సోమవారం , 23 డిసెంబర్ 2024

కూలిన బురుజు (కథ) – కేతు విశ్వనాధరెడ్డి

కూలిన బురుజు

రు దగ్గరికొచ్చింది. అంతకు ముందు లేని పిరికితనమూ, భయమూ నాలో. రెండు వారాల కిందట ఖూనీ జరిగిన ఊళ్ళోకి అడుగుపెట్టబోతున్నాను. పుట్ట చెండ్లాట మాదిరి నాటుబాంబుల్తో ఆడుకున్న గ్రామ పార్టీల ప్రపంచంలోనికి ప్రవేశిస్తున్నాను. కక్షలూ, కార్పణ్యాల అడవిలోకి వెళుతున్నాను.

కొత్త అనుభవం. పదేళ్ళ కిందట జ్ఞాపకాల్లో నిలిచిన ఊరు ఇది కాదనిపిస్తోంది. పక్క కళ్ళాల్లో మేపు కోసం వాముల దగ్గర కొచ్చే రైతుల సందడి లేదు. బండ్ల బాటలో నిత్యం ఎదురవుతుండే ఎద్దుల బండ్ల రాపిడి లేదు. ఎద్దుల మెళ్ళో గంటల సవ్వడీ లేదు. ఎనుములూ లేవు. గొడ్లూ లేవు. ఒక్క మగ పురుగు లేదు.

ఇది ఊరా? వల్లకాడ? ఈ ఆలోచన రావడంతో ఒళ్ళు జలదరించింది. ఊళ్ళో ఇళ్ళ తలుపులేమో తెరిచి ఉన్నాయి. ఎగువ వీధిలో, ఇండ్ల అరుగుల మీద కూర్చున్న ఒకరిద్దరు ఆడవాళ్ళు నన్ను ఎగాదిగా చూసి ఇంట్లోకి వెళ్ళారు.

ఊరి మధ్య మురారి దండు రోజుల్లో కట్టించిన బురుజు దగ్గరకు వచ్చాను. బురుజు చుట్టూ కట్టిన అరుగు మీద ఎప్పుడూ ఉండే జనం లేరు. బురుజు పైకి చూశాను. సగం పడిపోయింది. పైన పిచ్చిమొక్కలూ… ఒకప్పుడు ఆ బురుజు ఊరి రక్షణకూ, ఐక్యతకూ సంకేతం. ఇప్పుడో? కూలిపోయి… బురుజు చుట్టూ కట్టిన అరుగు మీద పడుకొన్న ముసలాయన నన్ను చూసి లేచి కూర్చున్నాడు – ఖణేల్‌ ఖణేల్‌మని దగ్గుతూ. దగ్గు ఆపి ఆయాసంతో – ”ఎవరింటికి?” అన్నాడు.

వెన్నుముకలో వణుకు పుట్టింది. మా అక్క పేరుగానీ, మా బావ పేరుగానీ చెప్పలేకపోయాను. ”సీతమ్మ గారింటికి” అన్నాను. ”సీతమ్మ నీకేంగావాల?” అన్నాడు ముసలాయన.

నిగ్రహించుకొని ”మా అత్త” అన్నాను. ”ఏ ఊరు మనది?” అంటూ మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు. ”తిరుపతి” అన్నాను.

బ్రీఫ్‌కేస్‌ కుడిచేతిలోకి మార్చుకొని, ఎడమచేత్తో ఫాంటుజేబులోని కర్చీఫ్‌ తీసుకొని చమట తుడుచుకోక తప్పలేదు. నిజానికి తిరుపతి నేను ఉద్యోగం చేసే చోటు మాత్రమే. మరేం ప్రశ్నలు వేస్తాోనని గబగబా బురుజుదాటి, దిగువ వీధిలో ఉండే మా లక్ష్మమ్మ ఇల్లు చేరుకొన్నా.

