నుంచి కేవలం 100 కి.మీ. దూరంలో ఉంది. అంటే కృష్ణా జిల్లా నడిబొడ్డున ఉన్న విజయవాడ కంటే సముద్రతీరం తిరుపతికే దగ్గర. విజయవాడ కోస్తాలో అంతర్భాగమైనప్పుడు తిరుపతి మాత్రం ఎందుకు కాదు?
కృత్రిమమైన జిల్లాల సరిహద్దులను పక్కనబెట్టి తిరుపతి డివిజన్ ను కోస్తాంధ్రలో భాగంగా భావించి చూసినట్లైతే తిరుపతి పేరిట రాయలసీమ ఎంతగా దగాపడుతోందో అర్థమౌతుంది. అందువల్ల రాయలసీమలో ఏర్పాటుచేస్తున్నట్లు మెరమెచ్చుమాటలు చెప్తూ తిరుపతిలో అవస్థాపనా సౌకర్యాలు కల్పించడం రాయలసీమవాసులను పనిగట్టుకుని ఇక్కట్ల పాలు చేసినట్లే అవుతుంది. ఈ వాస్తవాలను గమనించకుండా ఇప్పటికీ రాయలసీమ వాసులు అమాయకంగా “రాయలసీమలోని తిరుపతి“ని రాజధాని చెయ్యండి, “రాయలసీమవాసుల కోసం తిరుపతి“లో హైకోర్టు పెట్టండి అని కోరడం చూస్తూంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు.
ఇక రాజకీయంగా అన్నిటికంటే పెద్ద సమస్య తిరుపతి తమిళనాడు సరిహద్దుల్లో ఉండడం. తెలంగాణా బిల్లును పార్లమెంటు ఆమోదించినప్పుడు కూడా అప్పటి కేంద్రమంత్రి రాందాస్ లాంటి తమిళ ప్రజాప్రతినిధులు తిరుపతిని తమిళనాడులో కలపాలని డిమాండు చేసిన విషయాన్ని గుర్తుంచుకుంటే భవిష్యత్తులో ఎదురుకానున్న ప్రమాదాన్ని సులభంగా ఊహించవచ్చు.
భవిష్యత్తులో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడు తమిళులు అతి సులభంగా రాష్ట్ర సరిహద్దులు మార్పించి తిరుపతిని ఎగరేసుకుపోగలరని భావించడం తప్పేమీ కాదు. ఇప్పుడు ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్ లాంటి సంస్థలు తిరుపతిలో నెలకొల్పినట్లైతే అవన్నీ తెలుగు వాళ్లకు కాకుండా పోయే ప్రమాదం పొంచే ఉంది.
ఇప్పుడు హైదరాబాదు విషయంలో జరిగినట్లే రాయలసీమవాసుల ఆవేదన అరణ్యరోదనగా మారే చరిత్ర పునరావృతమౌతుంది. అనుభవాల నుంచి పాఠాలు నేర్వని గుడ్డి ప్రభుత్వాలనేమందాం?
– త్రివిక్రమ్
(g.trivikram@gmail.com)