
జమ్మలమడుగులో 30 నుండి గూడు మస్తాన్ వలీ ఉరుసు
జమ్మలమడుగు: జమ్మలమడుగు పట్టణానికి పడమటి దిశగా పవిత్ర పినాకినీ నదీ తీరంలో క్రీ.శ. 1651 సంవత్సరంలో శ్రీ హజరత్ గూడు మస్తాన్ వలీ వారు సమాధియై ఉన్నారు. ఆయన పేరుమీద ప్రతి సంవత్సరం భారీ ఎత్తున ఉరుసు ఉత్సవాలు హిందూ ముస్లిం సోదరులు సమైక్యతకు ప్రతీకగా, అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉరుసు వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది.
అరేబియా దేశానికి చెందిన నలుగురు ముస్లిం సోదరులు ఇస్లాం మత సందేశాలను ప్రచారం చేయడంలో భాగంగా 17 వ శతాబ్ధపు ప్రారంభంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. వారిలో ఒకరైన మస్తాన్ వలీ అనే ప్రచారకులు వైఎస్‌ఆర్ జిల్లాలోని జమ్మలమడుగు పట్టణానికి వచ్చారు. పగలంతా పట్టణంలోని వీధుల్లో తిరుగుతూ రాత్రి వేళల్లో సమీపంలోని పెన్నానది ఒడ్డున ఆయన విశ్రమించేవారట. ఇదిలా ఉండగా కొందరు పిల్లలు చుట్టూ చేరి బెల్లం పెట్టండి స్వామి అని అడగ్గా ఆయన ఇసుకను కుప్పగా పోసి తాకినా, మట్టి పెడ్డలను పసిబిడ్డలకు పంచి పెట్టినా అది గూడు (బెల్లం)గా మారడంతో నాటి నుండి ఆయన పేరు కాస్తా గూడు మస్తాన్ వలీగా మారిందని స్థల పురాణం చెబుతోంది. కాగా 1900 సంవత్సరంలో పెన్నానదికి ఉధృతమైన వరదలు వచ్చి జమ్మలమడుగు పట్టణం చాలా భాగం జలమయం అయింది. అయినా మస్తాన్ వలీ సమాధి మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదని స్థానికులు చెబుతున్నారు. మరో విశేషం ఏమంటే ఆ సమయంలో కొన్ని గ్రామాలకు గ్రామాలు ముంపునకు గురికాగా మరికొన్ని చోట్ల అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి.
గూడు మస్తాన్ వలీ వారి సమాధి చుట్టూ ఉన్న ఊదుదాన్ దీపం, చెట్టు అణుమాత్రం చెక్కు చెదరకుండా ఉండడంతో అనేక మంది హిందూ మహమ్మదీయ సోదరులు భక్తి భావంతో ఆ మహనీయునికి భక్తులుగా మారి పూజా పునస్కారాలు సలుపుతూ ప్రతి సంవత్సరం భారీ ఎత్తున ఉరుసు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉరుసు సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ స్వామి వారి దర్గా వద్ద ప్రార్థనలు జరిపి ఆయన కృపకు పాత్రులవుతున్నారు. అలాగే ప్రతి గురు, శుక్ర వారాల్లో ఆరోగ్యం సరిగా లేని వారు, మానసిక బాధలు ఉన్నవారు స్వస్థత చేకూరుతుందన్న నమ్మకంతో ఈ గూడు మస్తాన్ వలీ దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతున్న అనుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పటిలాగే శ్రీ స్వామి వారి ఉరుసు ఉత్సవాలు ఈ నెల 30 వ తేదీ నుండి నిర్వహించేందుకు ఉరుసు ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ నెల 30 న బుధవారం నిషాన్‌తో ఉరుసు ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. అలాగే మే నెల 1 వ తేదీ గురువారం గంధం, 2 వ తేదీ శుక్రవారం ఉరుసు, 3 వ తేదీ శనివారం జియారత్‌తో ఈ ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి.
ఇందులో భాగంగా మే 1 వ తేదీ గురువారం రాత్రి 09.00 గంటలకు తెనాలికి చెందిన షబ్బర్‌ఖాన్ ఆధ్వర్యంలో సుహానా ఆర్కెస్ట్రా వారిచే మహమ్మద్‌రఫి పాటలు ఉంటాయన్నారు.
మే 2 వ తేదీ శుక్రవారం రాత్రి 10.00 గంటలకు గ్వాలియర్‌కు చెందిన జి టివి సింగర్స్ షారూక్ హుస్సేన్, అర్మాన్ హుస్సేన్, షెహరాన్‌పూర్‌కు చెందిన జి టివి సింగర్స్ ఇమ్రాన్ రాజ, నాగ్‌పూర్‌కు చెందిన పైజాన్‌తాజ్ వారిచే గొప్ప ఖవ్వాలీ పోటీ ఒక ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు.
3 వ తేదీ శనివారం రాత్రి 09.00 గంటలకు జియారత్ సందర్భంగా నెల్లూరుకు చెందిన స్వరాంజలి ఆర్కెస్ట్రా వారిచే పాట కచ్చేరి ఏర్పాటు చేశామని ఎప్పటిలాగే హిందూ మహమ్మదీయ సోదరులు ఉరుసు ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని దర్గా కమిటీ నిర్వాహకులు పత్రికాముఖంగా కోరారు.