
షాదీ (కథ) – సత్యాగ్ని
‘‘అస్సలాము అలైకుమ్.’’‘‘వా అలైకుమ్ అస్సలాం. వరహమతుల్లాహి వబరకాతహు’’ అంటూ, ఒక్కక్షణం మనిషిని ఎగాదిగా చూచి ‘‘అరే! మీరా! లోపలికి రండి భాయ్!’’ వాకిలి రెండవ రెక్కకూడా తెరిచాడు అబ్దుల్ రహమాన్.వచ్చిన వ్యక్తిని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి గబాగబా లోపలికి పోయి భార్యతో గుసగుసలాడి తిరిగొచ్చి అతని యెదురుగా కుర్చీలోకూర్చున్నాడు నింపాదిగా.
‘‘అదికాదు ముస్తఫా భాయ్, మీరొస్తున్నట్లు ఫోన్‌లో ఒక్కమాట చెప్పివుంటే బస్టాండుకు కారు పంపేవాన్ని కదా! మా ఇల్లు కనుక్కోవడానికి ఎన్నితంటాలు పడ్డారో ఏమో!’’‘‘లేదు రహమాన్ భాయ్, కడపలో నా స్నేహితుడున్నాడు. అతను నా కొలీగ్. ఈమధ్య ఆరోగ్యం బాగలేదని తెలిసి చూసి పోదామని వచ్చాను. ఎటూ వచ్చాను కదా.. మిమ్మల్ని కూడా చూద్దామని …’’ మాట దిగమింగాడు ముస్తఫా.‘‘మంచిపని చేశారు. అన్నట్లు మీ భార్యను కూడా పిలుచుకొచ్చింటే బాగుండేది. ఆమె కూడా మా యిల్లు చూసినట్లయ్యేది. అయినా ఈ ఇంట్లో సంసారం చేస్తున్నామా ఏమి? పెండ్లికి ముందే కొత్త యిల్లు తయారవుతుంది. అక్కడికి షిప్టు అవుతాం’’ అన్నాడు అబ్దుల్ రహమాన్ ఆడంబరంగా.ట్రేలో ‘చా’ కెటిల్, బిస్కట్లు తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు ఒక అబ్బాయి.
అబ్దుల్ రహమాన్ టీపాయ్‌ని ముస్తఫా దగ్గరికి జరుపుతూ ‘బిస్కెట్లు తీసుకోండి’ అన్నట్లు చేత్తో సైగ చేశాడు.‘‘ముస్తఫా భాయ్ .. మా బేగం, కొడుకు పెండ్లి కొత్త యింట్లోనే చేయాలని చాలా పట్టుదలగా ఉంది. మా బంధువుల్లో చాలామంది పెద్ద షావుకార్లు, బడా ఉద్యోగాలు చేసేవాళ్ళున్నారు. వాళ్ళందరు ఔరా .. అని ముక్కున వేలేసుకునేట్లు ఉండాలంటుంది. తొందరగా యిల్లు పూర్తిచేయమని రోజూ ఒకే సతాయింపనుకోండి. రెండు మూడు నెలల్లో పూర్తిచేస్తాను. చూడండి భాయ్, అప్పటికప్పుడు పెండ్లి నిశ్చయం చేసుకుంటే పిల్లలకు శెలవు దొరకొద్దూ! మొన్న మీ అమ్మాయిని చూడ్డానికి వచ్చినప్పుడు మా వాడన్నాడూ – సెలవుకు అప్లై చేసుకోవడానికని, రొన్నెళ్ళ ముందే డేట్ నిశ్చయించమన్నాడు. అమ్మాయి, మావాడు ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి పెద్ద ఇబ్బందేమీ ఉండదంట లెండి. ఎటూ మీరిప్పుడు వొచ్చారు గదా, పదిరోజులు అటో ఇటో ఫలానా రోజు అనుకుంటే బాగుంటుంది భాయ్’’ అన్నాడు అబ్దుల్ రహమాన్.
ముస్తఫా తల వూపి వూరుకున్నాడు.‘‘ఆ రోజున ఇరవై అయిదు తులాల బంగారు, పదిలక్షలు నగదు కట్నమడిగాం. ఇంట్లో వాళ్ళందరు మాట్లాడుకుని తర్వాత చెప్పి పంపిస్తామన్నారు. ఇంతవరకు మీరా వూసే ఎత్తలేదు. బహుశా మీరు ఒప్పుకున్నట్లే అనుకుంటున్నా’’ అని అతని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు రహమాన్.ముస్తఫా ఉలకలేదు, పలకలేదు.‘‘మేమడిగిన దానికంటే ఎక్కువిచ్చే వాళ్ళున్నారు భాయ్. మీ అమ్మాయి మావాడితో పాటు అదే కంపెనీలో ఉద్యోగం చేస్తోంది కాబట్టి ఆడికి సర్దుకున్నాం. ఇంకోమాట భాయ్! పెండ్లి కుమార్తెకు మా తరఫున ఐదు పట్టు చీరలు, కొన్ని వస్తువులు తీసుకోవాలి. అవి సెలెక్టు చేయడానికి మీ ఆడవాళ్ళను పంపిస్తే అందరూ కలిసిపోయి ఖరీదు చేయొచ్చు. మీవాళ్ళకు ఒక విషయం చెప్పి పంపించండి. ఇప్పుడు చీరలు దోమతెరల మాదిరి సరికొత్త డిజైన్‌లు వచ్చినాయి. కొత్త తరమంతా వాటివైపు ఎగబడుతున్నారు.
పాత తరం జరీ అంచు పట్టుచీరలున్నాయ్, భేషుగ్గా ఉంటాయి భాయ్! అవి ఎంత ఖరీదైనా ఫర్వాలే, అవే తీసుకోమని చెప్పండి. వాటి హుందాతనమే వేరు భాయ్ …ఆ హంగు ఆర్భాటమూ మన తరంతోనే ఆఖరి అనుకుంటున్నాను భాయ్. ఇప్పుడంతా అల్లాటప్పగా తీసుకుంటున్నారు. అవేం రోజూ కట్టుకునేటివా! పది సంవత్సరాలు మనగలగాలి గదా. కడపలో అంత ఖరీదైనవి దొరుకుతాయా అని అనుమానమొద్దు. ఇక్కడ లేకపోతే పొద్దుటూరులో కొందాం. మనమేం అప్పు తీసుకుంటున్నామా? క్యాషు .. ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుందాం’’ అని ముస్తఫాను ఎగాదిగా చూశాడు, రహమాన్.ముస్తఫా మారు మాట్లడకుండా అతని వైపే చూస్తున్నాడు.
‘‘మరో విషయం భాయ్ .. విధిగా పెండ్లికుమార్తెకు మేము నల్లపూసల సరడు చేయించాలి. మొన్న మా ఆవిడ కంసాలిని పిలిచి బోలెడన్ని డిజైన్‌లు చూసింది. నాలుగైదు తులాలైనా ఫర్వాలేదు, భారీగా ఉండేట్లు చూడమన్నాను. రెండు మూడు డిజైన్‌లు సెలెక్టు చేసింది. మీవాళ్ళకు ఒకసారి చూపించి ఖాయ పెట్టాలంది. అదేకాదు, ఐదు తులాలు గట్టి చైన్ కూడా చేయిస్తోంది. మా తరపున పదితులాల బంగారు పెట్టాలను కున్నాం భాయ్ ..’’ అన్నాడు తన ఉదార త్వాన్ని చాటుతున్నట్లు తదేకంగా చూస్తూ.
‘‘రేపొద్దున పేచీలేమీ రాకుండా మహరు (భరణం) విషయం కూడా వివరంగా మాట్లాడుకుంటే మంచిది. మన కాలంలో ఐదువందలు మహరు ఉండేది. వెయ్యి రూపాయలంటే గొప్ప ధనవంతులన్న మాట. ఇపుడు పేదవాడు కూడా ఐదు వేలంటున్నాడు. అందుకే నేను ఈ కాలానికి తగ్గట్టు యాభైవేలు ఖాయపెట్టుకుందా మనుకుంటున్నాను’’ అని ముస్తఫా వైపు చూచి, ‘‘నీకిష్టమేగా’’ అన్నాడు రహమాన్.ముస్తఫా ‘సరే’ నన్నట్లు తల పరికించాడు.‘‘ఇస్లాం మతం ప్రకారం ‘మహరు’ స్ర్తీధనం. కాబట్టి చెల్లించాలి గానీ మేము ‘తలాక్’ చెప్పేదేం లేదు కదా! అసలు ఈ తలాకు, ‘వినాశకాలే విపరీత బుద్థి’ అని ఈ కాలం పిల్లలకు చెల్లింది గానీ మన కాలంలో ఎక్కడిది భాయ్! పెద్దల చాటుమాటున గుట్టుగా సంసారం చేసుకునే వాళ్ళం. నాకు తెలిసి మా పూర్వీకులెవ్వరూ తలాక్ జోలికి పోయిన దాఖలాలు లేవు…అన్నట్లు మన కాలంలో ‘మహరు ఇంత’ అని నిఖానామా పుస్తకంలో రాసేవారు.
