గురువారం , 21 నవంబర్ 2024
బండారు రత్నసభాపతి
బండారు రత్నసభాపతి

‘గడ్డం పొడవునుబట్టా, తెల్లబడిన వెంట్రుకను బట్టా’ – సభాపతీయం 1

రత్న సభాపతిని ఆంధ్రప్రదేశ్ సహకార భూమి తనఖా కేంద్ర బాంకుకు అధ్యక్షస్థానంలో చూచిన సన్నిహిత మిత్రుడొక ఉత్తరం వ్రాస్తూ యిలా వ్యాఖ్యానించాడట – “చైనాలో పూర్వం ఒక బంగారు పిట్ట ఉండేది. దాని కంఠస్వరం వర్ణనాతీతంగా ఉండేది. అందువలన చైనావారు ఆ పిట్టను ఒక పంజరంలో అట్టిపెట్టారు” ఈ అభిప్రాయం ఎలావున్నా, కొంచెం పూర్వాపరాలు తెలుసుకోనిదే ఎవర్ని గురించీ అంచనా వేయలేం. ఆ దృష్టితో ఒక్కసారి రత్నసభాపతి గత జీవితచరిత్రను ప్రస్తావించక తప్పదు.

బాల్యం

బండారు రత్నసభాపతి కడప జిల్లాకు చెందిన రాజంపేట నియోజకవర్గంలోని ఎల్లంపేట గ్రామస్థులు. ప్రకృతి సౌందర్యం బాగా ఆనందించగలవారు. ఎల్లంపేటలో హాయిగా కాలక్షేపం చేయగలరు. ఒక ఏడాది క్రితం వరకు కరెంటు కూడా లేని ఎల్లం పేటకు నేటికీ మంచి రోడ్డు లేదు. ఒంటిమిట్ట నుండి బస్సులు ఊళ్లోకి వెడతాయి. మట్టిరోడ్డు ఆధారంగానే. చెయ్యేరు – గుంజన ఏర్లు కలిసిన ఒక నది – చిన్నదే. ఎల్లంపేట పక్కగా ప్రవహిస్తుంది. కనుక వూరికి నీటి సౌకర్యం వున్నది. మెట్ట మాగాణి పంటలు, మామిడి, బత్తాయితోటలు ఆ వూరి సౌభాగ్యాలు. ఊరిలో బలిజ, కమ్మ కులాలు ప్రధానమైనవి.

రత్నసభాపతి బలిజ కులానికి చెందిన వారు. సెట్టి బలిజలు, గాజుల బలిజలు, రాజ మహేంద్రవరం బలిజలని మూడు తెగలున్నవి. అందులో సభాపతి మొదటి తెగకు చెందినవారు. ఆయన చిన్నతనంలో వాళ్ళయింట బంగారు నగలు ఏడాదికోమారు దండెంపై ఆరబెట్టేవారట. మణుగు బంగారం వాళ్ళ తండ్రిగారి వాటాగా ఉండేదట. అట్లాంటి సంపన్న కుటుంబంలో జన్మించిన రత్న సభాపతి మరొక ఆరుగురు తోబుట్టువులతో ఆ సంపదను హారతి కర్పూరంచేశారు. నేడుతండ్రీలేడు.- ఆ బంగారమూ లేదు. పొలాలు, తోటలు మాత్రం మిగిలాయి. వ్యవసాయంలో రత్న సభాపతికి శ్రద్ధ, ఆసక్తి మిక్కుటముగా వున్నవి.

చదవండి :  త్యాగానికి మరోపేరు ...

సభాపతి ఇంటర్మీడియేట్ అనంతపురంలోనూ, బి.ఎ. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోనూ చదివారు. బి.ఎ. చదువుతుండగా రాజకీయాలలో ఆసక్తి కలిగి, ప్రవేశించారు. పి.వి.జి. రాజు ఆయనకు చదువుల్లో సహాధ్యాయి. మధ్యలో మద్రాసు వదలి కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళిపోయారు రాజుగారు. రత్న సభాపతి బి.ఎ.తో చదువుకు స్వస్తి చెప్పారు. అప్పటికి యింకా కంఠశోషగానే ఉన్నాయి సోషలిస్టు రాజకీయాలు. సోషలిస్టు రాజకీయాలు వారిని ఆకర్షించాయి. కళాశాలలోని ఒక ఆర్థిక శాస్త్రాచార్యులు (కల్లుకరన్) రత్నసభాపతికి సిద్ధాంతపరమైన రాజకీయాల్లో ఆసక్తిని కలిగించారు. అప్పటికీ యిప్పటికీ ఆయన్ను తలుస్తూ, పుస్తక పఠనాసక్తిని పోనివ్వకుండా పట్టుకొస్తున్నారు. నెహ్రూ, ఎం.ఎన్.రాయ్, జయప్రకాశ్ రచనలతో ప్రభావితుడైనాడు. 1948 జనవరి 1న కాంగ్రెసు నుండి సోషలిస్టు వేరుబడి కాపురం పెట్టినప్పుడు, అందులో చేరారు రత్నసభాపతి.

సోషలిస్టుగా …

ప్రధానంగా జిల్లాస్థాయి పార్టీలోనూ కొంతవరకు రాష్ట్రస్థాయి  పార్టీలోనూ ప్రముఖపాత్ర  వహిస్తూ, సోషలిస్టు కార్యకర్తగా అనుభవాల్ని సంతరించుకుంటూ వచ్చారు. తినటానికి, తిరగటానికి లోపంలేని ఆస్తిపాస్తులు వున్నవి. అయినా (అప్పుడు సోషలిస్టు సిద్ధాంతమే ప్రధానాశయం) 1954లో కర్నూలు జిల్లా కరివెది గ్రామం నుండి ఈనాందారీ సత్యాగ్రహం తలపెట్టి సోషలిస్టు జైలుపాలౌతున్నప్పుడు, రత్నసభాపతి ముమ్మరంగా ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. కార్యకర్తల్ని సంఘటితపరచి, ఆ వుద్యమానికి జీవనాడి అయ్యారు.

చదవండి :  పద్మనాభం ఇంటర్వ్యూ

సోషలిస్టు పార్టీ అఖిల భారత సమావేశాలన్నిటిలో పాల్గొంటూ, పరిచయాలను, అనుభవాల్ని పెంచుకున్నారుకాని తృప్తిలేదు. పార్టీలో డాక్టర్ లోహియాతో సన్నిహితంగా వుండేవారు. ‘Mankind’ English మాసపత్రికకు ఎడిటర్ గా కొన్నేళ్ళపాటు ఉన్నారు. అనేక వ్యాసాలు ఆయన పేరుతో ప్రచురితమయ్యాయి.

సరిగ్గా ఆ సమయంలోనే భూదానోద్యమాన్ని  పురస్కరించుకొని, వినోబాభావే కడప జిల్లా పర్యటన చేస్తున్నారు. రత్నసభాపతి వారిని ఇంటర్వ్యూ అడిగారు. ఒక్క ప్రశ్నకే అవకాశం ఇస్తామని వినోబాభావే అన్నారట అప్పుడే ఉపన్యాసం ముగించి. ఉపన్యాసంలో ‘మంచి’ ప్రభుత్వం కావాలని నొక్కి వక్కాణించారట భావేగారు రత్నసభాపతి తన ఒక్క ప్రశ్నను అడుగుతూ, “మంచితనాన్ని ఎట్లా నిర్వచిస్తారు  గడ్డం పొడవునుబట్టా, తెల్లబడిన వెంట్రుకను బట్టా’’ అనిఅడిగారట. వినోబాకు ఆగ్రం వచ్చి ఉండాలి. ఆ ఇంటర్వ్వూ కాస్తా రద్దు. యీ వుదంతం ఆచార్య జయప్రకాశ్ కు ఉత్తరం వ్రాశారట బావే. జయప్రకాశ్  ఈ విషయాన్ని లోహియాకు వ్రాస్తూ, సభాపతితో మాట్లాడమన్నారట. తరువాత హైదరాబాద్ వచ్చినప్పుడు లోహియా పరామర్శించి, జయప్రకాశ్ తో చర్చించమన్నారట. కానీ ఆ చర్చల ఫలితంగా సభాపతి ఏమీ మారలేదు.

జయప్రకాశ్ గోరుముద్దలు కలిపి నోట్లో పెడతాడు. ఆలోచనకు తావులేదు. కాని డా. లోహియా సమస్యను లేవనెత్తి, కొంత దూరం తీసుకువెళ్ళి, ఆలోచనకు వదిలేస్తాడు. అదీ వారిద్దరిలో ప్రధానమైన తేడా అంటారు రత్నసభాపతి., ప్రైవేట్.గా, జయప్రకాశ్.ను ‘రాజకీయ నపుంసకుడని’ లోహియా అనేవాడట. గత నలుబది సంవత్సరాల రాజకీయరంగములో జయప్రకాశ్ వహించిన పాత్రను పరిశీలించిన వారికి డా.లోహియా అన్నమాట సత్యానికి దూరం కాదంటాడు సభాపతి. జయప్రకాశ్.తోపాటు పర్యటించి, ఆయన కార్యక్రమాలు రాయలసీమలో ఏర్పాటు చేసి, సోషలిస్టు పార్టీ ప్రచారం చేసిన అనంతరం రత్నసభాపతికి కలిగిన అభిప్రాయలివి.

చదవండి :  మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి

సోషలిస్టు పార్టీ చీలిపోయినప్పుడు  రత్నసభాపతి సహజంగానే లోహియాకు చేరువయ్యారు. లోహియాతో కలిసి  కూర్చుని సుదీర్ఘ చర్చలు చేసేవారు. ఆ మధురస్మృతుల్ని రత్నసభాపతి నేటికీ స్ఫురణకు తెచ్చుకుంటూనే ఉంటారు. మొత్తం మీద లోహియా ప్రభావం ఆయనపై  ఎక్కువగానే ఉన్నది. లోహియాకు కూడా రత్నసభాపతి ఎంతో నచ్చాడనటానికి  ఒక్క మాటేచాలు. ‘రత్నసభాపతి కాంగ్రెసులో చేరాడని విన్న తరువాత నాకు మానవులపై నమ్మకం సడలింది’ అని లోహియా మాన్ కైండ్.లో వ్రాశాడు.

1955లో ఆంధ్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పి.ఎస్.పి. అభ్యర్థిగా బద్వేల్ నుండి మొత్తం పోలైన ఓట్లలో 64.36% ఆధిక్యతతో రత్నసభాపతి నెగ్గారు. శాసనసభలో ప్రవేశించారు. ఆంధ్రరాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఆ తరువాత కొద్దికాలమే ఉన్నది. 1956 నుండి రంగం హైదరాబాద్.కు మారింది.

రచయిత గురించి

హేతువాది అయిన నరిశెట్టి ఇన్నయ్య 1937, అక్టోబరు 31న గుంటూరు జిల్లా చేబ్రోలు శివారు పాతరెడ్డిపాలెంలో జన్మించారు. తెలుగు లో రాజకీయ, సాంఘిక, తాత్విక రచనలు మరియు కొన్ని అనువాదాలు చేశారు. మానవేంద్ర నాథ్ రాయ్‌ (ఎం.ఎన్. రాయ్‌గా ప్రసిద్ధికెక్కారు. ప్రముఖ హ్యూమనిస్ట్) రచనలు అనువదించారు. తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ వీటిని ప్రచురించింది.తెలుగులో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించారు.

ఇదీ చదవండి!

తెలుగు సినిమా వైతాళికుడు పద్మవిభూషణ్ బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి

తెలుగు సినిమా దర్శకుల్లో గొప్పవాళ్ళు ఎవరనే ప్రశ్న వస్తే మనం ముందుగా వినే పేరు “బి.ఎన్‌. రెడ్డి”. నిజానికి 30 …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: