ఆంధ్రప్రదేశ్‌లో జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపద గేయాలు వేనవేలు. ఔత్సాహిక కళాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు.
1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో జన్మించారు మునెయ్య. సరిగ్గా ఇది (2013) ఆయన 70వ జయంతి సంవత్సరం. అబ్బ శ్రీ కలిమిశెట్టి చౌడప్ప శిష్యరికంలో యక్షగానం, కోలాటం, పండరి భజన, చెక్క భజన తదితర కళారూపాలను తన పదవ ఏటనే సాధన చేసిన వ్యక్తీ మునెయ్య- స్వతహాగా చమత్కారి.
1979వ సం||లో జూలై 11న ఆకాశవాణి వివిధ భారతి ద్వారా రాయలసీమ జానపద గీతాలను – నాగపద్మిని, బాలకృష్ణ, శ్రీరాముల సహకారంతో తన గళాన్ని వినిపించి శ్రోతలను మైమరపింప చేశారు మునెయ్య. చారిత్రక సత్యాలు ప్రతిబింభించే బుడ్డా వెంగళరెడ్డి, గురిగింజ గుమ్మడి, కోడిపిల్ల, కోడిబాయ లచ్చమ్మది, యాపమానెక్కినావు, తేలుకుట్టిందే పిన్ని, నాంచారి, నామాట, కోల్ కోల్, చీరెల్, తుమ్మెదలు మొదలైన హాస్య గీతాలు ఆయన వినిపించినప్పుడు శ్రోతలు మరియు ప్రేక్షకుల మదిలో గిలిగింతలు కలిగిస్తాయి.
మునెయ్య రచనలలో దారిద్ర్యం, ఆకలి, వెట్టి చాకిరీ, అస్పృశ్యత, అణగారిన ప్రజలను మేలుకొలిపే విధంగా సమాజంలో జరుగుతున్న సంఘటనలను తన బాణిలో రచించి తన వాణిలో వినిపించి వెలుగులోకి తెచ్చారు.
ఆడియో కేసెట్ల ద్వారా జానపద గేయాలకు ఒక రూపాన్ని కల్పించిన వ్యక్తీ. ‘జానపద రంజని’,’జానపద నవరత్నాలు’, ‘జానపద శ్రుంగార రత్నాలు’,’జానపద ఆణిముత్యాలు’ మొదలైన కేసేట్లలో మునెయ్య గళం వినపడుతుంది.
1956వ సం||లో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు జమ్మలమడుగును సందర్శించినప్పుడు మునెయ్య పాటలను విని పరవశించి ఆయనను ఆశీర్వదించారు.
శ్రామికులు పర్వదినంగా జరుపుకునే ‘మేడే’ వేడుకలలో శ్రామికుల ముందు తన గళాన్ని విప్పడానికి తన బృందంతో 1.5.1997న మంత్రాలయంలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తూ కోడుమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కానరాని తీరాలకు వెళ్ళిపోయారు.
మనిషి పుట్టినా పాటే! , పోయినా పాటే!! – జానపదం ప్రతిచోటా వినపడుతూనే ఉంటుంది.
మునెయ్య రచన ‘రాయలసీమ రాగాలు’ నుంచి ప్రస్తుత వ్యాసం…
ఆంధ్ర సాహిత్యంలో అతి ప్రాచీనమైన శాసనాలు కడప జిల్లా కమలాపురం తాలూకా పోట్లదుర్తి, మాలెపాడు గ్రామాల్లో కనిపించాయి. అందులో దేశి ఛందస్సులో రగడ, తరువోజ వంటి వృత్తాలు ఉన్నాయి. ఈ వృత్తాలకు, గేయాలకు మేనమామ పోలిక అని చెప్పనక్కరలేదు. ఇవి ఆంద్ర మహాభారతం ఆవిర్భవించడానికి దాదాపు నాలుగు వందల ఏండ్ల ముందే రాయలసీమలో వెలసినాయి. రాయలసీమకు ఇంతటి ప్రాచీన గేయ చరిత్ర ఉంది.
‘ఉత్తర హరివంశం’ రాసిన నాచన సోమన (14వ శతాబ్దం) రాయలసీమవాడు. ‘వసంత విలాపం’ అనే గ్రంధాన్ని సోమన రాసినట్లు ప్రస్తావించబడింది. కాని అది మనకిప్పుడు అలభ్యం. సహజంగా పండితుల్లో గేయ సాహిత్యం పట్ల చులకన భావమే ‘వసంత విలాపం’ అంతరించడానికి కారణమై ఉంటుంది. కీ||శే|| వేటూరి ప్రభాకర శాస్త్రి గారు జానపద గేయ సాహిత్యం పరిశోధిస్తూ ఈ గేయం కనుగొన్నారు. మనకు లభించినంతలో రాయలసీమలో నాచన సోముని ‘వసంత విలాపమే’ మొదటిదని చెప్పవచ్చు.
తాళ్ళపాక అన్నమాచార్యులు (1424 – 1508), ఆ కాలంలో ఉండే జానపద గేయాల పలుకుబడి, ధాటి ఒరవడిగా తీసుకొని తన సంగీత విద్యాబలంతో శతసహస్రాలుగా పాటలు రాసి అమరుడైనాడు.
పల్లెల్లో మూలమూలలా పాడుకొనే జానపదగేయాలు సేకరించి ఒక సంపుటంగా తీర్చాలనే సంకల్పం ఆదిలో ఒక ఇంగ్లీషు దొరకు కలిగింది. ఆయన పేరు జె.ఏ. బాయ్ లీ. బాయిలీ రాయలసీమలో రాజకీయోద్యోగిగా పనిచేస్తూ మౌఖిక ప్రచారంలో ఉండే జానపదగేయాలు ఎంతో శ్రమపడి సేకరించి లోకోపకారం చేసినాడు. ఆయనకంటే ముందు గోపర్ కన్నడ, తమిళ, మళయాళ జానపద గేయాలు సేకరించి పల్లె సాహిత్యానికి ఎంతో సేవ చేసినవాడయ్యాడు. కాని, తెలుగులో జానపదగేయాలు ఆయన దృష్టికి అందినవి కావు.
తెలుగుభాషలోని జానపదగేయాలుగా వేమన పద్యాలు గుర్తించి స్వీకరించినాడు. వేమన పద్యాలు అచ్చుకట్టుగా ఆటవెలది పద్యాల్లో ఉన్నందువల్ల జానపదగేయాలుగా భ్రాంతిపడి ఉండవచ్చు. వాస్తవంగా జానపదగేయ సేకరణ క్రీ.శ.1874సం|| ప్రాంతాల్లో రాయలసీమలోనే జరిగింది. ఈ సందర్భంలో సి పి బ్రౌన్ కృషిని గురించి కూడా స్మరించుకోవాలి. గేయాలు పాడటానికి ఈ గ్రంధం చూచే ముందు రాయలసీమ గేయచరిత్ర రేఖామాత్రంగా పాఠకులకు విన్నవించడానికి కారణముంది.
ఎక్కడో విదేశాల్లో పుట్టి ఉద్యోగరీత్యా భారతదేశానికి వచ్చి రాయలసీమలో జానపదగేయ సేకరణ కోసం తమ జీవితాన్నంతా వెచ్చించిన ఆంగ్లేయుల కృషి, పట్టుదల గురించి చదువుతుంటే, ఈ మట్టిలో పుట్టి, ఈ మట్టిలో పెరిగిన నాకు ఒళ్ళు జలదరించింది.
రాయలసీమ జానపదగేయ చరిత్ర చదివి ఎంతో ప్రభావితున్నయి మరుగునపడిపోతున్న జానపద సంగీత సాహిత్యాలను ప్రజలకు పంచాలనే ఉత్సాహం పెంచుకున్నాను. అందుకు నేను పుట్టి పెరిగిన పరిసరాలు నన్నెంతో ముందుకు నడిపించాయి.
రాయలసీమలో ఒక మారుమూల పల్లెలో మా పూర్వీకులు మొదలుకొని మా తండ్రిగారి తరం వరకు వృత్తిరీత్యా చేనేతను స్వీకరించినవాళ్ళు. ప్రవృత్తి రీత్యా ఎన్నో జానపద కళారూపాల్లో ప్రవేశం ఉన్నవాళ్ళు. మా అబ్బగారు అంటే మా తండ్రి తండ్రిగారైన కీ.శే.కలిమిశెట్టి చౌడప్ప జానపద కళారూపాలైన యక్షగానాలలో ప్రవేశమున్నవారు – కోలాటం, చెక్కభజనల్లో ఆరితేరినవారు. ఈ కళారూపాలను కడప జిల్లాలోని ఎన్నో పల్లెల్లో కళాకారులకు శిక్షణ ఇచ్చి పేరు తెచ్చుకున్నారు. వారసత్వంగా మా నాన్నగారైన కీ.శే.పెద్ద రామయ్యకు ఈ కళల్లో మంచి ప్రవేశం కలిగింది.
దాదాపు ముప్పై అయిదు, నలబై సంవత్సరాల క్రితం పల్లెసీమల పరువాలన్నీ జానపదకళారూపాల్లో ప్రతిఫలిస్తూ ఉండేవి. నాడు ప్రతి పల్లెలో ఆటవిడుపు సమయాల్లో పల్లెసీమల నడిబొడ్డులో ఏదో ఒక జానపద కళారూపం గజ్జ కట్టించి జానపదుని నాట్యమాడించేది. ఈ ప్రేరణతోనే నాతో పాటు మా కుటుంబసభ్యులు మొత్తం ఆడపిల్లలతో సహా మా తండ్రి ద్వారా కోలాటం, చెక్కభజనల్లో శిక్షణ పొందడం జరిగింది. యక్షగానాల్లో పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంలోనే పలు రాగాల అవగాహన ఏర్పడింది.
పనికీ-పాటకు అవినాభావ సంబంధం ఉంది. శ్రమభార నివారణకోసం పాటలేనిదే జానపదులు పనిచేయలేరన్న నిజాన్ని నాకు అనుభవంలోకి తెచ్చింది మా అమ్మ మునెమ్మ – పాట లేనిదే పనికి ఒంగేది కాదు. రైతుకూలీగా వెళ్ళినప్పుడు కోతలోను, కలుపులోను, నాట్లలోను .. మొదలైన వ్యవసాయ పనుల్లో ప్రధాన గాయనిగా కథాగేయాలు మొదలు జానపదగేయాలు ఎంతో కమ్మగా పాడేది.
యక్షగానాలు, పౌరాణిక నాటక పద్యాల్లో కాస్తో, కూస్తో పరిచయం ఉంది. కనుక మాతల్లి పాడే జానపదగేయాల్లో ప్రాచీనమైన కొన్ని రాగాల ఛాయలు ఉన్నట్లు నాకు తోస్తుండేది. ఈ విషయం మా నాన్నగారితో చర్చించినపుడు వారు ఒక్కొక్క జానపదగేయానికి ఒక్కొక్క రాగం ఛాయామాత్రంగా ఉంటుందని ఎన్నోపాటలు పాడి వాటికి పలురాగాల పేర్లు చెపుతుండేవారు – అవి కీరవాణి, భైళీ, ఆనందభైరవి, కాంభోజి, కాఫీ, మాయా, గౌళ, నవరోజు, తోడి మొదలైనవి.
అప్పటినుండి వ్యవసాయ కూలీలు పాడే పాటలు జానపద కళారూపాలైన కోలాటం, చెక్కభజన మొదలైన గేయాలు, కుటుంబ సంబందమైన దంపుళ్ళ పాటలు, విసుర్రాయి పదాలు, పెళ్లి పాటలు, మొదలైన వాటిని పరిశీలించినాను. వీటి ప్రదర్శన సన్నివేశాలనూ, ప్రదర్శనా పద్ధతులనూ నిశితంగా గమనించినాను. కొన్ని సన్నివేశాల్లో, పద్ధతుల్లో పాటను కవిగట్టేవాల్లూ లేదా పాడేవాళ్ళూ, ప్రదర్శనలో పాల్గొనేవాల్లూ ఒకటే, దాదాపు ప్రేక్షకులుండరు. ఉదాహరణకు కలుపుపాటలు తీసుకోవచ్చు. అయితే కోలాటం వంటి వాటికి ప్రేక్షకులుంటారు.
ఈ అంశాలతో పాటు వారసత్వంగా అబ్బిన గానశక్తివల్లా, మా గురువుగారైన ఫిడేల్ విద్వాన్ శ్రీ పాలూరు సుబ్బన్న సహకారం వల్లా, రాగాతాళాలు ఎలా ఉంటాయో సూక్ష్మంగా పరిశీలించినాను. జానపద కళారూపాలైన చెక్కభజన, కోలాటం మరియు వ్యవసాయ సంబంధమైన కొన్ని పాటల పైన చెప్పిన రాగాచ్చాయలతో పాటు చావుతాళాలైన త్రిశ్ర, మిశ్ర, ఖండ జాతుల్లో నడుస్తున్నట్లు నాకనిపించాయి. కుటుంబ సంబంధమైన దంపుళ్ళ పాటలకు, పెళ్లి పాటలకు, పూజా పురస్కారాల పాటలకూ పైన చెప్పిన రాగాతాళాలు నిర్దేశించే వీలుంది కానీ విసుర్రాయి పదాల్లో ఏదో ఒక రాగం ఛాయా మాత్రంగా ఉన్నా తాళం నిర్దేశించడం కష్టంగా ఉంటూ వచ్చింది. ఎందుకంటే గేయంలో ప్రతీ వాక్యం దీర్ఘంగా ఉంటుంది కాబట్టి. విసుర్రాయి చాలించి గింజలు పోసేటప్పుడు పాట ఆగుతుంది. రాగం నిర్దేశించడం కష్టం అయ్యేది. అలాగే వ్యవసాయ సంబంధమైన కొన్ని ఏల పదాలకు రాగాతాళ విభజన ఎంత పరిశీలించినా అగమ్యగోచరంగా కనబడసాగింది.
ఈ నేపధ్యంలో రాయలసీమ జానపద సంగీత సాహిత్యాల గురించి కొంతవరకు తెలుసుకొనే అవకాశం పాలూరు సుబ్బన్నగారూ, మా తండ్రిగారు కల్పించారు. జానపద సంగీత సాహిత్యాలకు సంబంధించిన ఎన్నో పుస్తకాలు తెప్పించి ఇచ్చారు. డా. బిరుదురాజు రామరాజు, కీ.శే. ఆచార్య జి.ఎన్.రెడ్డి గార్లతో పరిచయ భాగ్యం కల్పించినారు. వారి సూచనల మేరకు జానపద కళారూపాలైన కోలాటం, చెక్కభజనల్లో ఎన్నో బృందాలకు శిక్షణ ఇచ్చి పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చాను.
ఇదిలా ఉండగా వింజమూరి సీత, అనసూయ గార్లు జానపద గేయాలను హార్మోనియం వాయిస్తూ డప్పు డోలక్ లతో వేదికపై ఎంతో నేర్పుగా, పల్లె యాసలో పాడి ప్రేక్షకుల ప్రశంసలందుకోవడం ఒక చోట కళ్ళారా చూసినాను. ఈ పద్ధతి నాకెంతో మేలనిపించింది. ఆ సమయంలో జానపదగేయాలలో ఛాయామాత్రంగా ఉన్న రాగాలకు, తాళాలకు నోట్సు తయారు చేసుకొని పాత బాణీలు చెదరకుండా పాడుతున్నట్లు వారు చెప్పగా వినడం జరిగింది. గతంలో నాకు కలిగిన ఇలాంటి ఊహకు ప్రాణం పోసినట్లయింది. వారిని ఆదర్శంగా తీసుకొని మా గురువుగారి సహకారంతో జానపదగేయాలకు నోట్స్ తయారుచేస్తూ వచ్చాను.
కోలన్న, చెక్క భజన మొదలైన కళారూపాలలో ముప్పయి, నలభై మంది కళాకారులతో కాకుండా కేవలం అయిదు లేదా ఆరు మందితో జానపద గాయకుడిగా పాత బాణీలు చెదరకుండా, జానపద సంగీత సాహిత్య ప్రదర్శనలివ్వడం సులభమనిపించింది. ఈ ప్రక్రియ అనుకున్నంత సులభం కాదని తర్వాత తెలిసింది. ఈ పద్ధతి ఆచరణలో పెట్టే సమయానికే జనంపై సినిమా సంగీత ప్రభావం ఎక్కువయింది. దాన్ని తట్టుకొని జానపద సంగీతం నిలబడాలంటే అందులోని పాత బాణీ చెదరకుండా, పాట ఎత్తుగడలోను, చరణాలు విరువడంలోను కొద్ది మార్పులు చేయక తప్పలేదు.
మార్పులో భాగంగా సగం దొరికిన జానపద గేయాలను తమ సొంత కవిత్వంతో పూర్తి చేయడం సంప్రదాయ జానపద సంగీతానికే విరుద్ధం. ఒక్కోమారు జానపదగేయం మొత్తం ఒకేచోట దొరకదు. గేయం మొదటిభాగామో, మధ్యభాగామో ఒక ప్రాంతంలో లభిస్తే, మరికొంత మరొక ప్రాంతంలో లభిస్తుంది. గేయంలోని భావాలను బట్టి, తాళాలను చూసి అసంపూర్తిగా ఉన్న పాటను పూర్తి చేయాలి. ఇలాంటి పాటలు పూర్తి కావడం కోసం నెలలు, సంవత్సరాలైనా నిరీక్షించాలి. ఈ సందర్భంలో కొన్ని పాటలు భావాలతో నిండుగా ఉన్నా, దీర్ఘమై వినేవారికి విసుగు పుట్టిస్తాయి. కాబట్టి భావం చెడకుండా పాటను కుదించి పాడితే శ్రోతలను ఎంతో ఆకట్టుకుంటుంది.
శ్రోతలు ఇష్టపడే హాస్యం, శృంగారం, వీరం, కరుణ ప్రధానమైన గేయాలను, కథా గేయాలను ఎన్నుకోవడం వల్ల ప్రదర్శనలు మరింత రక్తికడ్తాయి.
మునెయ్య పాటలు వినండి:
మునెయ్య పాడిన తుమ్మేదలున్నాయిరా, పచ్చ శత్రీ సేతబట్టీ … అనే జానపద గీతాలను వినడానికి టపా పై భాగంలో లేదా కింది భాగంలో ఎర్ర రంగులో ఉన్న play బటన్ నొక్కండి.