దురదృష్టవశాత్తు విడిపోవడం జరిగితేనే చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నిఖా అయిన మరుక్షణం చెల్లించాలి. అట్లా ఇవ్వకుండా పెళ్ళికూతురు ముఖం చూడకూడ దంటోందట మన ధర్మం. అందుకే నేను రెండుతులాలు బంగారు వస్తువు చేసి మహరుగా ఇవ్వాలనుకున్నా. ఇంకా పెళ్ళికూతురికి మెట్టెలు, గాజులు, ఐదు జతల చెప్పులు. అబ్బో చిల్లర మల్లర బోలెడున్నాయి, మీకు తెలియనిదేముంది? మనమేం కంగారు పడాల్సిందేం లేదు. అవన్నీ ఆడవాళ్ళు చూసుకుంటారు’’ అన్నాడు రహమాన్.కొంచెం విరామమిచ్చి – ‘‘ఇంకోసారి టీ తెప్పించమంటారా’’ అడిగాడు.
‘‘వద్దు భాయ్’’ అని వారిస్తూ, ‘‘మరి నేను పోయి రానా?’’ అన్నాడు రహమాన్‌ను చూసి.‘‘అరే, ఏంది భాయ్ .. ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకునేదుంది. అప్పుడే తొందరపడితే ఎట్ల? మధ్యాహ్నం భోంచేసి ఓ గంట రెస్టు తీసుకోండి. కొత్త యిల్లు కూడా చూచి పోదురు’’ అని ఖరాఖండిగా చెప్పాడు రహమాన్.తర్వాత ఊపిరి గట్టిగా పీల్చి వదులుతూ ..‘‘మరీ ముఖ్య విషయం ముస్తఫా భాయ్ .. ఈ నడుమ అందరూ నిఖా, వలీమా రెండూ కలిపి చేస్తున్నారు. ఇద్దరూ ఒకే వూరి వాళ్లైతే సాధ్యపడుతుంది గానీ మన కేడైతాది?
అనంతపురంలో మంచి షాదీఖానాలుండాయి కదా .. మనం పెండ్లి రెండు మాసాలకు ముందే అనుకుంటే, అప్పుడు మంచి ఎండలుంటాయి. పిల్లలు పెద్దలు కుతకుత ఉడికిపోతారు. ఏసీ షాదీమహల్ చూడండి. అప్పటి కప్పుడైతే దొరకవు. అందుకే నేను తొందర పెడ్తావుండేది.మీ తరఫున యెందరు బంధువులుంటారో తెలియదు గానీ, మా తరఫున అందరు కలిసి సుమారు వెయ్యి మందుంటారు. ఇది టాలీ చేసుకుని అందరికీ సరిపడా వంట చేయాలి మీరు. నేను ఎనిమిది టూరిస్టు బస్సులు ఏర్పాటు చేస్తున్నా. ఆరు బస్సులు నిఖా రోజు ఉదయం బయలుదేర్తాయి. మేము దగ్గరి బంధువులం రెండు బస్సుల్లో, కార్లలో బయలుదేరి నిఖా ముందు రోజు సాయంత్రం మీ వూరు చేరుకుంటాం.మాకు ఉండటానికి పెద్ద యిల్లు, విఐపీలకు పది ఏసీ రూంలు బుక్ చేయండి. సర్దుకుంటాం.
మీ యింట్లో మొదటి పెండ్లి అని కాస్తా వివరంగా చెపుతున్నాను.పెళ్ళి కొడుకును వూరేగించడం, బాజాభజంత్రీలు, డాన్సులు షరియత్ ప్రకారం చేయకూడదు కాబట్టి వాటి జోలికి మేము పోము. పెండ్లికొడుకు అలంకరణలు మీకు తెలుసు. దానికి తగిన పూలు తెప్పించి ఘనంగా షేరా కట్టించండి. అన్నట్లు మరిచాను, నిఖా చేయడానికి ఖాజీని ముందే ఏర్పాటు చేసుకోండి. అప్పటికప్పుడంటే దొరకడం కష్టం.వంట కూడా క్యాటరింగ్ ఇవ్వొద్దు. స్వయంగా తయారు చేయించండి. వంటకాలు వంటవాళ్ళ మీద విడిచిపెడ్తే – అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, మా పని తనం చూడండని మనల్ని మునగ చెట్టెక్కిస్తారు భాయ్, హుషారుగా ఉండాల!వెరైటీలు దండిగా చేయించకండి, వూరక దుబారవుతాయి.
బిర్యానీ, దాల్చ లేకుంటే వంకాయ చెట్నీ, భాజీ, పెరుగుచట్నీ, బోన్‌లెస్ చికెన్ కబాబ్, వీటితో పాటు స్వీట్లు వెరైటీల్లో బోట్ కా హల్వ, ఫిర్నీ, నాన్ పెడితే సింపుల్‌గా చాలా బాగుంటుంది.ఇంకో మాట భాయ్, బిర్యానీలో చాలా వెరైటీలున్నాయి. ‘పస్సో బిర్యాని’ చేయించండి. మా వాళ్ళకు బిర్యానికి చిట్టి ముత్యాల బియ్యమే కావాలంటారు. కేజీ బియ్యానికి, కేజీ మాంసం లెక్కన వేయమనండి. అప్పుడు బిర్యానీ తగినట్లుగా ఉంటుంది. మా ఊరివాళ్ళు వేలెత్తి చూపకుండా వుండేట్లు చూడాల.
మనది కొత్త బంధుత్వం భాయ్! రేపేదన్నా తేడా జరిగితే మనసుకు కష్టమవుతుంది. నాకు తన మన లేదు. అందరూ నా వాళ్ళే అనుకుంటా. మీకు పైసా నష్టం జరిగినా నాకు జరిగినట్లే బాధపడతా.చూడండీ, ఇన్ని విషయాలు పూస గుచ్చినట్లు మీకు చెబుతున్నాను. అప్పటికీ ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. ఏం లేదు భాయ్! లారీ ఓనర్‌ను కదా, కడపలో చాలామంది వ్యాపారస్తులతో లావాదేవీలున్నాయి. వాళ్ళలో వైశ్యులెక్కువ. ఎప్పుడు కనపడినా ఏం రహమాన్ భాయ్ .. కొడుకు పెళ్ళెప్పుడు? మమ్మల్ని మర్చిపోయేవ్‌బ్బా .. అంటుంటారు. వాళ్ళకు సపరేటుగా శాకాహారం ఏర్పాటు చేయాలి. ఒక వంద మందికి క్యాటరింగ్ ఇచ్చినా ఫర్వాలేదు.ఇక పెళ్ళి కొడుకు నిఖా డ్రస్సు, బూట్లు, లుంగి తదితరాలు మీరే పంపించాలి.
ఆయన ఏవి ఇష్టపడతాడో, ఏమో! ఎటూ మీరు పెండ్లి కూతురికి కొత్తబట్టలు తీసుకుంటారు గదా, ఫలానా చోట అంటే ఆయన్నుకూడా పంపిస్తా.’’ముస్తఫా భుజం పట్టుకుని కదిలిస్తూ -‘‘చూడు భాయ్ మన కాలంలో పేదాసాదా అయితే పెండ్లి కుమార్తెకు ఐదు లేక ఏడు జతలు బట్టలు పెట్టేవాళ్ళు. కొంచెం ఉన్నవాళ్ళయితే పదకొండు లేక పదహైదు జతలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది. ఇన్ని జతలు అని లెక్కా పక్కా లేదు. అమాంతం పెరిగిపోయింది. కొందరు నూటయాభయనీ, నూరనీ, ఎవరు పెట్టినా డెబ్భైకి తక్కువ లేకుండా పెడుతున్నారు. నేను మీకు అట్టే బరువు పెట్టదల్చుకోలేదు.
డెబ్భై జతలు పెట్టండి చాలు, సర్దుకుంటాం లెండి. నా భార్య, నా మరదళ్ళూ ‘అంతేనా’ అని గొణుగుతారు. ఏం కంగారుపడొద్దని మీ వాళ్ళకు ముందే చెప్పండి. నేను చూసుకుంటాను.షుక్రానా, నిఖా, వలీమాలకు పెండ్లికొడుకుకు ఇవ్వవలసిన చదివింపులు ఉంగరం, రిస్ట్‌వాచి, బ్రాస్‌లెట్‌లు ఎట్లాగూ మీరు పెట్టేవే’’ అన్నాడు రహమాన్ ముక్తాయింపుగా.వంటింట్లో నుంచి గరిటెతో, స్టీలు గిన్నెను వాయించిన శబ్దం రాగానే ..‘‘భోజనం రెడీ అయిపోయింది భాయ్, రెండు నిమిషాలు కూర్చోండి. నేను ఏర్పాటు చేసొస్తాను’’ అని రహమాన్ లోనికి పోయాడు.
ఫ ఫ ఫ‘‘ఇది ద్వారకా నగర్ కాలనీ ముస్తఫా భాయ్! ఈ ఏరియా అంతా రాయల్ ఫ్యామిలీసే. ఇక్కడ యింటి స్థలం దొరకడం గొప్ప అదృష్టమనుకోండి. ఇప్పుడైతే అసలు కొనలేం. అమాంతం ధరలు పెరిగిపోయాయి. చాలా సంవత్సరాల క్రితం తీసుకున్న పదిసెంట్ల ప్లాట్ యిది. ఐదు సెంట్లు ఆవరణకు వదిలి ఐదు సెంట్లలో ఇల్లు కడుతున్నాను – డూప్లెక్స్.కడపలో పేరున్న ఇంజనీర్ సాగర్ అన్నీ తానై కడుతున్నాడు. ఏ మాత్రమూ కోతపెట్టకుండా ఆయన కోరినట్లు మెటీరియల్ సరఫరా చేస్తున్నాను. ఆజూబాజూ ఇళ్ళకు తీసిపోకూడదని ముందే చెప్పాను. అన్ని వసతులతో, కింద రెండూ, పైన రెండూ బెడ్‌రూమ్‌లు, నమాజ్ రూంలు వుండేటట్లు కట్టాను.నేను రెండుసార్లు ‘హజ్’ యాత్ర చేశాను. నాకు వాస్తు ఇటువంటి వాటి మీద నమ్మకాలు లేవు.
అయినా ఏం చేస్తాం భాయ్! ఇంజనీరు, మేస్ర్తీ ఒప్పుకోలేదు. వాళ్ళిష్టానికి వదిలేశా.నా ఇద్దరు కొడుకులకు చెరొక ఇల్లు వుంటుందని ఫ్యూచర్ ప్లాన్‌తో కట్టినాలెండి ..’’ అంటూ ముస్తఫా వైపు ఎగాదిగా ఆడంబరంగా చూశాడు.అతను తలాడించి వూరుకున్నాడు.‘‘ఇటురండి భాయ్’’ అని ముస్తఫాను కిచెన్ లోకి తీసుకుపోయి చూపిస్తూ, ‘‘బాగా విస్తా రంగా కట్టాను. రేపు మీ అమ్మాయికి కిచెన్ సామాన్లు సైజు వారీగా డేక్షాల నుండి, తట్టల దాకా అన్ని రకాలు ఇస్తారు గదా, అవన్నీ ఇమడాలంటే ఈ మాత్రం ఉండాలి గదా మరి.ఇదే మాస్టర్ బెడ్‌రూం. మీరిచ్చే పట్టెమంచం పెద్దదిగా ఉంటుంది గదా, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఈ రూంలో పడుతుంది. ఈ రూంలో ఎల్‌ఇడి టీవీ పెట్టుకునే ఏర్పాటు చూడండి. ఒక్కమాట భాయ్, పట్టెమంచం రెడీమేడ్ కొనకండి.
