ఆదివారం , 22 డిసెంబర్ 2024
పోతిరెడ్డిపాడును
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ – కొన్ని నిజాలు

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ అనేది ఏమిటి?

నీలం సంజీవరెడ్డి సాగర్‌ (శ్రీశైలం ప్రాజెక్టు) నుండి రాయలసీమకు సరఫరా చేసే నీటిని జలాశయం నుండి కాలువలోకి తీసుకునే నీటి నియంత్రణా వ్యవస్థే, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ (Pothireddypadu Head Regulator). నీటి సరఫరాను నియంత్రించే వీలు కలిగిన నాలుగు తూములు ఇక్కడ ఉన్నాయి.

ఆ పేరు ఎలా వచ్చింది ?

పోతిరెడ్డిపాడు అనే గ్రామం వద్ద దీనిని నిర్మించారు కనుక దీనికి ఆ పేరు వచ్చింది. గుంటూరు రహదారి నుండి 4 కి.మీ. లోపలికి ఈ గ్రామం ఉంది. శ్రీశైలం జలాశయపు ఒడ్డున ఉన్న ఈ గ్రామం వద్ద కాలువలోకి నీటిని మళ్ళించే హెడ్‌రగ్యులేటర్ ను స్థాపించారు.

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గురించిన విశేషాలు తెలపండి?

శ్రీశైలం జలాశయం నుండి 11500 క్యూసెక్కుల నీటిని కాలువలోకి పారించగలిగే సామర్థ్యం గల నాలుగు తూములను ఇందులో ఏర్పాటు చేసారు. శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణా నదిలో ప్రవహించే వరదనీటిని, చెన్నైకి ఇవ్వవలసిన 15 టి.ఎం.సి. తాగునీటిని జలాశయం నుండి పారించే పథకమిది.1988లో ఇది ఏర్పాటైంది.

pothireddy_silapalakam
ప్రారంభోత్సవ శిలాఫలకం

రెగ్యులేటర్‌ ద్వారా ఈ నీరు శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి వెళ్తుంది. ఈ కాలువ 16.4 కి.మీ.ప్రయాణం చేసి, బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు చేరి ముగుస్తుంది. ఈ బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ మూడు రెగ్యులేటర్ల సమూహం.

చదవండి :  జీవో 120కి నిరసనగా హైకోర్టులో న్యాయవాదుల నిరసన

శ్రీశైలం నీళ్ళను మూడు మార్గాల లోకి ఈ క్రాస్‌ రెగ్యులేటర్‌ మళ్ళిస్తుంది. అవి:

  1. కడప, కర్నూలు జిల్లాలకు నీళ్ళందించే శ్రీశైలం కుడిగట్టు కాలువ
  2. తెలుగుగంగ కాలువ
  3. గాలేరు-నగరి లేదా అధిక వరద నీటి మళ్ళింపు కాలువ

2005 సెప్టెంబర్ 13 న జారీ చేసిన జి.ఓ.170 ప్రకారం ఈ హెడ్‌రెగ్యులేటర్ లోని నాలుగు తూములతో పాటు మరో 7 తూములను ఏర్పాటు చేసి, దాని సామర్థ్యాన్ని ప్రస్తుత 11500 క్యూసెక్కుల నుండి, 40,000 క్యూసెక్కులకు పెంచారు.

హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ప్రభుత్వం ఎందుకు పెంచింది?

తెలుగుగంగ, గాలేరు-నగరి, శ్రీశైలం కుడిగట్టు కాలువలకు అవసరమైన 102 టీఎంసీల నీటిని, వరద వచ్చినపుడు 30 రోజుల్లో తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంచింది.

గత ఇరవై ఏళ్లుగా నిర్మాణంలో ఉండి పూర్తి కానున్న ప్రాజెక్టులకు నీళ్లివాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచక తప్పదు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా తరలించేది వరద నీరు మాత్రమే. చెన్నైకు తాగునీటి సరఫరాతో సహా తెలుగుగంగకు 45 టీఎంసీలు, గాలేరు-నగరికి 38 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టు కాలువకు 19 టీఎంసీలు – మొత్తం 102 టీఎంసీలు అవసరం. ఈ ప్రాజెక్టులను డిజైన్ చేసినపుడు 45 రోజుల పాటు వరద ప్రవాహం ఉంటుందని అంచనా వేశారు.

చదవండి :  హవ్వ... వానా కాలంలో డెల్టాకు తాగునీటికొరతా?

కానీ గత పదేళ్లుగా 30 రోజులకు మించి వరద ప్రవాహం లేదు. ఈ పరిస్థితిలో 30 రోజుల్లో 102 టీఎంసీల నీటిని మళ్లించాలంటే రోజుకు 40 వేల క్యూసెక్కుల సామర్థ్యం అవసరం. శ్రీశైలంలో 880 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 40 వేల క్యూసెక్కులు వెళ్తాయి. కనీస నీటిమట్టం 854 అడుగులు ఉన్నప్పుడు మూడువేల క్యూసెక్కులు మాత్రమే వెళ్తాయి.

ప్రభుత్వం తనంతట తానుగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచిందా?

లేదు. గత కొన్ని దశాబ్దాలుగా వంచనకు గురైన సీమ ప్రజల డిమాండ్ అది. గతంలో ఉన్న సీమ నేతలు, ముఖ్యమంత్రులూ ఈ దిశగా చొరవ చూపే ప్రయత్నం చేయలేదు. అయితే ఆటంకాలు ఎదురైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే ఈ దిశగా ప్రయత్నించి రెగ్యులేటర్ విస్తరణను పూర్తి చేశారు.

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ విస్తరణపై తెలంగాణా, కోస్తాంధ్ర ప్రాంత నేతల అభ్యంతరం ఏమిటి?

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వచ్చే నీటిని శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా తరలించడం  విద్యుదుత్పత్తి పైనా, సాగర్‌ ఆయకట్టుకు సాగునీటి సరఫరాపైనా ప్రభావం చూపుతుందనేది వీరి అభ్యంతరం. బలవంతంగా గేట్లు ఎత్తి శ్రీశైలం నుంచి సీమకు నీటిని తరలించిన సంఘటనలు గతంలో ఉన్నాయన్నది వారి ఆరోపణ. ఇప్పుడు సామర్థ్యం పెంచితే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందనేది వారి అపోహ. తెరాసకు చెందిన జలవనరుల నిపుణుడు విద్యాసాగర్‌రావు ఏమన్నారంటే “వరద నీటి వినియోగం తప్పు కాదు. భవిష్యత్తులో, వరద లేనప్పుడు కూడా మొత్తం నీటిని తీసుకెళ్తారన్నదే మా ఆందోళన.”

చదవండి :  కడప విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆగింది ఇందుకా?

ఈ అభ్యంతరాలూ, అపోహలూ అన్నీ కూడా నికర జలాలకు సంభంధించినవి కానీ వరద జలాలకు కాదు.

ఆంధ్రప్రదేశ్ లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును మాత్రమె ఈ రకంగా విస్తరించారా?

లేదు. తెలంగాణకు చెందిన ఎస్ఆర్ఎస్‌పీ వరద కాలువను సైతము ఇదే విధంగా ప్రభత్వం నిర్మిస్తోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మూడు కాలువల సామర్థ్యం 11,700 క్యూసెక్కులు. కానీ రెండున్నర లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరందించే ఎస్ఆర్ఎస్‌పీ వరద కాలువ సామర్థ్యం మాత్రం 22,000 క్యూసెక్కులు. కొద్ది రోజులు మాత్రమే వచ్చే వరద నీటిని ఉపయోగించుకొనేందుకే కాలువ సామర్థ్యం ఎక్కువగా పెట్టారు.

పోతిరెడ్డుపాడు హెడ్‌రెగ్యులేటర్ పరిస్థితి కూడా ఇంతే!

Pothireddypadu_vivaralu

ఇదీ చదవండి!

రచ్చబండ గురించి సెప్టెంబర్ 1న ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి భాస్కరశర్మలతో మాట్లాడుతున్న వైఎస్

వైఎస్ అంతిమ క్షణాలు…

రెండో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటన అనే భావనను మార్చేశారు. అంతకు …

2 వ్యాఖ్యలు

  1. విశ్వనాధరెడ్డి

    పోతిరెడ్డి పాడు గురించిన నిజాలను వివరించినందుకు ధన్యవాదాలు. మన నాయకులకు తెలంగాణా వాళ్ళకున్న ఆలోచనలో సగం ఉన్నా బ్రాహ్మణిని రద్దు చేసేందుకు ప్రభుత్వం సాహసించదు.

  2. కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. కృతజ్ఞతలు. పోలవరం గనక పూర్తయితే పోతిరెడ్డిపాడు సామర్థ్యం ఎంత పెంచినా కోస్తావారు పట్టించుకోరు. అయితే పోలవరం నీటిలో కొంత భాగాన్ని రాయలసీమకి ఎలా తరలించాలనేదాని మీద ఆలోచించాల్సి ఉంది. ఇలా తరలించాలనేది కూడా రాజశేఖరరెడ్డిగారి ఆలోచనే. రాయలసీమప్రాంతం కోస్తామీద చాలా ఎత్తులో ఉండడం ఒక పెద్ద disadvantage. కానీ ఎలాగో ఒకలా తరలించకపోతే రాయలసీమ తలరాత మార్చలేం. బహుశా అలా తరలించాలంటే ఎత్తుకి పంపింగ్ చేయడానికి heavy-duty powerhouses తో పాటు విస్తారమైన పైప్ లైన్ల నెట్వర్కు కూడా అవసరం కావచ్చు. ఆ పైప్ లైన్ లని కృష్ణా-గుంటూరు జిల్లాల మీదుగా కర్నూల్/కడపలోకి ప్రవేశపెట్టాల్సి వస్తుంది. కృష్ణానదీజలాల మీద ఆశ వదులుకోమని నేననను గానీ The Krishna is the most horribly exploited river in the entire South India. ఆ నదీజలాల కేటాయింపులు కేవలం కాయితాల మీదే తప్ప ఇంకెక్కడా వాస్తవంగా కనిపించవు. ఆ నదికి ఇదివరకున్న ప్రవాహం లేదు. ఉన్నకాస్తా కర్ణాటక కొట్తేస్తోంది. కాస్తోకూస్తో మన దాకా కారిన నీటిబిందువుల్ని ఇకముందు తెలంగాణావాళ్ళు వొడిసిపట్టేస్తారు. So, మనకి పోలవరం తప్ప వేరే hope కనిపించడం లేదు. నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళమంతా ఒకపూట బ్రేక్ ఫాస్టు మానేసి అయినా సరే డబ్బులు మిగల్చి, 5 ఏళ్లల్లో పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేసుకోవాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: