రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి కీ.శే. కె.సభా. అన్ని ప్రక్రియల్లో రచనలు చేసి సీమ వాడి, వేడి, జిగి, బిగి, ఆర్ద్రత, ఆప్యాయతల స్థాయిని చాటిన సభా బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు. ఆంధ్రప్రభ, జమీన్ రైతు, నాగేలు, వాహిని పత్రికల్లో సంపాదకవర్గంలో పనిచేసి దేవదత్తం వారపత్రికను స్వయంగా నడిపారు. పాంచజన్యం అనే ఆంగ్లపత్రికను నిర్వహించారు. సమకాలీన రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక అంశాలపై వందల కొద్దీ వ్యాసాలను ప్రచురించడమే కాక విమర్శకుడిగా అనేక విమర్శనావ్యాసాలు, పుస్తక సమీక్షలు వెలయించారు.
చిత్తూరు జిల్లా కొట్రకోన గ్రామంలో 1923 జూలై 1న సభా జన్మించారు. 8వ తరగతి తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తిచేసి 16 సంవత్సరాల వయస్సులోనే ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. బి.ఏ వరకు ప్రైవేటుగా చదివారు. శ్రీ రమణ పబ్లికేషన్స్ స్థాపించి ఔత్సాహిత రచయితల్ని, శారదాపీఠాన్ని స్థాపించి కళాకారుల్ని సభా ప్రోత్సహించారు. సభా తండ్రి చెంగల్వరాయుడు వీధిబడి ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. తల్లి పార్వతమ్మ పాలు, నెయ్యి అమ్మి కుటుంబానికి తోడ్పడేది. సభా కొంతకాలం పశువులు కాశారు. అయిదో తరగతి పాఠ్యపుస్తకాలను కొనడానికి ఎరువును సేకరించి అమ్మారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య పట్టుదలతో చదివి ఎదిగిన సభా ఏనాడూ కష్టాలకు చలించలేదు. తనచుట్టూ ఉన్న రైతు కూలీలు, రైతులు, వివిధ గ్రామీణ వృత్తులవారు, దళితులు పడుతున్న బాధలను చూసి తట్టుకోలేక అప్పటి సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూనే మరోవైపు ఉద్యమశీలత్వంతో కూడిన అనేక రచనలు చేశారు. 1947లో శివగిరిలో రైతాంగ విద్యాలయం నిర్వహించిన సభాకు రైతులలో ముడిపడిన వివిధ వృత్తి జీవిత సమస్యలు బాగా తెలుసు. తమకున్న కొద్దిపాటి పొలంలోనే స్వయంగా పంటలు పండించిన సభా అనుభవంలో రైతు కష్టాల్ని రంగరించుకున్నారు. గొడ్డూ గోదా మేత కోసం వాటితో పాటు మండుటెండల్లో కాపరిగా తిరిగిన ఆయనకు ఆకలి బాధేమిటో అవగతమైంది. మద్యనిషేధం ఎత్తివేతతో ఛిన్నాభిన్నమైన దళితుల జీవితం, దళిత స్త్రీలయాతనను ఆయన తట్టుకోలేకపోయారు. అంతరించిపోతున్న భూగర్భజలాలు, ప్రకృతి విధ్వంసంతో కూలిపోయిన వ్యవసాయం, అతీగతీ లేని వృత్తులు, జీవనకల్లోలాలు వంటి ఎన్నెన్నో పరిణామాలు స్వాతంత్య్రానికి కొంచెం అటూయిటూగా సభా రచనల్లో వ్యక్తమయ్యాయి.
1923 -1980 ల మధ్య జీవించిన సభా చిత్తూరు -జిల్లా రచయితల సంఘం, రచయితల సహకార ప్రచురణ సంఘం, కళాపరిషత్తు వంటి సంస్థలను స్థాపించి ఆ జిల్లాలో సాంస్కృతిక, సాహిత్య వాతావరణాన్ని సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యులుగా నియమితులయ్యారు. 1975లో మొదటి ప్రపంచ తెలుగు సభల్లో ప్రభుత్వం ఆయనను సత్కరించింది. 1940లో రచనా జీవితాన్ని ప్రారంభించిన సభా 300 కథానికలు, 7 నవలలు, పిల్లలు -పెద్దల కోసం అనేక కథలు, రచనలు చేశారు. కథా సంకలనాల్లో బంగారు, పాతాళగంగ, నీటిదీపాలు, నవలల్లో భిక్షుకి, మొగిలి, దేవాంతకులు ముఖ్యమైనవి. పిల్లలకోసం వచ్చిన కథా సంకలనాల్లో అరగొండ కథలు, సీసాచరిత్ర, ఐకమత్యం, చిలకమ్మ, బొంగరం, ప్రాచీన భారతి, విప్లవగాథలు చెప్పుకోదగ్గవి. పిల్లల నవలల్లో మత్స్యకన్యలు, సూర్యం, కవిగాయకుడు, చంద్రం, పసిహృదయాలు, బుజ్జి జిజ్జి, పావురాలు, బాలల నాటకాల్లో పరీక్షా ఫలితాలు, చిట్టిమరదలు, స్వతంత్రోదయం, పురవదినాయక, ఏటిగట్టున, చావుబేరం, బుర్రకథల్లో రైతురాజ్యం, పాంచజన్యం పేరొందాయి. దయానిధి, వేదభూమి, విశ్వరూప సందర్శనం అనేవి వీరి ప్రచురిత కావ్యాలు. 500 పైగా వివిధ పత్రికల్లో కవితలు ప్రచురితమయ్యాయి. రాయలసీమ జానపద గీతాల్ని సేకరించి ప్రచురించిన సభా లెక్కకుమించిన రేడియో ప్రసంగాలు చేశారు.
రాయలసీమ రైతాంగ సాహిత్య వైతాళికునిగా కె.సభా కృషి అనన్యసామాన్యం. పల్లెపట్టుల బాధల పాటల పల్లవుల మీద సజన దృష్టిని నిలిపిన సభా అభివృద్ధి పేర వంచనాపరులైన పాలనా యంత్రాంగంలోని క్షుద్రులమీద, రాజకీయ యంత్రాంగంలోని కొత్తతరం స్వార్థ రాజకీయ వాదులమీద, నిరసన గళం గట్టిగా విన్పించారు. గాంధేయ జాతీయ వాద స్ఫూర్తినిండిన భావాలు సభారచనల్లో కోకొల్లలుగా కన్పిస్తాయి. ఇతివృత్త స్వీకరణలం, కథనంలో పాత్రల చిత్రీకరణలో, కంఠస్వరంలో, వాతావరణ చిత్రణంలో, మానవ సంబంధాల నిరూపణలో అద్వితీయమైన శైలిని, నిబద్ధతను సభా రచనల్లో పాటించారు. రైతుల కథల్లో ఆదర్శవాస్తవికతా వాదం, కఠిన విమర్శనా వాస్తవికత, ప్రజాస్వామ్యంలోని కొన్ని లొసుగులు కన్పిస్తాయి. కథన శిల్పంలో చెక్కు చెదరని దేశీయతను సభా పాటించారు. ‘పిచ్చిదంపతులు’ అనే ఆయన కథ చదివినప్పుడు సమాజ ప్రేమకు మనస్సున్న మనుషులు కావాలనే ఒక సామాజిక వేదన గుండెను తాకుతుంది. ‘అంబా’ కథ సీమకరవు నేపథ్యంతో రాసింది. చదివిన ప్రతి పాఠకుణ్ణి అది ఒక విషాదాంతసంఘటనగా వెంటాడుతుంది. ‘అంతరంగం’ కథ గ్రామీణ జీవితం, రైతుల కడగండ్లు, కడుపునిండని కవుల కృతక కావ్యరచనను వెక్కిరిస్తుంది. ‘చుక్కలవరాలు’ కథ అచ్చమైన దేశీయతను చెబుతుంది.
-తిరునగరి శ్రీనివాస్
-“ఆంధ్రప్రభ దినపత్రిక” సౌజన్యం తో