ప్యూర్ టేకుతో చేయించండి, పదికాలాలపాటు ఉండాలి కదా! బీరువా కూడా కొత్త మోడల్ చూచి గోద్రెజ్ కంపెనీది తీసుకోండి. నిజానికి ఇవన్నీ నాకు బొత్తిగా యిష్టం లేదు భాయ్. కాని కాలంకొద్ది అందరితో పాటు మనమూ చేయాల్సి వస్తోంది.ఇక ఫర్నీచర్ విషయం, మీ యిష్టానికి వదిలిపెడుతున్నాను. ఏదీ నేను బలవంత పెట్టడం లేదు భాయ్, ఏమిచ్చినా మీకే గౌరవం కదా! ఇవ్వవలసినవన్నీ చెప్పాను. చిన్నా చితకా యేదైనా మర్చిపోయుంటాను భాయ్, మీ యింట్లో వాళ్ళనడిగి తెలుసుకోండి. మీ వాళ్ళందరితో మాట్లాడి వీలైనంత తొందరగా పెళ్ళి తారీఖులు ఖరారు చేసి వివరంగా ఉత్తరం ద్వారాగానీ, లేదంటే కనీసం ఫోన్ ద్వారాగానీ నాకు తెలియజేయండి.’’
ముస్తఫా ‘సరే’ అన్నట్లు తలాడించాడు.ఫ ఫ ఫపదహైదు రోజులయినా ముస్తఫా నుండి ఏ సమాచారం రాలేదు. కనీసం ఫోన్ కూడా లేదు. రోజులు గడిచే కొద్దీ రహమాన్‌కు కంగారు ఎక్కువయింది. ‘ముస్తఫా మనసు మార్చుకున్నాడా, ఏమి?’ అనుమానం కలవరపెట్టింది.ఒకరోజు బజార్లో పనులు ముగించుకుని మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. కొరియర్ వచ్చిందని అతని భార్య కవర్ చేతికిచ్చింది. ప్రాణం ఉగ్గబట్టుకుని ఆదరాబాదరా చించాడు.‘ప్రియమైన అబ్బాజాన్, అమ్మీజాన్‌లకుఅస్సాలము అలైకుమ్. వరహమతుల్లాహి వబరకాతహు.అన్ని విషయాలు ముస్తఫా గారి ద్వారా తెలుసుకున్నాను. చాలా బాధపడ్డాను. హంగు ఆర్భాటాలతో వివాహం చేసుకోవడం సుతరామూ నాకిష్టంలేదు. మన ఇస్లాం ధర్మం కూడా ఆడంబరాలు వద్దంటుంది.
ఈ విషయం మీకు తెలియజేస్తే నా పెళ్ళిని గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న మీకు నిరాశ కలిగించినట్లవుతుందని, అమ్మాయితో అన్ని విషయాలు మాట్లాడుకుని ఇరువైపుల వారినెవరినీ పిలవకుండా పదిమంది పెద్దల సమక్షంలో మసీదులో నిరాడంబరంగా నిఖా చేసుకున్నాము.అమ్మాయి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి కట్నాలు, కానుకలు కోరకుండా ఇచ్చిపుచ్చుకోవడాలు వాళ్ళిష్టానికే వదిలేద్దాం. అల్హజ్ (రెండుసార్లు మక్కా యాత్ర చేసిన వారు) అయిన మీరు నా అభిప్రాయాలను మన్నించగలరనుకుంటా.వలీమా తప్పకుండా మన యింటి వద్ద చేయాలి. ఫలానా తేది అని నిర్ణయించి మీరు తెలియజేస్తే నా భార్యను తీసుకుని వస్తాను. ఇట్లుమీ కుమారుడుసలీం
[author title=”షేక్ హుసేన్ గురించి” image=”https://kadapa.info/wp-content/uploads/2018/09/satyagni-1.jpg”]
ముస్లిం స్త్రీల వ్యదార్ధ జీవితాలను, హిందూ ముస్లిం భావ సమైక్యతనూ తన కథల్లో చిత్రించిన మంచి రచయిత సత్యాగ్ని. షేక్ హుసేన్ సత్యాగ్ని అనే కలంపేరుతో పాచికలు, అగ్ని సరస్సు అనే కథల సంపుటాలను వెలువరించారు. కడప వీరి స్వస్థలం. వీరు ఒక పర్యాయం ఆం.ప్ర.ప్రభుత్వ శాసనమండలి సభ్యులుగా పనిచేసినారు. కడప జిల్లాలోని షేక్ బుడన్‌సాహెబ్ వంటి కవులు, పండిత కవులతో పోటీ పడి మనుచరిత్ర పద్య నిర్మాణ వారసత్యాన్ని కొనసాగిస్తే, సత్యాగ్ని వంటివారు యధార్ధ జీవన చిత్రణకు వచన రచన యోగ్యమైందని విశ్వసించి ఆ రంగంలో కృషి సాగించటం ఒక విశేషం.
[/author]