మా కడప జొన్నన్నం, రాగిసంగటీ, అలసంద వడలూ… కారెం దోసె
56 సంవత్సరాల జీవితంలో సుమారు వెయ్యి పైచిలుకు చిత్రాలలో వివిధ రకాలైన పాత్రలలో నటించిన వై విజయ (యెనిగండ్ల విజయ) తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. నృత్యకళాకారిణి కూడా అయిన విజయ ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చినసత్యం వద్ద నృత్యం నేర్చుకున్నారు. నటించడమంటే ఏంటో తెలియని చిన్న వయస్సులోనే దర్శకులు చెప్పినట్టు చేసి తొలి షాట్‌ను ఓకే చేసిన విజయ అటు నృత్యంలోను, ఇటు నటనలోనూ రాణించారు. మన దేశ నృత్యంలోనే నటనదాగుదంటున్న ఎనిగండ్ల విజయ నటనలో భేషజాలుండ కూడదంటారు. ప్రభుత్వ అవార్డులు రాకపోయినా ప్రజల చూపే అభిమానమే నాకు రివార్డులంటున్న ఈ నటీమణి సీరియల్ షూటింగ్ విరామ సమయంలో గుల్జార్ తో చెన్నై – పోరూరులోని ఏ.ఆర.ఎస్ గార్డెన్లో సంభాషించారు.
నాన్న ఎనిగండ్ల జ్ఞానయ్య – కడప జిల్లా కో-ఆపరేటివ్ సొసైటీలో మేనేజరుగా పనిచేసేవారు. నాన్న ఉద్యోగరీత్యా మా కుటుంబం కడపలో స్థిరపడింది. అమ్మ బాలమ్మ – ఆమె గృహిణిగా వుంటూ మా బోగోగులు చూసుకునేది. నాన్న, అమ్మ వాళ్ళ పూర్వీకులు గుంటూరు జిల్లాకు చెందిన వారు. నాన్నగారు కర్నూలులో రెండు సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలోనే నేను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 8.02.1957లో పుట్టాను. అమ్మా నాన్నలకు మేము మొత్తం పది మంది సంతానం – ఆరుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలం – నేను ఐదవ దానిని.
నేను పుట్టింది కర్నూల్లోనే అయినా పెరిగింది – చదువుకున్నది – అంతా కడపలోనే. మా కడపలో రాగి సంగటి, పచ్చి మిరపకాయలపచ్చడి, పప్పు , మటన్‌కర్రీ కలుపుకుని తింటే ఆ రుచే వేరు. ముఖ్యంగా నాకు మా పొలాల్లో పండే జొన్నలతో అమ్మ వంటలు చేసేది. జొన్నన్నం, రాగిసంగటి అంటే నాకు చాలా ఇష్టం.
కడప పట్టణానికి 7 కిలో మీటర్లు దూరంలో మా పొలాలు వుండేవి.. ఆ రోజుల్లో మేము అంటే మా అక్క చెల్లెల్లతో, స్నేహితులతో కలిసి మా పొలాలకు వెళ్ళి ఆడుకునే వాళ్ళం. నాన్నగారు పొలాల్లో ప్రత్యేకంగా ఓ ఇల్లు కట్టించారు. స్కూల్ సెలవులిస్తే మా అక్కయ్యలు నేను పొలాలకు వెళ్ళి పచ్చటి జొన్న పైరు పొలాల గట్లపై కేరింతలు కొడుతూ ఆడుకునే వాళ్ళం. మా పొలాల్లో రాగులు, కాయగూరలు, జొన్నలు ఎక్కువగా పండించేవారు. చిన్నప్పుడు అలా సరదాగా తిరిగిన రోజులు మళ్ళా తిరిగిరావు.
ఆహ్లాదాన్ని కలిగించే చల్లని వాతావ రణం ఎంతో సరదాగా వుండేది. నేనంటే మానాన్నకు వల్లమాలిన ప్రేమ. నాన్న మాగురించి చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. మా అక్కయ్యలు కూడా నన్ను గారాబంగా చూసుకునేవారు. మేము కడపలోని క్రిస్టయన్‌లేన్‌లో వుండేవారం. దగ్గర్లోనే పాలకొండలు వుండేవి. అక్కడ ప్రకృతి చాలా బాగుండేది. ఆ ప్రకృతి రమణీయమైన దృశ్యాలు చూడడానికి మా వీధిలో వాళ్ళు వెళుతుండేవారు. కాని నాన్న నన్ను బయటకు పంపేవారు కాదు. చిన్నప్పుడు బొమ్మలా వుండేదాన్నట. అందుకని స్కూల్‌లో డ్యాన్స్ చేయించేవారు.
చదువు…
కడపలో 8 తరగతి వరకు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో చదివాను. నాకు సైన్స్, హిందీ సబ్జెక్టులంటే చాలా ఇష్టం. నాతోపాటు అజగర్, అనురాధ వీరు నాస్నేహితులు చదువల్లో మా మధ్య పోటీ వుండేది. చదవుల్లో మేము ముగ్గురు ఎప్పుడూ ఫస్టే. కడపలో చదువుకునే రోజుల్లో మా పాఠశాల బయట ఈతపండ్లు, రేగిపండ్లు, రేగిపండ్ల వడలు తదితరాలు అమ్మేవారు వాటిని కొనుక్కుని తినేవాళ్ళం.
చిన్నప్పుడు ఒకసారి తమ్ముడ్ని రక్షించే ప్రయత్నంలో చెయ్యి విరిగడంతో పుత్తూరు తీసుకువెళ్ళి కట్టు కట్టించారు. చెయ్యి విరిగిన దగ్గర నుంచి నాన్నగారు నన్ను ఎక్కడికి పంపించేవారుకాదు. నాన్న మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేవారు.
ఆ రోజుల్లోనే నాన్నగారు మమ్మల్ని పాఠశాలకు రిక్షాలో పంపించేవారు. రిక్షాలో పాఠశాలకు వెళ్ళేటప్పుడు దారిలో టీచర్స్ ఎవరైనా కనపడితే వారికి గౌరవమిచ్చి, రిక్షా నుంచి దిగి నడచి వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో గురువులంటే భయం, భక్తి, గౌరవం వుండేవి. మాకు సుందరమ్మ అనే టీచర్ క్లాస్ టీచర్‌గా వుండేవారు . ఆమె అంటే మాకు చాలా గౌరవం. ఆమె అందరికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పేవారు. పిల్లలందరు చాలా స్నేహంగా అరమరికలు లేకుండా వుండేవాళ్ళం. నేను చిన్నప్పటి నుండి చాలా సాఫ్ట్ – ఇప్పటికి అంతే.
నా చిన్నవయస్సులోఒకసారి వరదలు వచ్చాయి. సంవత్సరం జ్ఞాపకంలేదు. అపుడు ప్రముఖనటులు ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తదితరులు వరద బాధితుల సహాయార్థం మా వూరికి వచ్చారు. నాన్నగారు నా చేత డబ్బులు ఏన్‌టీ రామారావుగారి జోలెలో వేయించారు. తరువాత ఆయనకు పూల మాల వేశాను. ఆ దండ అందుకుని నాకు ముద్దు పెట్టారు. చిన్న వయస్సులో ఎన్‌టీ రామారావు గారిని దగ్గరగా చూడడం మరువరాని సంఘటన కదా. భవిష్యత్‌లో ఆ మహానటుడితోనే కలిసి ‘శ్రీకృష్ణ సత్య’లో నటించే అవకాశం లభించింది.
