సొదుం జయరాం కథ ‘శని’
“ఏం చేస్తున్నావురా,కేశవా? ” అంటూ ఆదిరెడ్డి యింట్లోకి వచ్చాడు. కేశవ భోంచేసి, కునుకు తీసే ప్రయత్నంలో వున్నాడు.
అదిరెడ్డిని చూడగానే మంచం మాద నుంచి చివుక్కున లేచి నిలబడి :
“కూర్చో పెదనాన్నా” అన్నాడు. ఆదిరెడ్డి ఉసూరుమంటూ మంచం మాద కూలబడి, “ఎండలు దంచేస్తున్నాయిరా కేశవా” అన్నాడు.
“మార్చిగదా, యిప్పుడే ఎండలు మొదలయ్యాయి”.
“అది సరే సావిత్రి కనిపించదేం?” అన్నాడు ఆదిరెడ్డి.
“ఇంట్లో భోంచేస్తోంది” కేశవ అన్నాడు.
ఇంట్లో భోంచేస్తున్న సావిత్రి వీళ్ల సంభాషణ విని, అన్నం పళ్ళెంతో వాకిట్లోకి వచ్చి నిలబడి, “భోం చేద్దామురా మామయ్యా” అంది.
“మీలాగా పండ్రెండింటికి టంచనుగా భోంచెయ్యడానికి నాకు కుదరదు. నా భోజనం అయ్యేసరికి ఏ ఒంటి గంటో, రెండో అవుతుంది. ఒక గ్లాసు మజ్జిగ వుంటే ఇవ్వమ్మా, చాలు” అన్నాడు.
అవసరం వున్నా, లేకున్నా, మజ్జిగో మంచి నీళ్ళో అడిగి ఇప్పించుకోవడం ఆయనకు అలవాటు. సర్పంచు ఆదిరెడ్డిగారంటే ఏ భేషజాలు లేనివాడనిపించుకోవాలన్నది ఆయన తాపత్రయం. అందుకోసం ఈ అలవాటు చేసుకున్నట్లుంది.
పాపం. సావిత్రి గతుక్కుమన్నది. ఉదయం అర్థ రూపాయి పెట్టి రెండు గ్లాసులు మజ్జిగ కొన్నది. కేశవ భోంచేశాడు.
తన కోసమని ఒక గ్లాసు మజ్జిగ అట్టేపెటుకొన్నది. ఇంకా నయం తను భోంచేసీ ఉంటే గ్లాసు చేత్తో పట్టుకొని పరుగెత్తవలసి వచ్చేది. సావిత్రి ఇంట్లోకి వెళ్ళి చెయ్యి కడుక్కొని గ్లాసుతో మజ్జిగ తెచ్చియిచ్చింది.
“పాడి వుందా సావిత్రీ” అడిగాడు ఆదిరెడ్డి మజ్జిగ గ్లాసు అందుకుంటూ.
“లేదు మామయ్యా. కొన్నవే.” అంది సావిత్రి.
“పల్లెటూళ్ళో కూడా పిదపకాలం దాపురించింది. మేం చిన్నప్పుడు ఇట్లా లేదు. మజ్జిగకని ఎవరొచ్చినా ముంతలు ముంతలు పోసేవాళ్ళం. ఇప్పుడు గ్లాసెడు మజ్జిగ కావాలన్నా కొనవలసి వస్తున్నది సావిత్రీ” అన్నాడు ఆదిరెడ్డి.
కేశవకు నిద్ర ముంచుకొస్తున్నది.పాల మీదా, మజ్జిగ మీదా వాళ్ళ సంభాషణ అలా ఎంత సేపు సాగినా సాగవచ్చు.
“ఏం పని పెదనాన్నా? ఎండ పొద్దున వచ్చావు” అన్నాడు కేశవ వాళ్ల సంభాషణను అడ్డుకుంటూ.
“పనీ బాటాలేకుండా, నువ్వూ, సావిత్రీ గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చున్నారు కదా మీకు ఒక చిన్న పని
పెడదామని వచ్చాను” అన్నాడు ఆదిరెడ్డి.
“గోళ్లు గిల్లుకుంటూ కూర్చోక ఏం. చెయ్యాలి మామయ్యా. నువ్వేమో నీ పలుకుబడి వుపయోగించి మా అబ్బాయికి ఏదో ఒక ఉద్యోగం చూడకపోతివి” అంది సావిత్రి నవు తూ.
“ఉద్యోగాలు నా జేబులో పున్నాయా తల్లీ. ఇంటర్వ్యూ రానీ చూద్దాం” అన్నాడు ఆదిరెడ్డి.
“ఆ ఇంటర్వ్యూ వచ్చేసరికి, నేనూ మా అబ్బాయి ఇద్దరం ముసలివాళ్లం అయి పోయేటట్టు వున్నాం” అంది సావిత్రి నవ్వుతూ.
కేశవ నవ్వడానికి ప్రయత్నించాడు కాని నవ్వు రాలేదు. ఇప్పుడిప్పుడే ఉద్యోగం రాదన్న విషయాన్ని, సావిత్రిలాగా కేశవ తేలిగ్గా తీసుకోలేక పోయాడు. చదువు కోసం, ఉన్న పదెకరాల భూమిలో ఐదు ఎకరాల భూమి హారతి కర్పూరంలా హరించిపోయింది. కాలం విషయం సరేసరి. హైస్కూలు చదువుకు రోజూ ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కాళ్లు పీకేవి. అది శారీరక శ్రమ. చదువు అయిపోయింది. ఈ రోజుకీ పరీక్షకు సంబంధించిన కలలే వస్తాయి. తప్పినట్టు – పాసయినట్టు – తలుచుకొంటే వళ్లు కంపర మెత్తుతుంది. అంత కష్టపడి చదివీ, జరిగిందేమిటో అతనికి అర్థం కాలేదు.
కాకపోతే ఆ చదువు తనలో సంస్కారాన్ని పెంచింది. నాగరికతను పెంచింది. అది ఆర్థిక అవసరాల్ని పెంచాయి. నిరుద్యోగం మూలాన అవి తీరే మార్గం మాత్రం కనిపించడం లేదు. ఆదిరెడ్డి పని కల్పిస్తానంటే కాస్త ఆశ చివురించింది.
“ఇంతకూ ఏం పని పెదనాన్నా” అడిగాడు కేశవ.
“ఏం లేదురా కేశవ, ఊర్లో నాలుగు వయోజన విద్యా కేంద్రాలు తెరుస్తున్నారు. నీ పేరూ, సావిత్రి పేరు కూడా రికమెండ్ చేశాను. నువ్వు హరిజనవాడ కేంద్రంలో పని చెయ్యి. అమ్మాయి ఈ వీధి కేంద్రంలో పని చేస్తుంది” అన్నాడు ఆదిరెడ్డి.
‘కేశవ సమాధానం చెప్పలేదు కాని, సావిత్రి ముఖం విప్పారింది. “కేశవ ముభావంగా వుండడం సావిత్రికి నచ్చలేదు.
“అలాగే మామయ్యా” అంది ఇద్దరి తరుపునా సావిత్రి.
*ఏరా కేశవా ఈ రోజు రాత్రే మొదలుపెట్టు” అన్నాడు ఆదిరెడ్డి.
“హరిజనవాడలో చదువుకోడానికి వస్తారా?” అన్నాడు సంశయంగా కేశవ.
“ఎందుకు రారు? ఈ రోజు నీ వెంట నేను వచ్చి అందరికీ చెబుతాను. సావిత్రీ, నువ్వు కూడా ఈ రోజే మొదలు పెట్టు” అన్నాడు ఆదిరెడ్డి.
