గురువారం , 21 నవంబర్ 2024
పెద్దముడియం

పెద్దముడియం చరిత్ర

పెద్దముడియం కడప జిల్లాలోని ఒక మండల కేంద్రం.

చాళుక్య సామ్రాజ్య స్థాపకుడు విష్ణువర్ధనుడు పుట్టిన ఊరు మన కడప జిల్లాలో ఉందని తెలుసా ? ఒక సారి పెద్దముడియం గ్రామం చరిత్ర చూడండి.

పూర్వం త్రిలోచన మహారాజు ( ముక్కంటి కడువెట్టి ) గంగానదిలో స్నానం చేయడానికి కాశీ నగరానికి వెళ్ళినపుడు, చాలా మంది బ్రాహ్మణులు రాజు సహాయార్థం వేచి ఉంటారు. రాజు స్నానాదికాలు పూర్తి చేసుకున్న తర్వాత వారికి దానాలు చేస్తు ఉన్నపుడు, 18 గోత్రాలకి సంబధించిన 108 మంది బ్రాహ్మణులు కొంత మంది, రాజుని చుట్టుముట్టి, వారికి ఒక అగ్రహారం దానమివ్వండని అడుగుతారు. రాజు వాళ్ళకి ఉత్తరాయణ సంక్రాంతికి ఒక అగ్రహారం దానం ఇస్తాను అని చెప్పి, మీకు మా రాజ్యంలో ఏ ప్రదేశంలో అగ్రహారం కావాలని అడిగినపుడు, బ్రాహ్మణులు, శ్రీశైల క్షేత్ర సమీపంలో కావాలంటారు.

అప్పుడు రాజు తిరుగు ప్రయాణంలో బ్రాహ్మణులని తనతో పాటు రాజ్యానికి తీసుకువచ్చి, శ్రీశైల క్షేత్రానికి సమీపంలో, నల్లమల అహోబిల క్షేత్రానికి పడమర దిశలో 20 మైళ్ళ చుట్టుకొలత ఉన్న ప్రదేశాన్ని అడవులు నరికించి, చదును చేయించి, ఒక గ్రామాన్ని స్థాపించాడు. గ్రామంలో ఇళ్ళు, గుడులు నిర్మించి, తోటలు వేయించి, ఆ గ్రామాన్ని, బ్రాహ్మణులకి అగ్రహారంగా ఇచ్చారు.

చదవండి :  జిల్లాలో 48 కరువు మండలాలు

రెండే వీధులున్న ఆ గ్రామంలో ఒక వీధిని మెరక వీధి అని, ఇంకో వీధిని పల్లపు వీధి అని పిలిచేవారు. మెరక వీధి పల్లపు వీధి కంటే ఎత్తులో ఉండేది. మెరక వీధిలో బ్రాహ్మణులు, పల్లపు వీధిలో ఇతర వృత్తుల వాళ్ళు ఉండేవారు.

రాజు మెరక వీధికి, త్రిలోచనపురం అని పేరు పెట్టి, తన పేరు వచ్చే విధంగా ముక్కంటీశ్వరాలయాన్ని (ఇప్పటికీ ఈ గుడి ఉంది), పల్లపు వీధికి గ్రామదేవత మ్రిదాని పేరుతో గుడి కట్టించి, మ్రిదనియము అని పేరు పెట్టారు.

కాలక్రమంలో కరువు, దుమ్ము తుఫానుల వల్ల త్రిలోచనపురం శిథిలావస్థకి చేరుకున్నపుడు, మెరక వీధిలోని అందరు పల్లపు వీధిలో స్థిరపడ్డారు. మ్రిదనియము కాలక్రంలో ముడివేము గా మారింది. పెద్ద వేపచెట్టుకి ముడివేము అని పేరు. కాలక్రమంలో ముడివేము, పెద్దముడియం పేరుతో పిలవబడింది.

పెద్దముడియం గ్రామానికి సంబందించి, ఇంకో కథ :

చదవండి :  జయమాయ నీకు - అన్నమయ్య సంకీర్తన

అయోధ్య రాజైన విజయాదిత్యుడు యుద్ధాలు చేస్తూ, రాజ్యాలు గెలుచుకుంటూ దక్షిణాదికి వచ్చినపుడు, త్రిలోచన పల్లవ రాజుతో యుద్ధంలో ఓడిపోయి చనిపోతాడు. అప్పుడు విజయాదిత్యుని మహారాణి మహాదేవి 6 నెలల గర్భవతి. ముడివేము అగ్రహారంలోని విష్ణుభట్ట సోమయాజి అనే బ్రాహ్మణుడు ఈమెని చేరదీసి, తన కూతురులాగా చూసుకుంటు ఉంటాడు. కొన్నాళ్ళకి మహారాణికి మగబిడ్డ పుడతాడు. తనని కాపాడిన విష్ణుభట్టుని పేరు వచ్చేట్లు, తన కొడుకుకి విష్ణువర్ధనుడు అని పేరు పెడుతుంది. ఈ కొడుకు అన్ని యుద్ధ విద్యలు నేర్చుకుని, తల్లి ద్వారా తండ్రి మరణ విషయం తెలుసుకుని, పెద్దయ్యాక త్రిలోచనపల్లవ మహారాజుని ఓడించి, రాజ్యాన్ని సంపాందించి, చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు.

ఈ విధంగా చాళుక్య సామ్రాజ్య స్థాపకుడి పుట్టిన ప్రదేశంగా కూడా పెద్దముడియం ప్రసిద్ధి చెందింది.

శాసనాలలో పెద్దముడియం అగ్రహారాలలో ఒక రత్నం లాంటిది అని, 4 యుగాలుగా ఉందని తెలుస్తోంది.

పెద్దముడియంలో మూగుళ్ళ గుడి సముదాయం ఉంది. ఇందులో ముక్కంటీశ్వర, నరసింహ, వీరభద్రాలయలు ఒకే వేదిక మీద ఉంటాయి. ఇంకో నరసింహాలయం, కోదండ రామాలయం, శివాలయం ఈ ఊర్లో ఉన్నాయి. అన్ని అలయాలు పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్నాయి. పాలెగాళ్ళ కాలంనాటి బురుజులు కూడా రెండు ఉన్నాయి.

చదవండి :  ఉరుటూరు గ్రామ చరిత్ర

మూగుళ్ళ గుడి వెనుక ప్రదేశం, పూర్వం త్రిలోచనపురం అని అంటున్నారు. ఇక్కడ పురావస్తు త్రవ్వకాలలో శాతవాహన కాలంనాటి సీసపు నాణేలు, మ్రుణ్మయ పాత్రలు దొరికాయి. ఈ పాటిగడ్డలో బౌద్ద స్థూపం ఆనవాళ్ళు కూడా ఉన్నాయి అంటారు. ఈ ప్రదేశం చుట్టు పురావస్తు శాఖ వాళ్ళు కంచె వేసి కాపాడుతున్నారు.

జయ మాయ
పెద్దముడియం నృసింహాలయం (ఫోటో : గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి)

అన్నమాచార్యులు అహోబిల క్షేత్రంలో శఠగోపయతీంద్రుల తన చదువుని పూర్తి చేసుకుని, కడప జిల్లాలోని వివిధ వైష్ణవాలయాలని సందర్శిస్తూ, పెద్దముడియంలోని నరసింహస్వామిని దర్శించుకుని కీర్తనలు రచించారు.

చారిత్రకంగా ఇంత ప్రసిద్ధి చెందిన ఈ ఊరు, సరైన ప్రచారానికి నోచుకోకుండా ఉంది. పురావస్తు శాఖ వాళ్ళు వేసిన బోర్డులు తుప్పు పట్టి పోయాయి.
————-

Reference:

1. Trilochana Pallava and Karikala: N V Ramanayya ( 1929 ) https://archive.org/details/in.ernet.dli.2015.382690

2. Proceedings of Indian History Congress, Edward G Browne (1939), https://archive.org/details/in.ernet.dli.2015.282649/page/n487/mode/2up?q=pedamudiyam

– పురుషోత్తం సి

ఇదీ చదవండి!

kadapa district map

జిల్లాలో 48 కరువు మండలాలు

కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: