
ఒంటిమిట్ట కొదందరామాలయంలోని ఒక శాసనం
కడప జిల్లా శాసనాలు 2
స్మారక శిలలు, వీరగల్లులు …
శాసన భేదాల్లో స్మారక శిలలు, వీరగల్లులను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం ఉంది. యుద్ధంలో మరణించిన వీరులకు, దైవానుగ్రహం కోసం ఆత్మబలి చేసుకున్న భక్తులకు స్మారక శిలలను ప్రతిష్ఠించే ఆచారం ఉండేది. బృహచ్ఛిలాయుగం నాటి సమాధులు, చారిత్రక యుగం నాటి ఛాయాస్తంభాలు, బౌద్ధస్తూపాలు కూడా స్మారక చిహ్నాలేనని చరిత్రకారుల అభిప్రాయం.
రాజులు, రాణులు, మత గురువులు మరణించినప్పుడు వారి స్మృత్యర్థం ఛాయాస్తంభాలను నిలిపేవాళ్లు మరణించినవారి ఛాయ ఈ స్తంభంలో ఉంటుందని ఆనాటి ప్రజల విశ్వాసం. ఈ స్మృతి చిహ్నాలు క్రీ.శ. 250-325 మధ్య ప్రాంతం నుంచి కనిపిస్తున్నాయి.
గంగపేరూరులోని బ్రాహ్మీలిపిలో ఉన్న కాలనిర్ణయంలేని ఒక ప్రాకృత శాసనంలో పరిఆచరియ పుత్రుడు, భరద్వాజ గోత్రుడు అయిన శివదాస అనే వ్యక్తి స్మృత్యర్థం ఛాయాకంబాన్ని ఎత్తించినట్లు నమోదు చేయబడింది.
యుద్ధాలలో మరణించిన వీరుల స్మృత్యర్థం నిలిపిన వీరగల్లులు కడప జిల్లాలో వైదుంబుల కాలానికి చెందినవి ఎక్కువగా ఉన్నాయి. ఈ వీరగల్లులు సమకాలీన సమాజాన్ని గురించికానీ, ఆర్థిక వ్యవస్థను గురించి కాని అంతగా తెలియజేయలేకపోయినప్పటికీ ఆనాటి యుద్ధాల వల్ల ఏర్పడిన రాజకీయ అస్థిరతను సూచిస్తున్నాయి.
వీరగల్లుల్లో, మరణించిన వీరుని యొక్క అతని శత్రువు యొక్క ప్రతిమలు యుద్ధభంగిమల్లో చెక్కబడి ఉంటాయి. కొన్ని వీరగల్లులు శాసన సహితంగా కూడా ఉంటాయి. ఇటువంటి శాసనాల్లో శాసనకాలం, రాజ్యపాలకుని ప్రశస్తి, మరణించిన వీరుని ప్రశస్తి, అతని హోదా, పరాక్రమ వర్ణన, యుద్ధాలలో సాధించిన విజయాలు, అతడు మరణించిన సంఘటనకు సంబంధించిన వివరాలు పేర్కొనబడతాయి.
వైదుంబరాజు గండత్రినేత్రుడు నోళంబులతో జరిపిన యుద్ధాలలో ప్రముఖమైన సంఘటనగా చెప్పుకోదగిన సోరమేణ్ణికోట ముట్టడి జరిగినప్పుడు గండత్రినేత్రుడికి సామంతునిగా వళాకంబు అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న విన్నమ విక్రమరెడ్డి అనే వీరుడు రాచమల్ల, నోలుమ్బి, మైన్దడి, దడిగ అనే వీరులను ఎదుర్కొని వారి ఏనుగులను, గుర్రాలను చంపి తాను ఇంద్రలోకానికి వెళ్లినట్లు బండపల్లిలోని ఒక వీరగల్లు శాసనంలో నమోదు చేయబడింది.
కల్యాణీ చాళుక్యరాజు త్రైలోక్యమల్ల మహారాజు కాలంలో ఈ ప్రాంతానికి దండనాయకుడుగా ఉన్న మహామండలేశ్వర కటక చంద్రదండ నాయకుడు, అతని బావమరిది మధువరస, స్థానిక నాయకుడైన భీమరసల వీరగల్లులు దేవగుడిలోని తలకంటీశ్వరి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. కురుమారి (దానవులపాడు?), పెద్ద పసుపుల గ్రామాల మధ్య పొలిమేర విషయంలో తగాదా రాగా ఈ తగాదాను పరిష్కరించడానికి త్రైలోక్యమల్ల రెండు గ్రామాల పొలిమేర వద్ద రాళ్లు పాతించగా భీమరస, పెద్ద పసుపుల గ్రామస్థులు గుర్రాలతో వచ్చి ఆ రాళ్లను తీసివేశారు. అప్పుడు జరిగిన ఘర్షణలో కటకచంద్ర దండనాయకుడు, మధువరస, భీమరస, మల్లోజ సేవకుడు మరణించాడు. వారి స్మృత్యర్థం వేయించింది ఈ వీరగల్లులు. వీటిలో కటకచంద్ర దండ నాయకుడు, భీమరస గుర్రాలపై ఆయుధదారులై ఉన్నట్లు, వారి శత్రువులు ఎటువంటి వాహనాలు లేకుండా భూమిపై నిలబడినట్లు చూపించారు.
ఆత్మబలి చేసుకున్న వీరశైవ భక్తులు…
మోపూరులోని భైరవేశ్వరాలయం ఆవరణలో ముప్ఫైరెండు వీరగల్లులున్నాయి. వీటిలో ఎక్కువభాగం ఆత్మబలి చేసుకున్న వీరశైవ భక్తుల స్మృత్యర్థం వేయించబడ్డాయి. ఈ ప్రతిమల్లో వీరశైవ భక్తులు ఖడ్గంతో కంఠాన్ని కత్తిరించుకున్నట్లు, గుండెను చీల్చుకున్నట్లు లేదా కడుపు నుంచి పేగులు బయటకు వచ్చేటట్లు పొడుచుకున్నట్లు వివిధ భంగిమలలో కనిపిస్తారు. తల తరిగి ఇస్తే రెండు కన్నులు పోయి మూడు కన్నులు, రెండు భుజాలు పోయి పది భుజాలు, ఒక ముఖం పోయి పంచముఖాలు వస్తాయని వీరశైవుల విశ్వాసం. అష్టదిక్కులలో ఉండే అష్టభైరవులకు అష్టాంగ రుధిరంతో అర్చన చేసి రక్తసిక్తమైన కంఠాన్ని బలి ఇస్తే శక్తి తమ కోర్కెలనన్నింటిని తీరుస్తుందనే విశ్వాసం సింహాసన ద్వాత్రింశికలో కనిపిస్తూ ఉంది. మిగిలిన వీరగల్లుల్లో అశ్వంపై ఉన్న వీరుల శిలలు ముఖ్యమైనవి. ఈ వీరగల్లులు మూడు అంతస్థులుగా విభజింపబడి ఉన్నాయి. పై అంతస్థులో వీరుడు స్వర్గానికి వెళుతున్నట్లు, మధ్య భాగంలో వీరుడు అశ్వార్థరూఢుండై ఈటె, ఖడ్గాలను ధరించివున్నట్లు క్రింది భాగంలో అతని చేతిలో మరణించినవారి బొమ్మలు చెక్కబడ్డాయి. ఇంకొక వీరగల్లుపై ఆయుధధారియైన వీరుడు అశ్వారూఢుడై ఉండగా క్రింద ఆవులమంద ఉన్నట్లు చెక్కబడింది. ఈ వీరగల్లు మందపోటులో మరణించిన వీరునిదని స్పష్టమౌతూ ఉంది. ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పండుగరోజుల్లో ఈ వీరగల్లులను నూనెతో అభిషేకించి పూజలు చేస్తారు.
రాచపీనుగ తోడు లేనిదే పోదు!
కడప జిల్లాలో లభించిన కొన్ని అరుదైన శాసనాల్లోని విషయాలు మనకు ఆశ్చర్యాన్ని విస్మయాన్ని కలిగిస్తాయి. రాచపీనుగ తోడు లేనిదే పోదనే సామెత ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉంది. అయితే ఈ సామెత పుట్టి దానికి పూర్వరంగం ఏమిటో తెలుగువాళ్లకు అంతగా తెలియదు. మధ్యయుగ ఆరంభదశల్లో కీతిగుంట అనే సంప్రదాయం వ్యాప్తిలో ఉండినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తూంది. ఈ సంప్రదాయంలో కొందరు రాజులు లెంక, గరుడ, వేళెవాడి, జోళెవాడి వంటి భృత్యులను నియమించుకుంటారు. ఈ భృత్యులు సర్వకాలాల్లోను రాజుకు సన్నిహితంగా ఉండి రాజుతోపాటు సమానమైన భోగాలను అనుభవిస్తుంటారు. రాజు శారీరకంగా బాధపడితే తాము కూడా కృత్రిమంగా బాధను కలిగించుకుంటారు.
ఉదాహరణకు – రాజుకు తలనొప్పి వస్తే, గోడకు తలను బాదుకుని లేదా తలను తాళ్లతో బిగించుకుని వీళ్లు కూడా తలనొప్పి తెచ్చుకుంటారు. రాజుకు కడుపునొప్పి వస్తే కొన్ని మైళ్ల దూరం వేగంగా పరుగెత్తి వీళ్లు కూడా కడుపునొప్పి తెచ్చుకుంటారు. రాజు యుద్ధంలో మరణిస్తే వీళ్లు కూడా ఆత్మబలి పద్ధతుల్లో మరణిస్తారు. ఈ విధంగా మరణించిన భృత్యుని శరీరంపై రాజు మృత శరీరాన్ని ఉంచి అంత్యక్రియలు జరుపుతారు. కీతిగుంట అనే పదంలో కీతి అనేది క్రించ అనే అర్ధమున్న ద్రావిడ పదాంశం. కాబట్టి గుంటలో రాజు మృత శరీరానికి కింద భృత్యుని మృత శరీరాన్ని ఉంచి నిర్వహించే అంత్యక్రియ అని దీన్ని అర్ధం చేసుకోవచ్చు. కీతిగుంట సంప్రదాయానికి సంబంధించిన శాసనాలు ఆంధ్ర దేశంలో కేవలం మూడు మాత్రమే లభించాయి. వాటిలో రెండు కడప జిల్లాలోని వండాడిలో ఇంకొకటి అనంతపురం జిల్లా హేమావతిలో ఉన్నాయి. ఈ శాసనాలు వైదుంబరాజు గండ త్రినేత్రుని కాలానికి చెందినవి.
(సశేషం)