సావిత్రి సరేనన్నట్లు తలాడించింది.
“ఒరే కేశవా నువ్వేమో సంశయిస్తున్నావు. నాలుగు సెంటర్లు వుంటే, మేమంటే మేమని పది మంది ఎగబడి వచ్చారు. మీ పరిస్థితి గమనించి మీ పేర్లు రెకమెండ్ చేశాను. ఎంత మందితో చెడ్డకావాలో ఏమో? ఈ సర్పంచ్ పదవి వద్దురా తండ్రీ అనిపిస్తోంది” అన్నాడు ఆదిరెడ్డి.
“నిజమేలే మామయ్య” అంటూ తాళం వేసింది సావిత్రి. ఆదిరెడ్డి కాసేపు ఈ మాటా ఆ మాటా మాట్లాడి ఆ పై
వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కేశవకు నిద్రపట్టలేదు. తను చాలా గడ్డురోజుల్లో ఉన్నమాట వాస్తవమే కానీ, కేవలం దాని కోసమని తాను రాత్రి పాఠశాల నడపాలని అనుకోవడం లేదు. ఏ పనిలో అయినా కొంత నిజాయితీ వుండాలన్నది అతని తత్వం. నిజానికీ అక్షరాస్యతా కార్యక్రమంలో పాల్గొనడం అతనికే సంతోషంగా కూడా వుంది. దేశంలో ద్ధాదాపు నలభై కోట్ల మందికి కనీసపు అక్షరజ్ఞానం కూడా లేని బాధాకర పరిస్ణితి ఉంది. విద్యావంతులందరూ కూడా ఈ దారుణ స్థితికి అంతో యింతో స్పందించాలి. విద్యావంతులు స్పందించినంత మాత్రాన ప్రయోజనం లేదు. నిరక్షరాస్యులు కూడా అదే మేరకు ముందుకు రావాలి. వాళ్ళు ముందుకు రావడం లేదు. ముందుకు వచ్చే పరిస్దితులు కూడా వారికి లేవు. అదీ అతని సంశయం, దాన్నే. సర్పంచ్‌తో వ్యక్తం చేశాడు.
సావిత్రి ఆ గంట నుండే రంగంలోకి దిగింది. ఇంటింటికి వెళ్ళి పిలవడం ప్రారంభించింది.
“ఎట్టా వుంది రెస్పాన్స్” అన్నాడు సాయంత్రం కేశవ.
“అనుకున్నంత అధ్వాన్నంగా లేదు” అంది సావిత్రి.
సావిత్రి బియ్యే పాసయింది. మంచి మాటకారి.. నలుగుర్నీ ప్రోగుచెయ్యడానికి ఆ మాటకారితనం ఉపయోగపడుతుంది. కానీ తన విషయం వేరు. ఏ మాత్రం చైతన్యం లేని హరిజనులతో డీల్ చెయ్యాలి. అదీ కేశవ భయం.
మాట ప్రకారం సర్పంచ్ కేశవ వెంట హరిజనవాడకు వచ్చాడు. సాధారణంగా ఆయన హరిజనవాడకు రాడు. ఎన్నడూ రాని సర్పంచ్ హరిజనవాడకు రాగనే హరిజనులంతా బిలబిలా వచ్చి ఆయన్ను చుట్టుముట్టారు.
“ఈ రోజు నుంచీ ఇక్కడ రాత్రి పాఠశాల నడుపుతున్నాం. రోజు కేశవ వచ్చి మీకు చదువు చెబుతాడు. మీరంతా వచ్చి చదువుకొని బాగు పడండర్రా” అన్నాడు సర్పంచ్ ఆదిరెడ్డి.
ఎవరి దగ్గర నుంచీ సమాధానం రాలేదు.
“మీకు చెవుల్లో సీసం పోసారా ఏమిటి? నేను చెప్పేది వినపడనట్టుంది” అన్నాడు ఆదిరెడ్డి కోపంగా.
గుంపులో కొంత చలనం వచ్చినట్లయింది: ఒక్ష ముసలాయన ముందుకు వచ్చి.”ఆదిరెడ్డి గారు సదువుకోమంటున్నారు. బాగానే వుంది. రైతులు రెండు గంటలకొచ్చి మట్టి బండ్ల కని లేపుతారు. తొమ్మిది గంటల్దాకా సదువుకొని మళ్లా రెండుగంటలకల్లా లేవడమంటే సాధ్యమయ్యే పనేనా సామీ” అన్నాడు. అదీ వాళ్ల సమన్య. వేళ కింత కూడు దొరకితే చాలు జన్మతరించినట్లుగా భావించేవాళ్ల సమస్య. ఎండాకాలం గనక పగలు మట్టి బండ్లు కట్టుకోరు. రెండింటికి బండ్లు కట్టి ఎనిమిదింటికే, వదుళ్తారు.
కూలికి పోతే కుండ కాలాలి. లేకపోతే కుండకాలాలి కాబట్టి కూలి పని చేసుకోక తప్పని పరిస్థితి. ఇక చదువుకోటానికి టైమెక్కడ? స్వేచ్చ ఎక్కడుందని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ మనసుంటే మార్గముంటుంది. భోజనాల తర్వాత ఎలాగూ ఒక గంట నిద్రపోరు. ఆ గంటా చదువుకోసం ఖర్చుపెడితే చాలు. రాయడం, చదవడం నేర్చుకోవచ్చు. కేశవ ఆ విషయమే చెబుదామనుకున్నాడు. కానీ ఇంతలోనే ఆదిరెడ్డి అందుకున్నాడు. “మన గ్రామాన్ని క్లస్టర్‌లో చేర్చారు. క్లస్టర్‌లో చేర్చడమంటే తెలుసా? డి.ఆర్.డి.ఎ. వాళ్లు గొర్రెలపెంపకానికీ, పందులపెంపకానికీ, ఇంకా ఇంకా అనేక రకాల అప్పులు మంజూరు
చేస్తారు. చేవ్రాలు చేయగలిగిన వాళ్ళకు మాత్రమే బ్యాంక్ వాళ్ళు అప్పులు ఇస్తారు. తరువాత మీ యిష్టం” అంటూ ముగించాడు.
కేశవకు సర్పంచ్‌గారి ధోరణి నచ్చలేదు. చదువు కోమని చెప్పడానికి అవ్పుల ఆశ చూపి మభ్యపెట్టడం హీనమైన పద్ధతి! కేశవ దృష్టిలో – లక్ష్యసాధనకు ఎన్నుకొనే మార్గం కూడా ఉన్నతంగా వుండాలి. కానీ సర్పంచ్ గారు చెప్పినదాన్ని కాదనడానికి అతనికి ధైర్యం చాల్లేదు. గమ్మున వుండి పోయాడు. లోలోపల
ఎంతగా మధనపడిపోతున్నా.
కానీ చిత్రమైన విషయమేమిటంటే, సర్చంచ్‌గారి వాక్కు రామబాణంలా పనిచేసింది. రాత్రి పాఠశాలకు రావడానికి ఎగబడి పేర్లు నమోదు చేయించుకొన్నారు. ఒక పని అయిపోయినట్టు కేశవకు రిలీఫ్ దొరికింది.
హరిజనవాడ నుండి తిరిగి వస్తుండగా ఆదిరెడ్డి కేశవతో “చదువుకుంటే చాలదు. తెలివితేటలుండాలి.” అన్నాడు. హరిజనవాడలో తను ప్రదర్శించిన తెలివితేటల్ని చాటుకుంటున్నాడని కేశవకు అర్థమైంది. అట్లాంటి తెలివితేటలు తనకు లేనందుకు బాధ పడాలో, సంతోష పడాలో కేశవకు బోధపడలేదు.
