ఆదివారం , 22 డిసెంబర్ 2024
థామస్ మన్రో

సర్ థామస్‌ మన్రో – 1

ఆంధ్ర రాష్ట్రంలో అతి ప్రాచీన చరిత్ర కలిగిన జిల్లాలలో కడప ఒకటి. సీడెడ్‌ జిల్లాలుగా పిలువబడే రాయలసీమ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. రాక్షస తంగడి యుద్ధం తరువాత గోల్కొండ నవాబుల ఆధీనంలోకి పోయింది. తరువాత హైదరాలీ, టిప్పుసుల్తాన్‌ ఆధీనంలోకి వచ్చింది. 1792లో టిప్పు ఓడిపోయి శ్రీరంగపట్టణము సంధి వలన ఈ రాయలసీమ నైజాంకు వెళ్లింది.

హైదరాబాదు నవాబుతో ఈస్టిండియా కంపెనీ వారు సైన్య సహకార పద్ధతి ద్వారా అక్టోబర్‌ 20, 1800 సంవత్సరములో సీడెడ్‌ ప్రాంతంను కంపెనీ వారికి దత్తత చేశారు. అందువలన ఈ ప్రాంతంనకు దత్త మండలాలు అని పేరు వచ్చింది. ఆనాడు ఉన్న కడపకు భౌగోళికంగా ఎంతో వ్యత్యాసం ఉంది. ఆనాడు ఉత్తరాన కృష్ణానది నుండి దక్షిణాన కౌండిన్యనది వరకు విస్తరించి ఉండేది. ఇప్పటి ప్రకారం నేటి ప్రకాశం జిల్లాలో ఉన్న దూపాడు నుంచి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు వరకు ఉండేది. ఈస్టిండియా కంపెనీ పాలనలోకి వచ్చిన తరువాత 1800 నుంచి 1807 వరకు దత్త మండలాలకు ప్రప్రథమ ప్రిన్సిపల్‌ కలెక్టర్‌గా మేజర్‌ థామస్‌ మన్రో ఉన్నాడు.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 1998

మన్రో రాక పూర్వం భూమి శిస్తు విధానం

ఎంతోమంది చక్రవర్తులు, రాజులు, సామంతుల పాలనలో ఈ జిల్లా అనేక పర్యాయాలు మార్పులకు గురి అవుతూ ఉండటం వలన స్థిరమైన పాలనా వ్యవస్థ గానీ, భూమి శిస్తు విధానం గానీ లేకపోయింది. పాలకులు మారినప్పుడల్లా కొత్త పాలనా వ్యవస్థ, కొత్త భూమి శిస్తు విధానం అమలులోకి వచ్చింది. పాలకులు తమ ఇష్టాయిష్టాలను బట్టి, అవసరాలను బట్టి భూమి శిస్తు వసూలు చేసేవారు. 13వ శతాబ్దంలో పండిన పంటలో ఆరవ వంతు రాజుకు శిస్తు చెల్లించాలన్నారు.

విజయనగర రాజుల కాలంలో ఈ జిల్లాలో ఈ పద్ధతే కొనసాగింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కొత్త శిస్తు విధానం అమలులోకి వచ్చింది. అది పండిన పంటలో ఆరవ వంతు రాజుకు, 13వ వంతు బ్రాహ్మణులకు, 20వ వంతు భగవంతునికి అని తెలిపి శిస్తు వసూలు చేసేవారు. ఈ మూడు రకాల శిస్తులు చక్రవర్తికే జమ చేసేవారు. విజయనగరాధీశుల కాలంలోనే మొట్టమొదటిసారిగా భూములను వర్గీకరించడం, కొలతలు కొలవడం పంట ఎంత పండుతుందా అని అంచనా వేసి దాని ప్రకారం శిస్తు నిర్ణయించేవారు. అయితే ఈ పద్ధతి సక్రమంగా జరగలేదని తెలుస్తోంది. వారి కాలంలోనే రైతుల నుంచి శిస్తును వసూలు చేసే బాధ్యతను పాలెగాళ్లే ఎక్కువ నిర్వహించేవారు.

చదవండి :  మన కలమళ్ళ శాసనం (తొలి తెలుగు శాసనం) ఎక్కడుంది?

పాలెగాళ్ల వ్యవస్థ

13వ శతాబ్దంలో ఈ పాలెగాళ్ల వ్యవస్థ అమలులో ఉండేదని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. కొన్ని గ్రామాలను ఒక సముదాయంగా చేసి దానికి ఒక పాలెగాణ్ణి నియమించేవారు. రాజుకు యుద్ధ సమయాలలో సైనికంగాను, ఇతర సహాయం చేయడం మరియు తన పరిధిలో ఉన్న గ్రామాలను శత్రువుల బారి నుంచి కాపాడటమే కాక అలజడులు, అశాంతి చెలరేగకుండ చూడవలసిన బాధ్యత పాలెగానిదే. ఇందుకు ప్రతిఫలంగా తమ పరిధిలోని గ్రామాలలో శిస్తును పూర్తిగా కాని, కొంత గాని వసూలు చేసుకునే హక్కు పాలెగాడికి ఉండేది.

చదవండి :  సంబెట శివరాజు నిర్మించిన తిరుమలనాథ ఆలయం!

ఒక విధంగా ఈ పాలెగాళ్లు రెవిన్యూ పోలీసు విధులు నిర్వహించేవారు. ఈ పాలెగాళ్ల వ్యవస్థ విజయనగర రాజుల కాలంలో బాగా బయటపడింది. అయితే విజయనగర సామ్రాజ్యం పతనం అయిన తరువాత ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులను అవకాశంగా తీసుకుని ఈ పాలెగాళ్లు తమ అధికారాలను విస్తృతపరచుకున్నారు. తరువాత గోల్కొండ, నవాబులు, మరాఠులు, హైదరాలి, టిప్పుసుల్తాన్‌ మొదలగువారు కూడా పాలెగాళ్లను అణచలేకపోయారు. 1800వ సంవత్సరంలో కడప జిల్లా ఈస్టిండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చే నాటికి మొత్తం మీద 82మంది పాలెగాళ్లు ఉన్నారు. వారి వెంట ముప్పయి వేల మందికి పైగా సిబ్బంది ఉండేవారు.

(ఇంకా వుంది)

– రామావజ్జల నాగభూషణశర్మ

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: