“ కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” – జే. విల్కిన్సన్
మైదుకూరు సమీపంలోని ముక్కొండ కథ విల్కిన్సన్ వ్యాఖ్యకు తార్కాణంగా నిలుస్తుంది.
కృతయుగంలో నెలకు మూడుపదున్ల వానపడుతున్న కాలంలో ప్రస్తుతం ముక్కొండ ఉన్న ప్రాంతంలో కాపులైన ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటూ బాగా పంటలు పండించే వారు.
ఒక సారి జొన్న పంట అద్భుతంగా విరగ పండింది. కంకులు తిప్పి ఎత్తైన రాశులు పోశారు. జొన్నలను తూర్పెత్తితే కంకుల గగ్గి రాశులకు పడమర దిశలో తిప్పలాగా ఏర్పడింది. సమీపంలోని ఆశ్రమంలో ఉండే ఒక ముని ఒక రోజు అన్నదమ్ముల వద్దకు వచ్చి భిక్ష అడిగాడు. అన్నదమ్ములు భిక్ష నాస్తి అని పోయిరమ్మని చెప్పారట. దీనితో ఆ ముని కోపోద్రిక్తుడై జొన్నలను మట్టి, రాళ్ళతో కూడిన రాశులుగా మారిపొమ్మని శాపం పెట్టినాడట. దీంతో ఆ రాశులు కొండలుగా మిగిలిపోయాయి. వాటినే అన్నదమ్ముల రాశులు అంటారు. కంకుల గగ్గి రాశిని ఇప్పటికీ గగ్గితిప్ప అని పిలుస్తున్నారు. ఈ విషయం మెకంజీ కైఫీయత్తుల్లోని “పేరనిపాడు” కైఫియత్తులో ఉంది.
అయితే జనంలో మరోకథ కూడా ప్రచారంలో ఉంది.
అన్నదమ్ములైన ఇద్దరు రైతులు ఒకరి మీద మరొకరికి అనురాగంతో ఒకరికి తెలియకుండా మరొకరు ..తమ్ముడు తాను పండించిన ధాన్యాన్నిఅన్నరాశిలో కలిపాడట , అన్న..కూడా తాను పండించిన ధాన్యాన్ని తమ్ముని రాశిలో కలిపేసినాడట..అన్నదమ్ముల అనుబంధానికి గుర్తుగా ఈ కొండలు మిగిలిపోయి అన్నదమ్ముల రాశులుగా పేరు గాంచాయి.
ఇందులో మొదటి కథనం రెండువందల ఏళ్లనాటి మెకంజీ పేరనిపాడు కైఫీయత్ లో నమోయింది. రెండవ కథ ముక్కొండ పరిసర పల్లెల్లో చెప్పుకుంటారు. పేరనిపాడు ప్రస్తుత ఎల్లంపల్లె గ్రామానికి ఉత్తర దిశలో, తిరుమలనాథ ఆలయానికి పడమర దిశలో ఉండేది. విజయనగర సామంత రాజులైన సంబెట రాజులు పేరనిపాడు కోటను నిర్మించి ఈప్రాంతాన్ని పాలించినట్లు శాసనాధారాలు, గుడులూ , శిల్పాలు ఇప్పటికీ ఉన్నాయి.
తిరుమల నాథ ఆలయాన్ని కూడా సంబెట వంశీకులే నిర్మించారు. శ్రీ కృష్ణ దేవరాయలు తిరుమలనాథ ఆలయ నిర్వహణకోసం గడ్డంవారిపల్లెను దానంగా ఇస్తూ చక్రశాసనం (గడ్డంవారిపల్లె వద్ద) వేయించాడు.