కేశవ యింటికొచ్చేసరికి యిల్లంతా, సందడిగా వుంది. ఇంకా పలకలూ పుస్తకాలూ అందలేదు గనక, అందరూ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.
కేశవనూ, అదిరెడ్డినూ చూడగానే ఆడవాళ్లంతా లేచి నిలబడ్డారు. ఆదిరెడ్డి ఇక్కడా తన తెలివితేటల్ని ప్రదర్శించాడు
“చూడండమ్మా.మీఆడోళ్ళంతా డాక్రా పధకమని ఒకటి వుంది. దాన్ని మన వూర్లో అమలు చెయ్యబోతున్నారు. మీరు రోజూ వచ్చి చదువుకున్నారంటే మీ అందరికీ అప్పడాల పరిశ్రమకూ, పాడి పశువుల కొనుగోలు చేయడానికి లోన్లూ ఇప్పిస్తాను” అన్నాడు.
అసలే ఆడవాళ్ళు. ఈ మాట వినగానే వాళ్ల సంబరానికి అవధల్లేవు. అంతా పేర్లు నమోదు చేయించుకొని ఇండ్లకు వెళ్ళపోయారు. ఆదిరెడ్డి కూడా సంతృప్తిగా యింటికి వెళ్లిపోయాడు.
“రండి… కాళ్ళు కడుక్కొని భోంచేద్దురు.” అంది సావిత్రి.
“నీ పాఠశాల చూస్తుంటే కడుపు నిండి. పోయింది” అన్నాడు కేశవ నవ్వుతూ.
“అపును. వూహించినదానికంటే ఎక్కువే వచ్చారు. మధ్య తరగతి వాళ్లు. గనుక, చిన్నప్పుడు అంతా స్కూలుకు వెల్లినవారే. ఇంటి చాకిరీలో మునిగి పోయి వచ్చింది కాస్త పూర్తిగా మర్చిపోయారు. ఐదారు నెలలు కష్టపడితే రాయనూ, చదవనూ నేర్పగలను” అంది సావిత్రి.
కేశవకు సావిత్రి అన్నం వడ్డిస్తూ, “ఈ చదువుల వల్ల ఉపయోగమేమిటండీ” అంది.
“ఈ’ అన్నం వల్ల ఉపయోగం ఏమిటో చెప్పు” అన్నాడు కేశవ.
“అన్నం దేహానికి ఫుష్టినిస్తుంది” అంది సావిత్రి.
“చదువు మనసుకు పుష్టినిస్తుంది. దురదృష్టకరమైన విషయమేమిటింటే ఈ దేశంలో నలభై కోట్ల మంది ప్రజలు నిరక్షరాస్యులు. నిరక్షరాస్యుల్లో స్త్రీల శాతమే ఎక్కువ” అన్నాడు కేశవ.
రెండవరోజు కేశవ అందరికీ పలకలూ, పుస్తకాలూ పంచాడు. పంచి, పాఠం మొదలు పెడితే ఎవరూ శ్రద్ధ కనపరచడం లేదు. ఒకరి ముఖాలు ఒకరు చూచుకుంటున్నారు.
“ఏమిటి? ఒకరి ముఖాలు ఒకరు అట్లా చూచుకుంటున్నారు?” అన్నాడు కేశవ.
“మాకు చేవ్రాలు నేర్పించండి చాలు” అన్నారు అంతా ముక్తకంఠంతో.
సర్చంచ్ గారి తెలివితేటల మూలంగా ఏర్పడిన పరిస్టితి కేశవకు అర్థమైంది. ఏం చెప్పినా వినిపించుకొనే వాళ్లు లేరు. తను చెప్పినట్టు వాళ్లు వినాలంటే, తన మీద వాళ్లకు నమ్మకం కుదరాలి. తన్ను వాళ్లలో ఒకడుగా భావించాలి. అందుకు కొంత “టైం తీసుకొంటుంది. అందుకని కేశవ వాళ్లు చెప్పినట్టుగా చేవ్రాలుతో చదువు ప్రారంభించాడు.
కేశవ మీద వాళ్లకు ,విశ్వాసం కుదరడానికి చాలా రోజులే పట్టింది. ఆ రోజు కేశవ స్కూలుకు వచ్చేసరికి హాజరు చాలా పలుచగా వుంది. అంతా కలిపి ఐదారు మంది కంటే ఎక్కువలేరు.
“ఏమిటిది?” అన్నాడు కేశవ ఆశ్చర్యంగా.
“నారయ్యకు దెబ్బలు” సార్.
“అంతా అక్కడ వున్నారు.” అన్నాడు ఒకడు లేచి.
“నారయ్యకు దెబ్బలా? ఎట్లా తగిలినయ్?”
“పచ్చిరెడ్డి కొట్టాడు”
“ఎందుకని?” అడిగాడు కేశవ.
జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడానికి ఎవరికీ ధైర్యం చాల్లేదేమో, ఎవరూ సమాధానం చెప్పలేదు. గమ్మున వుండిపోయారు. ఇక లాభంలేదనుకొని కేశవ హడావుడిగా నారయ్య ఇంటి దగ్గరకొచ్చాడు. తల మీద బలమైన దెబ్బలు తగిలాయి. ఒళ్ళంతా రక్తసిక్తమైంది.జనమంతా చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారు. కేశవ రాగానే అంతా పక్కకు జరిగి దారి యిచ్చారు. కేశవ అట్లాంటి దృశ్యం ఎప్పుడూ చూచి ఎరగడు.
“ఎందుకు కొట్టాడు పిచ్చిరెడ్డి?” కేశవ ప్రశ్నించాడు.
నారయ్య భార్య ఏడుస్తూ విషయం చెప్పింది. నారయ్య పిచ్చిరెడ్డికి మూడువేలు బాకీ. ఆ బాకీ తీరడానికి నారయ్య పిచ్చిరెడ్డి దగ్గర రెండు సంవత్సరాలు పని చేశాడు. బాకీ తీరిపోయిందని నారయ్య, తీరిపోలేదని
పిచ్చిరెడ్డీ తగాదా పడ్డారు. బాకీ విషయం నారయ్య తనతో వాదనకు దిగి మాటా మాటా మాట్లాడటం పిచ్చిరెడ్డికి కోపం తెప్పించింది. రెచ్చిపోయాడు. అందుబాటులో వున్న బండి నాటు తీసుకొని తల మీద కొట్టాడు. అదీ విషయం.
పిచ్చిరెడ్డి అమానుష ప్రవర్తన పట్ల కేశవకు జుగుప్స కలిగింది. కోపం తెప్పించింది.
“స్టేషనుకు వెల్లి కేసు పెట్టక పోయారా? చట్టం అందరికీ ఒకటే” అన్నాడు కేశవ.
“కేసు. పెడితే బతకనిస్తారా?” అంది నారయ్య భార్య.
“ఏం భయంలేదు. నేనున్నాను.” అన్నాడు కేశవ.
నిజానికి వాడలో చాలామంది కేసు పెట్టాలనే నిర్ణయించుకొన్నారు. కాకపోతే వాళ్ళలో కొంత తటపటాయింపు వున్నది. కేశవ ప్రోత్సావాం ధైర్యాన్నిచ్చింది. కేశవను వెంటేసుకొని, నారయ్యా, అతని భార్యా యింకా యిద్దరు ముగ్గురు స్టేషనుకు వెళ్ళారు. సమయానికి ఎస్సై కూడా స్టేషన్‌లోనే వున్నాడు. కానీ ఆయన వాలకం చూచి కేశవ దిమ్మెర పోయాడు.
“వాడు నిన్నెాందుకు వూరికే కొడతాడురా. మాల్నాకొడకా.. నువ్వు ఏదోఅని వుంటావు. వాడు కొట్టి వుంటాడు.
నిజం చెప్పూ “అన్నాడు ఎస్ ఐ. అంతా విని.
మద్దాయినీ ఫిర్యాదీని ఒకే గాట కట్టడం పోలీసులకు అలవాటు. ఈ విషయం కేశవకు తెలియదు. ఎరక్కపోయి యిరుక్కున్నట్లయింది.
ఎవరూ సమాధానం చెప్పకపోవడం చూచి ఎస్.ఐ మళ్లీ అన్నాడు “కేసు రిజిస్టరు చేస్తాననుకో, రేపు రెండువేలో, మూడువేలో తీసుకోని రాజీ పడవని నమ్మకమేమిటి దొంగ లంజకొడకా”.
నారయ్యకు పిచ్చిరెడ్డి దెబ్బలే నయమనిపించాయి. కేశవకు మలమల ముఖం మాడిపోయింది. ఎలాగో
గొంతుపెగిల్చి – “అలా జరగదు లెండి సార్” అన్నాడు.
ఎస్.ఐ, చివుక్కున తల తిప్పి కేశవ వైపు చూన్తూ.. “నువ్వెవరు?” అన్నాడు.
కేశవకు ముచ్చమటలు పోశాయి. గుండె దడదడ కొట్టుకుంది. ఎలాగో తేరుకొని తనెవరయిందీ చెప్పాడు.
బాగానే వుంది చదువు చెప్పుకోకుండా “నువ్వెందుకు వచ్చావు సేషన్‌కు” అన్నాడు ఎస్.ఐ.
“కేశవ మౌనంగా వుండిపోయాడు. పోలీసు డిపార్టుమెంటు ఒకటి మాట్లాడితే తక్కువ. రెండు మాట్లాడితే ఎక్కువ. అట్లాంటప్పుడు మౌనం వహించడమే మేలనుకున్నాడు. ఎస్.ఐ. చాలా సేపు బూతు పురాణం వల్లించాడు. చివరుకు రిజిస్టరు చేశాడు. కేశవకు పెద్ద రిలీఫ్ దొరికినట్టనిపించింది. కానీ ఇంటికి రాగానే రీలీఫ్ కాస్తా ఎగిరిపోయింది.
“నువ్వేనటగా ఈ భాడ్కోవ్ పని చేసింది” అంటూ సర్పంచ్ ఎగిరిపడ్డాడు.
“నేనే” అన్నాడు కేశవ తొణక్కుండా.
“ఇవ్వాళ పిచ్చిరెడ్డిని ఎదిరించారు. రేపు నిన్నెదిరిస్తారు. మర్నాడు నాకూ అదే జరుగుతుంది. అక్కడికి వెల్లి చదువు చెప్పమంటే ఇదా నువ్వు చేసిన ఘనకార్యం” అంటూ విసుక్కున్నాడు ఆదిరెడ్డి.
“చదువంటే నాకు అక్షరమ్ముక్కలు నేర్పడం కాదు. అన్యాయాలు జరిగినపుడు స్పందింప చెయ్యడం కూడా చదువే” అన్నాడు కేశవ.
ఆ మాట సర్పంచ్ గారికి అర్థం కాలేదు.
“సరే. ఇక మీదట అక్కడికి వెళ్ళి నీ చదువు చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ విసవిస వెల్లిపోయాడు.
అంతా వింటున్న సావిత్రి “దారినపోయే శనిని పిల్చి నెత్తిన కూర్చోబెట్టుకుంటారు మీరు” అంది.
“పిచ్చిముండా ఇది దేశానికి పట్టిన శని” అన్నాడు కేశవ నవ్వుతూ.
(ఆహ్వానం మాస పత్రిక, ఫిబ్రవరి, 1996)