ఇంటి వసారాలో అరుగుల మీద ఇద్దరు ఇరవై పైబడిన వాళ్ళెవరో కూర్చొని మెల్లగా మాట్లాుకుంటున్నారు – రహస్యాలు మాట్లాడుకొంటున్నట్లు. వాళ్ళు నన్ను చూసి మాట్లాడటం  మానుకొన్నారు. అంతలోనే అప్పుడే ఇంట్లోంచి వచ్చిన మా పెదనాన్న నన్ను చూసి తబ్బిబ్బు పడిపోయాడు. దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. వచ్చే కన్నీళ్ళను ఆపుకోలేక, భుజం మీది పంచెను ముఖానికి వత్తుకున్నాడు. వసారా అరుగు మీద కూర్చున్నాను. ఆయనా నా పక్కనే కూర్చున్నాడు. అయిదారు నిముషాలు ముఖం మీది పంచెను తియ్యలేకపోయాడు.

నా మనస్సు బరువెక్కుతోంది. పెదనాన్నే నిగ్రహించుకొని, ”ఒరే కిష్టుడూ! ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కోను నీళ్ళు తేపో” అన్నాడు.

ఆ కిష్టుడు చెంబుతో నీళ్ళు తెచ్చాడు. కిష్టుడూ, కిష్టుడి స్నేహితుడూ పొరుగూరులోని మా బావ వైపు బంధువులని పెదనాన్న పరిచయం చేసి, ”ఇంట్లోకి పోదాం రా” అన్నాడు.

ఇంట్లోకి వెళ్లి నడవలో మంచం మీద కూర్చొన్నా. పెదనాన్న లోపలికి వెళ్ళాడు. లక్ష్మక్క ఎదురుపడితే ఏం మాట్లాడాలో, ఎట్లా ఓదార్చాలో తోచడం లేదు. అనుభవంలో లేని వాటిని ఎదుర్కోవడం కష్టం. వంటింట్లోంచి పెదనాన్న సీతమ్మత్తను పిల్చుకొని వచ్చాడు. ఆమె జగితి మీద కూలబడింది… వెక్కి వెక్కి ఏడుస్తూ.

”ఈ ముదనష్టపోళ్ళు నా కొడుకునే పొట్టన పెట్టుకోవాలా నాయనా? ఒకరి సుద్దికీ, సొంటికీ పోయినోళ్ళం, ఒకరిది తిన్నది కాదు. నా ఉసురు తగలకపోదు. వాళ్ళిండ్లలో పీనుగులు వెళ్ళకపోతే చూడు…” అంటూ సీతమ్మత్త, నెత్తిన రెండు చేతులూ పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది.

”ఊరుకో అత్తా!” అన్నా ఎట్లా సముదాయించాలో తెలియక, కళ్ళ నీళ్ళు ఆపుకొంటూ. ”ఏమూరుకునేది నాయనా? ఎట్లా ఊరుకొనేది? మీ అక్కను చూడు” వెక్కిళ్ళు ఆపి గుడ్ల నీరు కుక్కుకొంటూ అంది సీతమ్మత్త.

”లక్ష్మక్క ఎక్కడుంది?” అన్నా. సీతమ్మత్త తల వెనక్కి తిప్పి లోపలికి చూసింది. ”ఆ కొట్టిడింట్లో” అన్నాడు పెదనాన్న.

లేచి జగితి దాటి గాదెల అరుగు కంత గుండ లోపలికి వెళ్ళి, కుడి పక్క కొట్టిడింట్లోకి వెళ్ళాను. లక్ష్మక్క చాపమీద ముడుచుకొని పడుకొని ఉంది. ”లక్ష్మక్కా!” అని దుఃఖం ఆపుకోలేకపోయాను. అక్క ముఖం మీద చెరుగు తీసి, ఏడ్పు తమాయించుకొంటూ అంది – ”మీ బావను చంపినోడు కుక్క చావు చచ్చేదాకా ఆ గాజులు పగలగొట్టుకోను. ఈ బొట్టు చెరుపుకోను అన్నానురా! నువ్వు చదువుకున్నోడివి చెప్పు. ఇది తప్పంటావా?”