కడపలో పర్మినెంట్ సినిమా హాల్‌లు రెండు వుండేవి. టూరింగ్ హాల్స్ వుండేవి. తెలుగు, హిందీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి. నాన్నగారు హిందీ సినిమాలుకు ఎక్కువ తీసుకెళ్ళేవారు. ఆ సినిమాల ప్రభావం నాన్నగారి మీద ఎక్కువగా వుండేది. ఇంకో సంఘటన చిన్నప్పుడు 3వ ఏట రేడియోలో పాట వస్తుంటే దానికి అనుగుణంగా డ్యాన్స్ చేసేదాన్నట అది చూసి మా అమ్మ నాన్నలు నాకు డ్యాన్స్ నేర్పించాలని అనుకున్నారు. దాంతో నాకు నృత్యం నేర్పించారు.
మద్రాస్ నగరంలో …
స్కూల్‌కి సెలవులిచ్చినపుడు అప్పుడప్పుడు నాన్నగారు మమ్మల్ని మదరాసు తీసుకొచ్చేవారు. మదరాసులో అన్ని ప్రాంతాలు చూపించేవారు. ఒకటి రెండు సినిమాలు కూడా చూపించేవారు. అప్పట్లో నాకు డ్యాన్స్ నేర్చుకోవాలి. సినిమాలో నటించాలి అలాంటి కోరికలే లేవు. తల్లిదండ్రులు ఏమిచెబితే అది వినేవాళ్ళం.
నాన్నగారు నన్ను ప్రముఖ నాట్యాచార్యులు ‘వెంపటి చినసత్యం’ గారి వద్ద డ్యాన్స్ నేర్చుకోవడానికి చేర్పించారు. అప్పుడు 8వ తరగతి పరీక్షలు రాసి, సెలవుల్లో డ్యాన్స్ నేర్చుకున్నాను. నాకు డ్యాన్స్ క్లాస్‌లో గ్యాప్ రాకూడదనే నాతో మా అమ్మను వుంచారు. ఇక చదువుకూడా ఇక్కడే సాగించేలా ఆలోచించి నన్ను కేసరి హైస్కూల్‌లో చేర్పించారు. డ్యాన్స్ నేర్చుకుంటూనే, కేసరి హైస్కూల్‌ల్లో 9,10 తరగతులు చదివాను.
మా అమ్మ మమ్మల్ని క్రమశిక్షణగా పెంచారు. నాన్నగారు మద్రాస్ వచ్చినప్పుడల్లా సినిమాకు తీసుకెళ్ళేవారు. మిగతా సమయంలో అమ్మ బయటకు వెళ్ళేనిచ్చేవారు కాదు. నేను డ్యాన్స్ పూర్తి చేసి ఆరంగ్రేట్రం అంటే – కడపలోనే నాన్నగారు నా తొలి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇది 1975లో జరిగింది. తరువాత నృత్యప్రదర్శనలు ఎక్కువగా తమిళనాడులోనే ఇచ్చాను..
సినీరంగప్రవేశం…
‘వెంపటి చినసత్యం’ మాష్టారు గారి వద్ద డ్యాన్స్ నేర్చుకొంటుండగా సినిమా అవకాశం వచ్చింది. అప్పుడు నాకు పదమూడున్నర సంవత్సరాలు వుండవచ్చు. మాకు తెలియకుండానే డ్యాన్స్ నేర్చుకునే పిల్లల ఫోటోలు మాస్టారి శిష్యుడైన ఎంఎస్ శైవమాస్టారు రామవిజేత ఫిలిమ్స్ వారికిచ్చారు. వారు తీసే ‘తల్లిదండ్రులు’ సినిమాకి కొత్త అమ్మాయి కావాలని నా ఫోటో సెలక్ట్ చేశారు. అందులో మహానటి సావిత్రి నాకు అమ్మమ్మగా, జగ్గయ్య తాతయ్యగా నటించారు. వారికి మనువరాలిగా నేను నటించడం నిజంగా నా అదృష్టం. ఇందులో హీరో గా శోభనబాబు నటించారు.
ప్రముఖ దర్శకులు విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఎస్‌వీఎస్ మూవీస్ వారు నిర్మించిన ‘నిండుహృదయాలు’ అనే సినిమాలో ఓ పాటకు డ్యాన్స్ చేసే అవకాశం లభించింది. సినిమాలో అవకాశాలు రావడంతో నా చదువుకు ఫుల్‌స్టాఫ్ పడింది. ఆ తర్వాత ‘పిచ్చోడిపెళ్ళి’ ‘తల్లికూతుళ్ళు’ ఇలాంటివి ఓ పదిహేను సినిమాలు చేశాను. 1976లో ‘మన్మథలీలలు’ సినిమాలో కమలహాసన్‌తో నటించడం ఓ అనుభూతి. అందులో ‘హాలో మైడియర్ రాంగ్‌నంబర్’ అనే పాట చాలా హిట్టయ్యింది.
దాదాపు 280 తమిళ సినిమాలలో నటించాను. దర్శకులు ఎలా నటించమంటే అలా నటించేదాన్ని, ఎందుకంటే కథకు తగ్గ పాత్రనే వారు నాచేత చేయించేవారు. సినిమాలు ఒకవైపు, ఇంకొవైవు నృత్య ప్రద ర్శనలతో పాటు స్టార్‌నైట్స్ ప్రొగ్రామ్స్ చేసేదాన్ని, భారతీరాజా సినిమా ‘మన్‌వాసనై’ తమిళ చిత్రంలో నటించాను. ఆ చిత్రాన్ని తెలుగులోరీమేక్ చేశారు. ఆ చిత్రం పేరు ‘మంగమ్మగారి మనవడు’ ఈ చిత్రంతో మళ్ళీ నేను తెలుగు తెరపై కనిపించాను. అలా పలు సినిమాల్లో నటిస్తూ, హిందీ సినిమాల్లో కూడా నటించాను. నేను నటించిన సినిమాలు వెయ్యికి పైనే వుంటాయి.
నేను ఆర్థికంగా నిలదొక్కుకున్నానంటే దానికి కారణం తెలుగు సినిమా పరిశ్రమేనని చెప్పాలి. తెలుగు నిర్మాతలు, దర్శకుల ప్రోత్సాహంతో నేనిస్థితిలో వున్నాను. తమిళనాడు ప్రభుత్వ పలు అవార్డులిచ్చి నన్ను సత్కరించింది.
సన్మానం
ఏ మాటకామాటే చెప్పాలి ఇటీవల మా కడపలో నిర్వహించిన కడప ద్విశాతాబ్ది ఉత్సవాల సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చేతులు మీదుగా ‘మా కడప ముద్దుబిడ్డ’ని సన్మానించారు. ఆ సంఘటన నేను ఎన్నటికీ మరువలేను. ఆ ఉత్సవాలకు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా హాజరయ్యారు.
వివాహం…
నాకు జనవరి 27వ తేదీ 1985లో వివాహం జరిగింది. మా వారి పేరు. అమలనాధన్. ఈయన కడపలోని సెయింట్ జోసఫ్ కాలేజి ప్రిన్స్‌పాల్, కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
మాకు ఏకైక సంతానం అమ్మాయి. అమ్మాయి పేరు అనుష్య. గారాలపట్టి ఇంజనీరింగ్ చదివింది. వాళ్ళనాన్నలాగే చదువంటే నా కూతురుకి మహా ఇష్టం. మా అమ్మాయి డ్రాయింగ్ బాగా వేస్తుంది. ఈ మధ్యనే అమ్మాయికి పెళ్లి చేసేశాం.
కెరీర్ ..
నేను తొలినాళ్ళలో తెలుగు సినిమాలు చేసినా, తమిళ సినిమాలు కూడా చాలానే చేసాను. వీటిలో కె.బాలచందర్‌గారు, భారతీరాజాగారి దర్శకత్వంలో చేసిన సినిమాలు నాకు లైఫ్ ఇచ్చాయి. అంతకు మునుపు చేసిన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం నా కుటుంబసభ్యుల అభివృద్ధికి ఖర్చు పెట్టాను. భారతీరాజాగారి మన్వాసిని (1984) సినిమాతోనే నాకు గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో నేను నటించి వుండకపోతే ఇన్ని తెలుగు సినిమాలు చేసుండేదాన్ని కాదు. మనవాసిని సినిమాను తెలుగులో మంగమ్మగారిమనవడుగా రీమేక్ చేశారు. ఈ సినిమాను గోపాల్‌రెడ్డిగారు పట్టుబట్టి మన్‌వాసిినిలో చేసిన పాత్ర నేనే చేయాలని, నా చేత చేయించారు. తమిళంలో కె.బాలచందర్, భారతీరాజాల ద్వారా గుర్తింపు వస్తే, తెలుగులో కోడిరామకృష్ణగారి ద్వారా గుర్తింపు వచ్చింది. తర్వాత ముఖ్యంగా ఉషాకిరణ్ మూవీస్ వారి అన్ని సినిమాలలో చేసాను. వారి సినిమాలలో చేసేటప్పుడు మంచి గుర్తింపు వచ్చింది. మన్వాసిని సినిమా చేయకుంటే నాకింత పేరు, గుర్తింపు, హోదా, ఆర్ధికంగా వెసులుబాటు కలగడం జరిగి వుండేదికాదు. ఆ తర్వాత చాలా మంది నిర్మాతలు, దర్శకుల సహాయసహకారాలతో నేనీస్థాయికి వచ్చాను. నటనలో నాకు ఎలాంటి భేషజాలుండేవికావు. దర్శకులు ఎలా నటించమంటే అలా నటించేదాన్ని. కన్నడ, మలయాళంలో కూడా హీరోయిన్‌గా చేశాను. ఇప్పడు చాలా, సీరియల్స్, సినిమాల్లో బిజిగానేవున్నాను.
కారెం దోసేలూ.. అలసంద వడలూ
కడపలో కోమటివారు నెయ్యి దోశెలు వేసి అమ్మేవారు. అది చాలా ఫేమస్. వాటి కోసం జనాలు ఎగబడేవారు. అప్పట్లోనే రెండు రూపాయలుండేది. ఇప్పుడు పదిరూపాయలు. నెయ్యి దోశెకు ఎర్రకారం, శెనగపప్పు పొడి, శెనగపప్పుతో బాంబే చట్నీ చేస్తారు. ఉదయం ఒక్కదోశ తింటే మధ్యాహ్నం మూడుగంటలైనా ఆకలేయ్యదు. నేను ఎప్పుడు కడపకు పోయినా నెయ్యిదోశ, తెప్పించుకు తింటాను. ఆంధ్రలో కాదు కదా మన ఇండియాలో ఎక్కడా ఇలాంటి దోశె, ఎర్రకారం దొరకదు. అందుకని ఇష్టంగా తెప్పించుకు తింటుంటాను.
ఇంకేటంటే మావూర్లో అలసంద వడలు ఫేమస్. నేను వూరికి వెళ్ళినప్పుడు నా డిష్‌లో ఇవి తప్పనిసరిగా వుండాల్పిందే. అలాగే గోంగూర మాంసం చాలా ఫేమస్. చింతచిగురుతో చేపలపులుసు చేస్తారు. మావూర్లో చేసే ఉలవచారు రుచి చాలా బాగుంటుంది. నేను ఆంధ్రలో తయారు చేసే ఉలవచారును రుచి చూసానుగాని మా రాయలసీమలో చేసే ఉలవచారు రుచి మరెక్కడా రాదు.
అలాగే వేసవి కాలం వచ్చిందంటే అన్నం లేదా రాగిసంగటి, జొన్న అన్నంలో పెరుగు కలుపుకుని, పచ్చి మిర్చి, ఉల్లి ముక్కలు నంచుకుని తింటుంటాం. నేను సినిమా రంగానికి వచ్చిన తర్వాత రకరకాల ఆహార పదార్ధాలు తిన్నానుగాని మావూర్లో తయారు చేసే ఆహార పదార్ధాల రుచి మరెక్కడా రాదు.
కడప ప్రత్యేకత అంటే మనిషిని నమ్మితే ప్రాణమిస్తారు. నేను సినీరంగంలో వచ్చిన తొలిరోజుల్లో ఆంధ్ర ప్రాంత వాసులు దీర్ఘాలు పలుకుతూ ఏంటండీ, ఏవూరు మీదీ? మీ భాష కాస్త తేడాగా వుందే అని గేలిచేసేవారు. అప్పుడు నాకు చాలాబాధ కలిగేది. కాని ఇప్పుడు మా రాయలసీమ భాషతోనే సినిమాలు తీస్తున్నారు. ఇది నాకెంతో గర్వకారణంగావుంది. ఉదాహరణకు నటులు జయప్రకాష్ రాయలసీమ యాసతోనే మాట్లాడుతుంటారు. మావూరికి అప్పుడు, ఇప్పుడు పేరు ప్రఖ్యాతులున్నాయి.
అమీన్‌పీర్‌దర్గా …
నేను చిన్నప్పుడు తరచూ దర్గాకు వెళుతుండేదాన్ని. దర్గాలో వున్న స్వాములోరికి మహత్తు వుంది. మా చిన్నపుడు పిల్లలు భయపడినా, జ్వరాలు వచ్చినా మమ్మల్ని దర్గాకు తీసుకెళ్ళి మంత్రించి తీసుకువస్తారు. తాయత్తులు కట్టించేవారు. ఇంట్లో కాని, వ్యాపారాలలోను దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండేందుకు మంత్రించిన రాగి రేకులు తీసుకువచ్చి ఇండ్లలో పెట్టుకుంటుంటాం. అలాంటి రాగిరేకు మా ఇంట్లోనూవుంది. నాకు పెళ్ళయిన తర్వాత కూడా చాలా సార్లు వెళ్ళాను. ఈ దర్గాకు మా వూర్లో తరతమ బేధాలులేవు. ప్రతి ఒక్కరు వెళ్ళి దర్గాను దర్శించుకుని వస్తుంటారు. ఇప్పుడు మీడియా ప్రాబల్యంతో ప్రతి ఒక్కరు దర్గా గురించి అడుగుతుంటారు. చాలా మంది వచ్చి పోతుంటారు. మా చిన్ననాటి రోజుల్లో ఎలాంటి ప్రచార సాధనాలు లేని రోజుల్లోనే భక్తులు బాగా వచ్చేవారు. ప్రతి సంవత్సరం ఉరుసు మహోత్సవాలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మా వూర్లో మతసామరస్యం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. మేము అక్కచెల్లెళ్లు, తమ్ముళ్ళతో కలిసి దర్గాకు వెళుతుండేవారం. అలాగే మిగతా ఆలయాలకు కూడా వెళుతుండేదాన్ని.
మా అమ్మమ్మకు కడపలో హోటళ్ళుండేవి. అలాగే మామయ్య శాంతయ్య హోటల్ నడుపుతుండేవారు. సినిమారంగంలోకి ప్రవేశించినప్పుడు విజయ అనే పేరుతో చాలామంది నటులు వుండడంతో తన ఇంటిపేరైన ‘వై’ని జోడించి వై.విజయగా అందరూ పిలిచేవారు.
నేను ఆర్ధికంగా నిలదొక్కుకున్నానంటే దానికి మా దర్శక, నిర్మాతలే కారణం అంటూ వారికి పేరుపేరునా కృతజ్ఞతలు!
Article chala bagundi.
Pramukhula gurinchi Prajalaku teliyacheppadam chala manchidi