శుక్రవారం , 18 అక్టోబర్ 2024

బిర్యానీ వద్దు, రాగిముద్ద చాలు

రాజధాని నగరాన్ని, నదీ జలాలను త్యాగం చేసిన రాయలసీమ ప్రజలు ‘హైదరాబాద్ బిర్యానీ’ని కోరుకోవడం లేదు. తమ ‘రాగి సంకటి’ తమకు దక్కితే చాలనుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజన సుదీర్ఘకాలంగా అటు రాజకీయ పక్షాలకు, ఇటు సామాన్య ప్రజలకు కూడా తీవ్ర సమస్యగా పరిణమించింది. ఎట్టకేలకు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం… కాదు, కాదు సకల రాజకీయ పక్షాలూ సంసిద్ధమయ్యాయి. రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేస్తున్నారో లేక సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపించాలనుకుంటున్నారో గానీ ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసేలా రాజకీయ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పక్షాల ఆమోదం లభించిందని చెబుతూ తెలంగాణ వాదులు కోరింది కోరినట్లుగా ఇవ్వడానికి సిద్ధపడ్డ కేంద్రం, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలను తృణప్రాయంగా భావిస్తోంది. తెలంగాణ పట్ల సానుభూతి చూపిస్తున్న పెద్దలు రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతమన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. నాడు బ్రిటిష్ వారు కూడా చేయని అన్యాయం రాయలసీమకు ఆంధ్రప్రదేశ్ పాలకులు చేస్తున్నారు.

తెలంగాణ కంటే బాగా వెనుకబడ్డ రాయలసీమను కోస్తాంధ్రతో కలిపి ‘సీమాంధ్ర’ అని వ్యవహరిస్తున్నారు. భౌగోళికంగానూ, సామాజికంగానూ, సాంస్కృతికంగానూ పొంతనలేని రాయలసీమను, కోస్తాంధ్రను ఒకే గాట్లో కట్టేయడం ఎంతవరకు సబబు? సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం, సారవంతమైన నేలలు, నదులు, అడవులు, అధిక వర్షపాతం వంటి సహజ వనరులతో పాటు విద్య, వైద్యం వంటి మానవవనరులు, నీటి పారుదల వంటి మౌలికసదుపాయాలు పుష్కలంగా కలిగి విరాజిల్లుతున్న కోస్తాంధ్ర ఎక్కడ? రాళ్ళు, రప్పలు, మెట్ట భూములు, అల్ప వర్షపాతం, కరువుకాటకాలతో పాటు అవిద్య, అరకొర మౌలిక సదుపాయాలు కలిగి వెనుకబాటుతనంతో కునారిల్లుతున్న రాయలసీమ ఎక్కడ? ఢిల్లీలో ఉన్న పెద్దలకు ఈ వ్యత్యాసం తెలియక ‘సీమాంధ్ర’కు రాష్ట్ర విభజన సందర్భంగా ప్రకటించిన ఏకైకవరం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా. దీనితో కోస్తాంధ్ర వారు కొంత తృప్తి చెందవచ్చు గానీ రాయలసీమ వాసులకు నిరాశను మిగిలిస్తోంది.

చదవండి :  చిన్న క్షేత్రాలనూ ఎదగనివ్వండి

పోలవరం ప్రాజెక్టు ద్వారా కోస్తాంధ్రకు విస్తృత ప్రయోజనాలు ఒన గూరే అవకాశం బాగా ఉంది. కానీ రాయలసీమకు ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం అతి స్వల్పం. పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌కు లభ్యమయ్యే నీరు కేవలం 45 టీఎంసీలు. కృష్ణా బేసిన్‌లోని నికర జలాలను ఇప్పటికే పూర్తిగా వినియోగించుకుంటున్నందున కృష్ణానది మిగులు జలాల ఆధారంగా చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు, శ్రీశైలం ఎడమగట్టు కాలువ మొదలైన ప్రాజెక్టులు తెలంగాణలో ఉండగా వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలోనూ, హంద్రీ -నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు రాయలసీమలో ఉన్నాయి. వీటన్నిటికీ కావాల్సిన నీరు 227.50 టీఎంసీలు కాగా పోలవరం ద్వారా లభ్యమయ్యే 45 టీఎంసీలు ఏ మాత్రం సరిపోవు. ఈ 45 టీఎంసీల నీటిలో రాయలసీమకు ఎన్ని టీఎంసీలు కేటాయిస్తారు? తెలంగాణకు ఎన్ని టీఎంసీలు పంచుతారు? వెలిగొండ కథేమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఒకవేళ అధిక శాతం నీటిని రాయలసీమకు కేటాయిస్తే రేపటి తెలంగాణ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇప్పటికే తెలంగాణ వాదులు పోలవరం ప్రాజెక్ట్ నుంచి లభ్యమయ్యే 45 టీఎంసీలు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జూరాలకు కేటాయించిన 9 టీఎంసీల నీరు కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టులకే కేటాయించాలని వాదిస్తున్నారు. కృష్ణాజలాల వినియోగంలో వందేళ్ళుగా దగాపడుతున్న రాయలసీమ వాసులు ఇక ముందు మరింత జటిలమైన సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు.

చదవండి :  మనమింతే!

రాయలసీమ అంతా దుర్భిక్ష ప్రాంతమే. ఇందులో మదనపల్లె, రాయచోటి, కదిరి, పులివెందుల మొదలైనవి తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో సాగునీటి సంగతి దేవుడెరుగు! తాగునీటికి జనం నిత్యం అలమటిస్తుంటారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలకు వలసపోవడం సర్వసామాన్యం. అక్కడి ప్రజలు హంద్రీ-నీవా ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కృష్ణానది మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు రాయలసీమకు వరమనే చెప్పాలి. ఇప్పటికే ప్రతి గ్రామంలోనూ త్రవ్విన కాలువల వైపు చూస్తూ ప్రజలు నిట్టూరుస్తున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి గ్రామాలు రాయలసీమలోనే కాదు, ఉత్తరాంధ్రలోనూ, కోస్తాంధ్రలోనూ ఉన్నాయి. వాటి గురించి ఏ మాత్రం ప్రస్తావించకుండా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఇప్పటికే నీటి వివాదాలు అనేక ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పులను సైతం లెక్క చేయడం లేదు.

ఈ నేపథ్యంలో కేంద్రం నీటి పంపిణీని తేల్చకుండా రాష్ట్ర విభజనకు పూనుకోవడం ఏ మాత్రం మంచిదికాదు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడుగానీ, వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గానీ ఈ కీలక సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకపోవడం ఎంతైనా దురదృష్టం. పైపెచ్చు ఈ ఇరువురూ సీమ నాయకులే. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులుగా ఎదిగిన వారందరూ సొంత ప్రాంతాన్ని తప్ప మిగతా రెండు ప్రాంతాలను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను అభివృద్ధిపరచడంలో పోటీపడ్డారు. హైదరాబాద్‌పై పెట్టిన శ్రద్ధలో పది శాతం రాయలసీమపై పెట్టి ఉంటే పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది కాదు. అందరూ విభజన సందర్భంగా హైదరాబాద్ గురించి పట్టుబడుతున్నారు. దాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగానూ, నీటి పంపిణీ లాంటి కీలక అంశాలను సాధారణ విషయాలుగానూ చూపిస్తున్నారు. అందుకే కేంద్రం కూడా హైదారాబాద్‌తోనే విభజన ముడివడి ఉందనే నిర్ధారణకు వచ్చింది.

చదవండి :  కడప జిల్లాపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోంది: గేయానంద్

హైదరాబాద్ నగరం ఎవరికి కావాలి? శ్రీమంతులకు, విద్యాధికులకు, రాజకీయ నాయకులకు మాత్రమే. రాయలసీమలోని రైతులకు, రైతు కూలీలకు సామాన్యులకు ఏమి కావాలో ఏ రాజకీయ పార్టీ కూడా అడిగే ప్రయత్నం చేయలేదు. శ్రీకృష్ణ కమిషన్ కూడా తమ అన్ని ప్రతిపాదనల్లో రాయలసీమ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినా నిజానికి రాయలసీమ వారి ఆకాంక్షలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రాధాన్యమివ్వలేదనే చెప్పాలి. అంటే రాయలసీమను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కంటే రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతమని అందరికీ తెలిసినా ఎవరూ చొరవ తీసుకోవడం లేదు. రాయలసీమ స్థితిగతులపై ప్రత్యేక అధ్యయనం నిర్వహించి, సమగ్ర అభివృద్ధి పథకాన్ని రూపొందించి, ప్రత్యేక ప్యాకేజీ పథకాన్ని ప్రకటించాలి. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రజలు ఇందుకు సానుభూతితో సహకరించాలి. రాజకీయ నాయకులు, మేధావులు రాయలసీమ అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు చేసి, అవి అమలు కావడానికి కృషిచేయాలి. రాజధాని నగరాన్ని, నదీ జలాలను త్యాగంచేసిన రాయలసీమను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోతున్న రాయలసీమకు ప్రజాస్వామిక వాదులు అందరూ బాసటగా నిలబడాలి. రాయలసీమ ప్రజలు ‘హైదరాబాద్ బిర్యానీ’ని కోరుకోవడం లేదు. తమ ‘రాగి సంకటి’ తమకు దక్కితే చాలనుకుంటున్నారు.

– వి.ఎస్.రెడ్డి
కార్యదర్శి, ‘పేస్’ స్వచ్ఛంద సంస్థ

(ఆంధ్రజ్యోతి, ౧౭ అక్టోబర్)

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: