
పెరుగఁబెరుగఁ బెద్దలుగాఁగా పెనువెఱ్ఱి వట్టుబుద్ధెఱిఁగితే – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ పెరుగఁబెరుగఁ బెద్దలుగాఁగా పెనువెఱ్ఱి వట్టుబుద్ధెఱిఁగితే మరులు మఱచితేనే యిన్నిటి గెలిచే మర్మము సుండీ జ్ఞానులకు ॥చ1॥ జననమందినయప్పుడు దేహి సన్యాసికంటే నిరాభారి తనరఁ గౌపీన కటిసూత్రముల తగులములేనిది గంబరి తనుఁదా నెఱఁగడుయెదిరినెఱఁగఁడు తత్వధ్యానాలయనిర్మలచిత్తుఁడు పెనఁగేకోరిక యించుకంత లేదు పేరులేనివాడు వీడువోయమ్మా ॥చ2॥ నిద్దురవొయ్యేటి యప్పుడుదేహి నిత్యవిరక్తునివంటిఘనుఁడు బుద్ధి సంసారముపై నించుకా లేదు భోగమేమీ నొల్లఁడు వొద్దనే యేపనులకుఁ జేయఁబోఁడు వున్నలంపటాల కేమియుఁ జొరఁడు కొద్దిలేనియాస యెందువోయనొకో కోపమేమి లేదు వీఁడివో యమ్మా ॥చ3॥ హరి శరణన్న యప్పుడు దేహి అమరులకంటే కడునధికుఁడు పరమునిహము నఱచేతిదే ప్రయాస మించుక లేదు దురితము లేదు దుఃఖములు లేవు తోడనే వైకుంఠ మెదురుగా వచ్చు గరిమ శ్రీవేంకటేశుఁడు వీఁడివో కానరైరిగా యిన్నాళ్లమ్మా |
రాగము: బౌళి రేకు: 0089-06 సంపుటము: 1-440 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి