యంగమునివ్యవసాయంకథ
మోచేతులు దాటి ఖాకీ చొక్కా, మోకాలు దాటి ఖాకీ నిక్కరు, గడ్డపార భుజాన ఒకవైపు పికాసి, మరోవైపు చెట్లడ్డ, పారతో యంగముని, పంగలకర్ర, మచ్చుగత్తి, ప్లాస్టిక్ బిందెతో సావిత్రి, టైర్ లేయర్‌తో చేసిన ఆకు చెప్పలు వేసుకుని చీకటి విచ్చీ విచ్చకముందే ఒకవిడత ఉప్పుతో ఊరబెట్టిన అంబలితాగి, మధ్యాహ్నానికి రెండు ఎరగడ్డలు, రెండు పచ్చిమిరపకాయలు, చద్దన్నం మూట, ప్లాస్టిక్ బిందెలో పదిలంగా పెట్టుకని బోడిగుట్టకు కోడు కొట్టుకుందుకు బయలుదేరుతారు. పనిలోకి వంగితే ఇద్దరి మధ్య మాటా పలుకు ఉండదు. కల్వీ, బందారు, గచ్చ, ముష్టి చెట్లను చెండుతూ యంగముని, ఆ కంపల్ని అట్టలు గడుతూ, పంగల కర్రతో వత్తి, కట్టిపైన మూడు నాలుగు బండలో గుండ్లో వేసి అణగగొట్టి, గాలికి లేచిపోకుండా సరిచేసి, యంగముని నరికిన చెట్ల మొదళ్ళను మూరెడు వెడల్పుతో పాదిత్రవ్వి కూకటేరు, పక్కవేర్లు తెగ్గొట్టి ఆ మొదళ్ళని ఒకచోట చేర్చి ఎండబెట్టి పొయి కిందికి జమపెడుతుంది సావిత్రి.
శ్రమకు, ఎండకు సూరీడు చెమట కాయిస్తే, గాలి దేవుడు అలా రెక్కలల్లార్చి విసిరి యంగముని కష్టానికి కానరాని దేవుళ్ళు కైదండ ఇస్తారు. వ్యక్తికి బహువచనమే శక్తి అంటారు. రెండు మెదళ్ళు, నాలుగు కాళ్ళు, నాలుగు చేతులు పలుగు పారలు బోడిగుట్టను చదును చేశాయి. రెండెకరాలు సాగుకు తెచ్చుకునేందుకు రెండు నెలలు పట్టింది. అయినా ఒకటి రెండు పెద్ద గుండ్రాళ్ళు మిగిలిపోయాయి బోడి గుట్టకు తీపిగుర్తుగా. చుట్టూ ఎత్తయిన కొండల మధ్య కొద్దిపాటి చదును నేలున్నదే బోడిగుట్ట. పూర్వం బొమ్మేపల్లె గుట్టలవి. ఎన్నేండ్ల క్రితం పాడయిందో ఆ పల్లె. ఎప్పటి నుండి సాక్ష్యంగా నిలబడ్డాయో గంగరావి, వేప, అల్లోనేరేడు చెట్లు. సూర్యుని కిరణాలు కూడా దూరని గుబురు కొమ్మలు, ఆకులు. ప్రక్కనే లోతైన పాడుబడ్డ బావి. దాన్నిండా ఆడా, మగా దయ్యాలున్నాయని ఆ పరిసరాలకు పోరు ఆ ఊరిని వదిలి దూరంగా రూపుదిద్దుకున్న కొత్తూరు ప్రజలు. అందులోని ఆకులలములు, పూడికతీసి యంగముని సావిత్రి బావిని వాడుకలోకి తెచ్చుకున్నారు. మొండిగోడలకు కొయ్యలతో పైకప్పుకప్పి కాపురానికి సిద్ధపరుచుకున్నారు. ఉప్పు, పప్పులకు కొత్తూరుకు వెళ్ళాలి. ఒంటరిగా ఉన్నప్పుడు యంగముని కొత్తూరు రెడ్డింట గాసగాడు. ఇప్పుడూ బదులు సదుళ్ళకు, సలహా సంప్రదింపులకు రెడ్డిని ఆశ్రయిస్తుంటాడు.
ఏ మహారాజుల వద్దనో అంగరక్షకుడుగా ఉండవలసిన వాడు యంగముని. కండలు దిరిగిన దండలు, గుబురు మీసాలు, బండబారిన పాదాలు, అరచేతులు, ఒక్క వెంట్రుకైనా ఊడని, నెరవని జుత్తు, పెద్ద చెవులు, గుండునైనా పిండి చేయగల సత్తా. మునుపటి శ్రావణమాసం ఆంజనేయస్వామి తిరుణాలలో జతపడింది సావిత్రి. యంగమునికి సమవుజ్జీ. ఇరువురి కలియకకు తాళి, మిట్టలు గాక సంకల్ప బలమే సర్వస్వము అయింది. సంవత్సరం దాటినా వాళ్ళ స్నేహం చిన్నమంతైనా చెదిరిపోలేదు. యంగముని కాలిముళ్ళు సావిత్రి గుండెలో గునపం. సావిత్రి కంట్లో నలుసు యంగముని గుండెలో శూలం. కొత్త సున్నం, వంటాముదం సాది సావిత్రి యంగముని చేతిబొబ్బలకు సుతారంగా రాస్తుంది. ఏకశయ్యపై విరబోసిన జుట్టులో వ్రేళ్ళు మృదువుగా జొనిపి సావిత్రికి గిలిగింతలు పెడతాడు యంగముని. గాలైనా దూరని ఎడముతో వెచ్చని శరీర తాపముతో ఎప్పుడో రాయి – రాయి కరిగే జాములో మన్మథ సామ్రాజ్యంలో మైమరపు సింహాసన మధిష్ఠిస్తారు. ఒక్క కలయికలో వజ్ర వైఢూర్యాలు పండించుకుంటారు.
రెండెకరాల పొలానికి కంపనాటి కంచె కట్టుకున్నారు. జింకల, అడవి పందుల బెడదకు రక్షణ కవచం. కోడు కొట్టుకన్న కొత్త సాగు, వానదేవుడు కరుణిస్తే మంచి పంటే రావాలి మరి. కొత్తూరు రెడ్డి విత్తనానికి కావలసిన ముడిసరుకు, సేద్యానికి ఎడ్లు, యారముట్లు యంగమునికి సమకూర్చాడు. అంతో ఇంతో కూలీనాలీ చేసి కూడబెట్టుకున్న దాపరికం రెడ్డి దగ్గరే జమగా ఉంది. పాలేరునాటి యంగముని సేవల్ని రెడ్డి మరిచిపోలేదు. రెడ్డి భార్య సావిత్రికి రెండు మూడు చీరెలు తొడిగి విడిసినవి ఇచ్చింది. ఏనుగు పడుకున్నా గుర్రమెత్తు అంటారు. సావిత్రికి ముక్కుకు, చెవులకు సరుకు ఈ ఆమని కరుణిస్తే కొనిపెట్టాలని యంగముని మనసులో ఉంది. ఇరుసాలు మడకతో దున్ని మూల ఏసరబెట్టి గొర్రుదోలి, గుండకపాసి, మానుతో చదునుచేసి గుట్టతల్లికి సారల చీరె చుట్టినట్టు కనసొంపుగా సేద్యంచేసి తొలకరి వానలకు వేరుశనగ పంట పెట్టాలని యంగముని ఎదురుచూపు.
కాలం ప్రవాహం లాంటిది. కన్నుమూసి తెరుస్తూ వుంటే రోజులు వారాలు గడుస్తాయి. నెలలు, సంవత్సరాలు దాటిపోతూ వుంటాయి. తొలేకాదశికి తొలకరి వానలు దడిబట్టి యంగముని కల నిజమయింది. ఒలచి పెట్టుకన్న వేరుశనగ ఇత్తనం, సాలుకంది సకాలంలో భూమిలో పడిపోయె. కావలికి నీడకొరకు అరపడి పేరాముదం భూమిలో చల్లాడు. అడపా దడపా పడిన పులిచినుకులకు ఒక్క గింజకూడా వ్యర్థమైపోక పది రోజులకు బోడిగుట్ట పచ్చచీర కట్టుకున్నట్టు పైరుభూమిపై ఆకు, మారాకు వేసె. కాడికి కొబ్బరి కాయకట్టి, ఎడ్లకొమ్ములకు రంగులు పూసి, బొడ్డు వార్లు, తలతాళ్ళు కట్టి పూజ్యభావంతో భూమిలో పెట్టిన పంట రేపట మాపట పెరిగి మూడు నెలల పది రోజులకే వేరుశెనగ చేతికంది వచ్చింది. మోకాటి యెత్తున పెరిగిన మొక్కలు, ఒక మొక్క పైకి లాగితే నాట్యకత్తె కాలికి కట్టుకొన్న గజ్జలలాగా వేరునిండా పేరుకైనా మట్టి అంటని తెల్లని కాయలు నిండు గర్భంతో ఒత్తినా పగలనంత గట్టితనంతో యంగముని పంట పండింది. ప్రాణాలొడ్డి పందుల తాకిడి నుండి కాపాడుకున్న పంట. పెరిగి ఆరబెడితే కాయలేగాని కట్టె కనపడలేదు. రాత్రింబవళ్ళు సావిత్రి, యంగముని కాయలుకోసి రాశిపోసి కట్టె వామివేసి మూటలకెత్తి పట్టణానికి తోలాడు. నలభై మూటెలకాయలు! యంగముని అంచనా మించె. నూనె దిగుబడి బాగుందని నూనెమిల్లు యజమాని మంచి రేటిచ్చికొనె.
‘‘నీ సేను నా కడుపు ఒకేసారి పండినాయి, నాకిప్పుడు మూడో నెల’’ అన్నది సావిత్రి.
‘‘నారు బోసిన దేవుడే నీళ్ళిచ్చె, మనువు గలిపిన వోడే సంతునిచ్చె. సేన్ను నమ్మినోడు సెడడు. ఓయిలే! సాయిత్రి! ఒకరికిద్దరం, ఇద్దరికి ముగ్గురం మన సెమ, సెమట మన బిడ్డకొద్దు. నాలుగచ్చరమ్ముక్కలబ్బితే లచ్చనంగా బతుక్కుంటాడు. రేపు నాలుగు సినుకులు పడితే డెబ్బై రోజుల పంట సెనగ వేసేమా, కొండయాదకు చలిమంచుకు సెనగ బతుక్కుంటాది. ఈసారి దుక్కి దున్నే నాటికి రెండు దేశపెద్దులు పట్టకొచ్చి సొంత యవసాయం పెడదాం’’ అన్నాడు యంగముని.
‘‘దానికేం భాగ్యం! మంచుకు సెనిగె లేసిరాదూ! సులకనైన పంట. ఈ సెనిక్కట్టె, ఆ సెనిగే పొట్టు ఎద్దుల మేపుకు సరిపోతుంది. తొలకరి సినుకులకు పచ్చగడ్డి మొలకలు కొంత ఆదరువు’’ అంది సావిత్రి. ఆలోచన వచ్చిందే తడవుగా భూమిని రెండో పంటకు సిద్ధం చేశాడు యంగముని. సకాలంలో పంట పెట్టాడు. డెబ్బై రోజులకే సెనగ విరగ కాసింది. పదహారు బస్తాలు సెనగలకు ఇరవై వేల ఆదాయం. ఖర్చులు పోను మంచి ఫలితమే అన్నారు కొత్తూరు రైతులు.
బుగ్గ బావికి దగ్గర్లోనే దూదేకుల మస్తాన్ రెండెకరాలు వెలిభూమి బేరానికి వచ్చింది. మస్తాన్ ఊరొదిలి అల్లుని దగ్గరికి పోతున్నట్టు, ఆ భూమి కొనమని యంగముని చెవిని వేశాడు రెడ్డి. ‘‘దయ్యాల బావి దగ్గర కాపురమున్న వాడిని కొత్తూరు రైతు లెవరు కొనరు, ధర పోటీకి ఎక్కిరారు’’ అని రెడ్డి ప్రోత్సహించాడు. ఆయిల్ ఇంజన్‌తో సాగుకు అనుకూలమని రెడ్డి చెప్పగా యంగముని సావిత్రితో ఆలోచించి కొనేందుకు అంగీకరించాడు. బేరం కుదిరి రిజిష్టరయింది.
‘‘కోడలు వచ్చిన వేళ, కోడె వచ్చిన వేళ’’ అంటారు. కొత్త కోడలు నట్టింట కాలిపట్టెల మువ్వలతో కొత్త కోడె గాడిపట్ట గంటలతో గల్లుగల్లున తిరుగుతూంటే ఇంట ధనలక్ష్మి, పొలంలో ధాన్యలక్ష్మి స్థిరపడిపోతుందంటారు. ఎవరి నిర్వాకమో, ఏ ఆకాశరామన్న ఉత్తరమో బోడిగుట్ట సాగును అడ్డుకునేందుకు ఫారెస్టు అధికారులు యంగముని గుడిసెను ముట్టడించారు. పట్టాలేనిది పంటలు పండించకూడదన్నారు. రెడ్డి, కరణాల ద్వారా ఆ పొలాన్ని పోరంబోకుగా నిరూపించుకొని డి.కే.టిగా గుర్తింపు పొందాకనే తిరిగి సాగు చేసుకోమన్నారు. పైఅధికారులకు తెల్పితే ఇబ్బందుల పాలవుతావని యంగమునిని హెచ్చరించారు. కొత్తూరు రెడ్డిని ఆశ్రయించి రెండు వేలు లంచంగా ఇచ్చి ఫారెస్టు అధికార్ల దౌర్జన్యం నుండి యంగముని విముక్తి పొందాడు. ‘‘విచ్చలవిడిగా తిరిగే పందులకు జింకలకు కూడా ఫారెస్టు అధికారులు పన్నులు రాబడతారేమో?’’ యంగముని లోలోన గొనుక్కున్నాడు. బీదవాడి రెక్కల కష్టానికి ప్రభుత్వం పన్ను రాబట్టటమా? రేపు గాలీ, నీరూ, ఎండా, వెన్నెలకు కూడా పన్నువేస్తే ఆశ్చర్యమేముంది?
ఏ కాలమైనా, ఏ దేశమైనా, ఏ స్థాయి వ్యక్తులైనా భార్యాభర్తల అనుబంధానికి సరైన అర్థం కష్టసుఖాలు పంచుకోవడమే. ‘‘ఓయిలే! సాయిత్రి! ఇప్పుడు మనకు బిడ్డలు అవసరమా?’’ అడిగాడు యంగముని.
‘‘అదేంటయ్యా! కోరుకుంటే మాత్రం బిడ్డలు పుడతారా? గండి ఆంజనేయసామి దయ.’
‘‘మన కట్టం, మన యవసాయం. ఇప్పుడిప్పుడే పది రూకలు మిగిలేటప్పుడు అన్నిటికీ అడ్డం. ఆస్పత్రులు, మందులు, డాట్టర్లు, వచ్చిపోయే చార్జీలు మనతాగత్తుకు మించిన ఖర్చులు.’’
‘‘మా దూరపు సుట్టం ఒకామె ముందూ యెనకా యెవరూ లేనిది, రమ్మంటే వచ్చి వుంటాది. కానుపు చేసి బిడ్డకాడ కాపుంటాది.’’
నీ కోరిక మేరకే కానీ. గుడిసె గట్టిగా నిలబెట్టుకోవాలె. బుగ్గబాయికి ఆయిలింజను కొనాలె. కట్టలకు, కాలవలకు కొంత కావాలె. సేనికాడ మంచె. లేని బరువు పెట్టుకుంటాండామేమో?
‘‘భూమికి మనం బరువు కాము, మనకు పిల్లోళ్ళు బరువు కారు. ఆరంబారం మోసేదాన్ని నేను, అడ్డం చెప్పొద్దు’’ ఆ చర్చ అంతటితో ఆగిపోయింది. ఖాకీ దుస్తులు పోయి ముతకనేత గుడ్డలు వచ్చె, చేనుకు తోటజతాయె. నీటివసతి యేర్పడటంతో తోటలో సగం వంగ, సగం మిరప వేశాడు. బోడిగట్టుకు, ఎద్దుల కొండ్రాయుని గుట్టకు మధ్య ఎండుటాకులు మోసి ఎరువుదిబ్బకు మట్టిచల్లి చేనికి సరిపడా ఎరువు కూడబెట్టి మెట్టపైరుకు ముందే చల్లి సేద్యం ముగించాడు. యంగముని మడక దోలినా, గొర్రు కట్టినా, గుంటక దున్నినా పేపరు మీద స్కేలు సాయంతో గీసిన పెన్సిల్ గీతలా ఉంటుంది. తాడుగట్టి వరినాటే జపాను సాగులా, చీడపీడలు లేక వంగ, మిరప, ఇబ్బడి ముబ్బడిగా ఏపుగా పెరిగి పూత, పిందె, కాయలతో వంగి నేలతాకే పని అయింది. పది రోజులకొక తడి. నాలుగు రోజులకు మడవ తిరగ్గట్టి కాయల్ని కోతకు తెచ్చుకున్నాడు. వ్యాపారస్థులు వట్టి గుత్త కడిగితే రెడ్డి సలహా తీసుకుని ముప్ఫై వేలకు సంచకరువు తీసుకుని పది రోజులకక తడి చొప్పున రాత కోతలైపోయె. కోత ఖర్చులు గుత్తదార్లవే. సెనగలు దిని చెయ్యి కడుక్కున్నట్టు.
పరిచయస్తురాలి కొరకు సావిత్రి పొరుగూరికి పోయి పది రోజులు రాకపోయేటప్పటికి యంగముని ఒకచోట నిలబడక కాలుగాలిన పిల్లిలా బయటికి, లోనికి పొలానికి ఇంటికి పిచ్చిపిచ్చిగా తిరిగాడు. ఒంటరి బ్రతుకును ఊహించుకోలేకపోయాడు.
‘‘తాళికట్టానా? తలంబ్రాలు పోశానా మాదీ ఒక పెళ్ళా? నాకేమి హక్కుంది ఆమెపై? బిడ్డలు వద్దన్నా వినకపాయె. బస్సు సెడినో? ఆమె రానన్నదో, నాలాంటోడు ఇంకెవడన్నా జతపడెనో? దోవతోడుకు ఏమి స్థిమితం? తోటలు, దొడ్లు ఎందుకు? సంపాదనకు సార్థకమేముంది? నా అయేకం గాకపోతే నేనెందుకీ జంబాలంలో ఇరుక్కోవాల? రెడ్డింట తిని తొంగొని నాదంటూ లేక హాయిగా వుంటి. సాయిత్రి బతుకు తీపి నేర్పి కనుమరుగాయె’’ యంగముని మనస్సు పరిపరి విధాల పాకులాడింది.
మేధావులు ఇందుకేనేమో పెళ్ళంటే వైముఖ్యం ప్రదర్శించింది. దానిచుట్టూ అనూహ్యమైన స్వార్థచింతనలు అల్లుకుంటాయి. రక్త సంబంధానికున్న గాఢత అలాంటిది. కుటుంబ వ్యవస్థ ఎంత పటిష్టమైంది? ఎన్ని విఘాతాలు ఏర్పడినా దానికి విచ్ఛిత్తి అంత సులభం కాదు. ఎక్కడో గాని అపశ్రుతులు వినపడని కొన్ని వేల సంవత్సరాల నాగరికతకు ప్రతి ఫలమిది. అనురాగం, ఆత్మీయతల మధ్య మిగిలిన దారిద్య్రాలు, సంపదలు వట్టి మిథ్య. వివాహ వ్యవస్థకున్న బలాన్ని కూడా మేధావులు సులభంగా కొట్టి వేయలేకపోయారు.
నాలుగు దినాలు యంగముని మంచంబట్టి నిద్రాహారాలు మాని బ్రతుకుపై విసుగు పెంచుకున్నాడు. గుత్తదార్లు తడిపారించమని అడిగినా కసురుకున్నాడు. దిగులు, వైరాగ్యం, అస్పష్టమైన ఆలోచనలు. ‘‘నాకీ భూములు వద్దు, ఇల్లు వద్దు, ఈ సంపాదన వద్దు, బిడ్డలు వద్దు, భార్య అబద్ధం, అసలు జీవితమే అబద్ధం.
గండి ఆంజనేయా! ఎందుకు నాకీ దారితోడు కల్పించినావు? నా సుఖానికి గండి కడితివి గదా! సాయిత్రికి అక్కన్నే కడుపు జారెనో? కాన్పాయనో? ఆడపిల్లో? మగబిడ్డడో? ఎవరైతే ఏం నా వాళ్ళు కానప్పుడు? ఇంక నాకు ఏ ఆశలేదు. జ్వరమో, తలనొప్పో, వణుకో, ఏ దయ్యము తొక్కిందో? ఈ బుగ్గ బావిలో ఎన్ని దయ్యాలో? ఊరందరికీ ఉన్న దయ్యాలు నాకు లేకుండా పోతాయా? నా మొండితనమే, నా ముండతనమే, నా బండతనమే నన్నీగతికి దిగజార్చినాయి. సాయిత్రి ఒక దయ్యం, కడుపులో బిడ్డ ఒక దయ్యం, నాకు దయ్యం పట్టింది. ఎంత నమ్మించినావే? ఎన్ని తీపిగుర్తులు మిగిలించినావే?’’ యంగముని మతి స్థిమితం కోల్పోయాడు.
‘‘అతి పరిచయాత్ అవజ్ఞా’’ అంటారు. ‘‘భార్యా రూపవతీ శత్రు:’’ అంటారు. తదభావంలోనే ఈ డెలీరియం. యంగముని కండ కలవాడే కాని గుండె బలం లేనివాడు. సొంత జ్ఞానం లేదు. సావిత్రి నడిపిస్తేనే నడిచిన వాడు. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ హస్తం ఉంటుందన్న విజయ రహస్యం ఎరుగక ఇవ్వాళ తన అశక్తతను గుర్తించుకొని వాపోయాడు.
‘‘నాకు మాత్రం నీవుగాక ఎవరున్నారు? నీ, నా సుఖం కొరకే గదా! ఇవన్నీ.’’
పది దినాల తర్వాత తన బంధువును వెంటబెట్టుకొని సావిత్రి వచ్చింది. యంగమునిని చూసి బిత్తెరపోయింది. ‘‘ఏమయింది ఈ మనిషికి? తిండికి ముఖం వాచిండా? దిగులా? అనుమాన పిశాచం పట్టిందా? నేను రానని తిండి మానేశాడా?’’
‘‘సాయిత్రి! ఓయిలే సాయిత్రీ! వచ్చినావా? నన్నిడిసిపోవు కదూ! నా ఇంటి దేవత! నా కంటి వెలుగు. నాకు జీవితంపై ఆశ కల్పించిన మోహినివి! నాకు నీవు తప్ప ఏమి వద్దు. నన్నిడిసి పోనని మాటీ. భూములు, బిడ్డలు – ఏదైనా నీ తర్వాతనే. నీ ఒళ్ళో తలపెట్టుకొని నిద్రపోతా! నీవే, నీవే నాకు సామిపసాదం’’ యంగముని అభావానికీ – భావానికి వ్యత్యాసం తెలియని అమాయకుడు. నలుపుకు – తెలుపుకు తేడా ఎరుగని ముగ్ధజీవి.
తెలతెల వారుతుండగా నిండు బిందె నీళ్ళు, పారతీసుకొని బోడిగుట్ట గట్టుమీద మొలిచిన వేపమొక్కకు పాదిదీసి నీళ్ళు పోసేందుకు బయలుదేరాడు. దానికే రేపు పిల్లాడికి ఉయ్యాల వెయ్యాల కదా! వెంట ఒక పొట్టేలు పిల్ల. రేపు తొలకరి చినుకుల్లో బోడిగుట్టకు పొలిచల్లేందుకు. *