చదవండి :  హృదయమున్న విమర్శకుడు - రారా!

లక్ష్మక్క ప్రశ్న విని నాకు నోట మాట రాలేదు. ఆమెలోని పట్టుదలా, దాని పర్యవసానాలూ ఊహించగలను. కానీ ఆమెను హెచ్చరించాలో, సమర్థించాలో, అభినందించాలో తెలియడం లేదు.

మాట మార్చి అన్నాను. ”పిల్లలిద్దరూ ఎక్కడికి వెళ్ళారు?” అని.

”పెద్దోడు శంకరు మనూరికి పోయినాడు. చిన్నోడు వాసు ఊళ్ళోనే మన వాళ్ళిండ్లలోనే ఎక్కడో ఉంటాడు. దినదిన గండమాయె!” అంది దిగులుగా. ”ఇంత కష్టమొచ్చిన సంగతి పేపర్లో చదివిన దాకా నాకు తెలియదు” అన్నా.

”నువ్వెక్కడో ఉద్యోగం చేసుకునేవాడివి, ఇబ్బంది పెట్టడమెందుకని జాబు రాయించలేదు. మా తిప్పలు తప్పేవి కావు. రెండు రోజులుండి పో” అంది లక్ష్మక్క. ”లేదు. రేపు పొద్దున్నే పోవాలి” అన్నా.

”మీ బావే ఉండి ఉంటే…” లక్ష్మక్క మాట్లాడలేక చీర చెంగుతో కళ్ళు వత్తుకొంది. అవును మా బావే ఉండి ఉంటే నాలుగైదు రోజులు కదలనిచ్చేవాడు కాదు. ఉద్యోగం రాక, దిక్కుతోచక, నాన్న చూసే పెళ్ళి సంబంధాలు తప్పించుకోలేక మానసికంగా కుంగిపోతున్న రోజుల్లో, ఆర్నెల్లపాటు ఆశ్రయమిచ్చి ధైర్యాన్నిచ్చిన దంపతులు లక్ష్మక్కా, బావా. లక్ష్మక్క ఎదురుగా ఉండలేక మళ్ళీ నడవలోకి వచ్చి మంచం మీద కూలబడ్డను. ”తాతా!” అంటూ పది పన్నెండేళ్ళ కుర్రాడు లోపలికి వచ్చాడు. నన్ను చూసి ఆగాడు.

”తిరుపతిలో ఉండడే. ఆ మామ రా!” అన్నాడు పెదనాన్న.

వాడు అదే వాసు నవ్వాడు. ”ఏమన్నా తెలిసిందిరా?” అన్నాడు పెదనాన్న. ”ఎం.ఎల్‌.ఏ. వాళ్ళు మన ఎదురుపార్టీ వాళ్ళకి రెండు రైఫిల్స్‌ తెచ్చిచ్చినారంట తాతా! చానా దూరం నుంచి వాటిని కాల్చొచ్చునంట!” అన్నాడు ఉత్సాహంతో.

వాడి భాషా, చదువూ, గూఢచారి నేర్పూ చూసి నాకు తల తిరిగిపోయింది. ఏ గూటి చిలక ఆ పాటే పాడుతుంది. ఏం చదివిస్తే ఆ చదువే అబ్బుతుంది. వాసుకు ఆ ఇంట్లో, ఆ ఊళ్ళో అబ్బిన చదువు అది.

”మనకేం భయం లేదు లేరా వాసూ! మన మండలం ప్రెసిడెంటు మామ నుంచి మీ అన్న శంకరు తెస్తాడు కదా రేపటికల్లా అంతకంటె పెద్దవి” అన్నాడు పెదనాన్న. వయసులో, బాధలతో పీక్కుపోయిన బుగ్గల మీద మీసాలు సవరించుకొంటూ…

”అది సరే తాతా! రాత్రికి పోలీసుల్ని మన ఇంటి మీదికి ఎగతోల్తారంట, అవతలి పార్టీవాళ్ళు. మన యూరముట్లు జాగ్రత్తగా పెట్టుకోవాలంట” అన్నాడు వాసు.

”యూరముట్లు ఏమిటి?” అని అడిగా పెదనాన్నను. పనిముట్ల అర్థంలో వాడలేదని తెలిసి. ”అవే మన దగ్గర పెట్టుకునేవి అవసరానికి… బాంబులు, పిస్టల్‌లాంటివి” అన్నాడు పెదనాన్న, రహస్యం మాట్లాుతున్న ధోరణిలో. నాకు మతిపోయింది ఈ ఊరు, ఈ వాతావరణం నాకేదో బీభత్సంగా కనిపిస్తున్నాయి.

చీకటి పడింది. లైట్లు లేవు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయి వారం రోజులైందట. ఇంట్లో మసిపట్టిన రెండు లాంతర్ల వెలుతురు. ఒకటి రెండు కిరసనాయిలు బుడ్ల వెలుతురు. లక్ష్మక్క ఒక స్తంభానికి జారగిలబడింది. సీతమ్మత్త జాలాట్లో బోకులు కడుగుతోంది. వాసు కొట్టిడింట్లోకి వెళ్ళాడు. పెదనాన్న మంచంలో వెల్లికిలా పడుకొని మిద్దె దంతెల వైపు చూస్తున్నాడు. కిష్టుడూ, కిష్టుడి స్నేహితుడు మరి రెండు మంచాల్లో పడుకొని తపస్సు చేస్తున్నారు. ఎవ్వరూ మాట్లాలేదు. ఏకాంతంలో నిశ్శబ్దం బావుంటుంది. మనుష్యుల మధ్య నిశ్శబ్దం ఎక్కువసేపు భరించడం కష్టం. ఇంట్లో గుడ్డి వెలుతురు నిశ్శబ్ద వాతావరణం కన్నా వసారాలో చీకటే మేలనిపిస్తుంది. చీకట్లో ఏం జరుగుతుందో అని భయం.

పెదనాన్న ”వసారాలో కూకుందాం” అంటే, కలిసి ఇద్దరం వసారా అరుగు మీద కూర్చున్నాం. నాకేం మాట్లాలో పాలుపోవడం లేదు. ”అసలు ఈ గొడవ ఎందుకొచ్చింది? ఎప్పుడు మొదలైంది?” అని అడుగుదామనుకొన్నాను మా పెదనాన్నను, ఆయనే మొదలుపెట్టాడు.

”కాని రోజులు వచ్చినాయి. నలుగురు కలిసి మెలిసి బతికే కాలం కాదు. ఎవడి మానాన వాడు పొయ్యే దినాలు కాదు. నేనక్కడికీ ఏడాది కిందట చెప్పినా మీ బావకు. ‘రైతు పాగీకి సారాయి యాపారం వద్దు’ అని. ‘కరువుల్తో సంసారం తగ్గిపోతుంటే దొరికిన పై ఆదాయం పోగొట్టుకోమంటావా, అందులోనూ లక్షలు పెట్టి మా పార్టీ వాళ్ళు గవర్నమెంటు పాట పాడి తెచ్చుకొంటే!’ అన్నాడు మీ బావ. పోనీలే అనుకున్నా. ఇబ్బంది పడినోళ్ళను సమయానికి మీ బావ ఆదుకునేవాడు. కాబట్టే ఊర్లో చిల్లర మల్లర జనం మీ బావంటే పడిచచ్చేవాళ్ళు. అవతలా రైతులే. కన్నుకుట్టింది. కాపుసారా కాసినారు. పుల్లలు పెట్టేవాళ్ళు ఊర్లోనే తయారైనారు. పనీపాట లేక దొరికితే ఏరక తిందామని ఆ పక్కా ఈ పక్కా కోపు దొక్కేవాళ్ళు రాజకీయాలోళ్ళు అయిపోయిరి. ఒకదానికొక మెలిక యాభై ఏళ్ళ నుంచి మన పల్లెలో లేని కులతగాదాలు పదేళ్ళలో వచ్చె. బాంబులొచ్చె, బరకట్లొచ్చె, మోసాల్తో సంపుకోవడమొచ్చె. కడకు ఇది మీ అక్క నెత్తి మీదకొచ్చె. పదివేలిచ్చి కూలీ నా కొడుకుల్తో చంపించినారు మీ బావను”. పెదనాన్న దుఃఖంలో మాట్లాలేకపోయాడు.

చదవండి :  సీమ బొగ్గులు (కథ) - దేవిరెడ్డి వెంకటరెడ్డి

అంతలో ఎవరో నలుగురైదుగురు వచ్చారు. సాయంత్రం ఊళ్ళోకి పై మనుషులు ఎవరో వస్తుంటే చూశామని చెప్పారు మా పెదనాన్నతో. అందరూ ఇంట్లోకి వెళ్ళి అరగంటసేపు మంతనాల్లో ఉన్నారు. ఆ తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయినారు. నేనూ పై మనిషినే అని గుర్తొచ్చేసరికి నా ధైర్యమేదో తెలిసి వచ్చింది. ఏదో భోజనం అయిందనిపించాం అందరమూ. భర్తను పోగొట్టుకున్న సోదరిని విచారించనికి వచ్చిన పై వాణ్ణి నేను. అవతలి పార్టీ వైపు మనుషులు ఏదైనా చిచ్చు పెట్టడానికి వచ్చినవాళ్ళేమో!

పెదనాన్నా మా బావ బంధువులిద్దరూ, అదే ఆ కిష్టుడూ, కిష్టుడి స్నేహితుడు నలుగురం వసారాలో పడుకున్నాం. మా సీతమ్మత్త వసారా బయట ఇంటి ముందరి ఖాళీ జాగాలో మంచం వేసుకొని పడుకొంది. మా లక్ష్మక్క వాసుగాడు ఇంట్లో పడుకున్నారు.

బయట కటిక చీకటి. ఏ అలికిడి వినిపించం లేదు. వసారాలో తగ్గించి పెట్టిన మసిపట్టిన లాంతరు మసి కాంతి. నాకు నిద్రరాలేదు. ఈ పల్లెటూళ్ళు నాకు తెలిసినవే. ఈ గాలి ఒకప్పుడు నేను పీల్చిందే. ఈ నీళ్ళు నేను తాగినవే. ఈ భూమిలో పండిన జొన్నలూ, రాగులూ నేను తిన్నవే. ఈ మనుషులు నాకు సరిగ్గా అర్థం అయిన వాళ్లేనా? ఒకవైపు పిలిస్తే పలికి కరవులు, మరొక దిక్కు కూలిపోతున్న సంసారాలు, గూనికి తోడు దొబ్బుడ వాయువన్నట్లు ఈ గ్రామకక్షలు… ఇక్కడి భవిష్యత్తేమిటి? ఈ రోజు కొంపదీసి మరేమీ జరగదు కదా? ఆ పై మనుషులెవరో ఇంటి మీదకు దండెత్తరు కదా? వట్టి అనుమానాలేమో? మనసును కమ్ముకొన్న సవాలక్ష సంకోచాలు. వింత భయాలు, నిర్వేదం.

ఆలోచనలు తెగడం లేదు. ఏ అర్థరాత్రో అయివుంటుంది. జీపు చప్పుడుకు ఉలిక్కిపడ్డాను. లేచి కూర్చుందామనుకొని పక్క మంచాలవైపు చూశాను. ఎవ్వరూ మంచాల్లో కదలడం లేదు.

ఇంటిముందు జీపు ఆగిన శబ్దం. బూట్లు టకటక, పోలీసులు. ఒక పోలీసు వేసిన బాటరీ లైటు వెలుతురు. నా గుండె వేగంగా కొట్టుకొంది.

మా సీతమ్మత్తని లేపి ఒక కానిస్టేబుల్‌ ”శంకరరెడ్డి ఇండ్లు ఇదేనా?” అన్నాడు. ”అవున్నాయనా!” అంది సీతమ్మత్త.

”ఇంట్లో ఉన్నాడ?” అన్నాడు ఎస్సయి. ”లేడు నాయనా!” అంది సీతమ్మత్త. టార్చిలైటు వేసి ”ఆ వసారాలో పడుకొన్నదెవరు?” అన్నాడు ఎస్‌.ఐ.

”మావాళ్లే” అంది సీతమ్మత్త. ఈలోగా అందరం లేచాము. మా పెదనాన్న కలగజేసుకుంటూ ”దివసానికి వచ్చినవాళ్ళం” అన్నాడు.

”మాకు దివసమొచ్చింది. ఇంటినిండా పై మనుషులున్నారు అని వైర్‌లెస్‌ ఇన్పర్మేషన్‌. ఇల్లు సోదా చెయ్యాలి” అన్నాడు ఎస్‌.ఐ.

అనుకోని సంఘటనతో, నా పిరికితనమో ఏమోగానీ నాకు నోటమాట రాలేదు. పోలీసులు తలుపు తెరిపించమన్నారు. మా సీతమ్మత్త తలుపు తట్టి వాసును పిలిచింది. గడిమాను తీసిన చప్పుడు, చిలుకు తీసిన శబ్దం. వాసు తలుపులు తెరిచాడు. బాటరీలైటు వేసుకొంటూ ఎస్‌.ఐ. ఇంట్లోకి వెళ్ళి అయిదు నిమిషాల్లో బయటికి వచ్చాడు.

పెదనాన్నతో ఎస్‌.ఐ అన్నాడు ”ఇదిగో పెద్దాయనా, పార్టీ కొంపల్లోకి పై మనుషులు రాకూడదని తెలుసుకదా?”

”కన్న కూతురిండ్లు సార్‌!” అన్నాడు పెదనాయన. ”సర్లే” అంటూ ఎస్‌.ఐ. మా వైపు తిరిగి ”మీ ముగ్గురూ జీపెక్కండి” అన్నాడు.

”సెర్చివారంటూ, అరెస్టు వారంటూ ఏవీ?” అని అడుగుదామనిపించింది. అడిగితే వాళ్ళు అడ్డం తిరిగి సోదా చేయవచ్చు. ఆ యూరముట్లనే మారణాయుధాలు ఏవైనా ఇంట్లో ఉంటే పెద్ద ముప్పే రావచ్చు. ఇప్పుడు ఘర్షణ పడి లాభం లేదు. బట్టలు కూడ మార్చుకోకుండ జీపు ఎక్కాను – మా బావ తాలూకు బంధువులిద్దరితో, ఈ చప్పుళ్ళకు ఊరు మేలుకోదు. లేదా మేలుకొన్నా ఎవరి జాగ్రత్తలో వాళ్ళున్నారేమో! ఖూనీ అయిన మనిషి ఇంట్లో సోదా, ఖూనీ చేసినవాళ్ళ ఇళ్ళల్లో సోదా జరిగినట్లు లేదు. ఈ మాయ అర్థం కాలేదు. ఏ దారుల్లో, ఏ డొంకల్లో వెళ్ళిందో గుర్తు తెలీటం లేదు ఆ చీకట్లో. ఒక అరగంటకల్లా పోలీసుస్టేషన్‌ చేరింది జీపు. స్టేషన్‌లో మమ్మల్ని ముగ్గుర్ని వదిలి, అక్కడ కానిస్టేబుల్‌తో ఏవో మాట్లాడి ఎస్‌.ఐ. బృందం మళ్ళీ ఎక్కడికో వెళ్లింది.

”లాకప్‌లోకి పదండి” అన్నాడు ముసలి కానిస్టేబుల్‌. నాకు మండిపోయింది. ”ఎందుకు?” అన్నాను.

చదవండి :  రెక్కలు (కథ) - కేతు విశ్వనాథరెడ్డి

కానిస్టేబుల్‌ కాసేపు గొణిగాడు. నేనెవరో తెలిసి తరువాత వచ్చే పరిణామాలు ఏమిటో గుర్తు చేద్దామనుకొంటున్నా. సరిగ్గా ఆ సమయంలో మరొక గదిలోంచి వచ్చిన మనిషిని చూసి ఆశ్చర్యపోయాను. అతనూ నన్ను చూసి అంతే ఆశ్చర్యపోయాడు.

అతను జయరాం, కడప కాలేజిలో నేను ఇంటర్‌లో వున్నప్పుడు బిఏలో ఉండేవాడు. సాహిత్య మిత్రుడు. ”జీపు శబ్దమైతే మెలకువ వచ్చింది. మా ఊరి గొడవేమో అనుకొన్నా. నువ్వెక్కణ్ణించి? ఏమిటిది?” అని జయరాం ఆశ్చర్యపడ్డాడు.

ఒక్క క్షణం సిగ్గుపడ్డాను. జరిగింది రెండు ముక్కల్లో చెప్పాను. కానిస్టేబుల్‌ వైపు తిరిగి ” కాశీం! కాస్త సిగరెట్లు ఏర్పాటు చేయించు” అని పదిరూపాయల నోట్లు ఇచ్చాడు.

ఆ అపరాత్రి టీ, సిగరెట్టు వచ్చాయి. కాశీం మమ్మల్ని లాకప్‌లో తోస్తానని బెదిరించలేదు. నా వెంట వచ్చిన వాళ్ళిద్దరికీ చాప ఏర్పాటు చేయించి, పడుకోమన్నాడు జయరాం. మేం ఇద్దరమూ మాట్లాడుకొంటూ తెల్లవార్లూ గడిపాము. గ్రామ రాజకీయాల గురించి, మూడు రోజుల కిందట తమ ఊర్లో జరిగిన ఖూనీ గురించి, తన మీద మోపిన ఆ ఖూనీ కేసు గురించి, కరవు గురించీ సొంత కథ కాదన్నట్లు చెప్పాడు. అదేదో సర్వసాక్షి కథనం లాగుంది – ఉత్తమ పురుషుల్లో ఎక్కువ భాగం చెప్పినా, జయరాం కథలు రాసేవాడే అయి ఉంటే రాయలసీమ పల్లెలు అర్థమయ్యే పద్ధతి వేరుగా ఉండేది.

పొద్దున్న ఏడింటికల్లా ఎస్‌ఐ వచ్చాడు. జయరాం ఎస్‌ఐకి నన్ను పరిచయం చేశాడు. ఎస్‌.ఐ. నన్ను ఎగాదిగా చూసి ”మీరు, మీ వెంట వచ్చిన ఆ ఇద్దరూ వెళ్ళిపోవచ్చు సార్‌! ఒక్కమాట మీరీ ప్రాంతాల్లో ఉండటం మంచిదిగాదు” అని సలహా ఇచ్చి తన గదిలోకి వెళ్ళాడు. ” అదే మంచిది” అన్నాడు జయరాం. ఇద్దరం స్టేషన్‌ వరండలోకి వచ్చాం.

సరిగ్గా ఆ సమయానికి నా బ్రీఫ్‌కేసు తీసుకొని వచ్చాడు పెదనాన్న. విషయం తెలుసుకొని సంతోషపడ్డాడు. ”గండం తప్పింది. ఇంత పెద్ద ఉద్యోగస్థుడివై ఉండి, రాత్రి ఎంత బాధ పడినావో? లక్ష్మక్క నన్ను పంపింది, డబ్బిచ్చి. తెల్లవారుజామున శంకరు కూడ వచ్చినాడులే. కూడా వస్తానన్నాడు. నేనే వద్దన్నా. మేం బతికి బాగుంటే మళ్ళా ఊరికి వద్దువు” అంటూ చాలా దగ్గరకు వచ్చి చెవిలో చెప్పాడు : ”ఈ స్టేషన్‌ మన పార్టీ దగ్గరా గతికిందిలే! అందుకే ధైర్యం. అవతలివాళ్ళు ఏదన్నా తంటా తెస్తారని శంకరు అప్పుడే మన మండలం ప్రెసిడెంటు దగ్గరకు వెళ్ళినాడులే. ఏం కాలేదుల్యా ఇక్కడ?”

ఆ మాటల వెనుక మాయ లోంచి తేరుకునే లోగా పెదనాన్న, మా బావ తాలూకా బంధువులు ఆ ఇద్దర్నీ వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు.

జయరాం ఒక పక్కగా నిలబడి నవ్వుతున్నాడు.

”వస్తా జయరాం!” అన్నా. జయరాం వరండా మెట్లు రెండు దిగి నిలబడి ”ఒకమాట గుర్తుంచుకుంటావా?” అన్నాడు. ”చెప్పు” అన్నాను. జయరాం చెప్పాడు. ”నువ్వు డాక్టరువి. కలరా ఎందుకొస్తుందో నీకు తెలుసు. కలరా ఉన్న చోటుకి వెళ్ళాలంటే నీకు భయం లేదు. దాన్ని నయం చేసే మందులూ, పద్ధతులూ నీకు తెలుసు. ఈ గ్రామ పార్టీల కలరా ఉందే, ఇది వచ్చిన చోట మీ డాక్టర్లేమీ చెయ్యలేరు. కేవలం ఫిజీషియన్లకు లొంగే వ్యాధి కాదు ఇది”. ”మరెవరికి లొంగుతుంది?” అన్నాను అప్రయత్నంగా.

పేలవంగా నవ్వుతూ జయరాం అన్నాడు. ”అదే స్పష్టంగా తెలిస్తే నేనిక్కడెందుకుంటాను, ఈ రోగాన్ని తగిలించుకొని?… బయటపడితే… తిరుపతిలో కలుస్తాను.”

జయరాం స్టేషన్‌లోకి వెళ్లిపోయాడు. మనసు పరిపరి విధాలా పోయింది. అక్కా వాళ్ళ సంసారం ఏమయేటట్లు? జయరాం ఏమయ్యేటట్లు? ఈ పల్లెలూ, ఈ జనం…. ఏ సూక్ష్మక్రిములు ఈ రోగానికి కారణం? ఏ మందులకు ఇది లొంగుతుందో? ఆలోచనలో పడ్డాను, రోడ్డు మీద బస్సు కోసం చూస్తూ.

ఒక రోగం ఎందుకొస్తుందో అని వైద్యశాస్త్రంలో కారణాలు కనుక్కొంటే సరిపోదు. మందు కనిపెట్టాలి. నా వైద్య సంస్కారానికి ఇదేదో అందడం లేదు.

రచయిత గురించి

డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి గారు ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1996) గ్రహీత. డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సంచాలకునిగా పదవీ విరమణ పొందిన వీరు 1939 జులై 10న కడప జిల్లా కమలాపురం తాలూకాలోని రంగసాయిపురం గ్రామంలో జన్మించారు. ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’,’ జప్తు’, ‘ఇఛ్చాగ్ని’ పేర్లతో వీరి కథలు సంకలనాలుగా వెలువడ్డాయి.

(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 28 మార్చి, 1988)

జయరాం

ఇదీ చదవండి!

సినీ రసజ్ఞత

రాయలసీమ వాసులూ – సినీ రసజ్ఞత

తెలుగు సినిమాకు ప్రపంచ ఖ్యాతి తీసుకురావడమే కాకుండా ఎన్టీఆర్ ,ఏయన్నార్ లాంటి సినీ నటులను ఆదరించి విజయా సంస్థ ద్వారా …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: