
అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు – సొదుం గోవిందరెడ్డి
సాహితీకారుడు సొదుంగోవిందరెడ్డితో తవ్వా ఓబుల్ రెడ్డి జరిపిన ఇంటర్వ్యూ
కడప జిల్లా ఉరుటూరు . చోళుల కాలంనాటి శాసనాలు, ఆలయాలు కలిగిన ఊరే కాదు. సాహితీ దిగ్గజాలైన సొదుం సోదరులు జన్మించిన గ్రామం. వారి పేర్లు సాహితీలోకానికి చిరపరిచితం . వారే సొదుం గోవింద రెడ్డి , సొదుం జయరాం, సొదుం రామ మోహన్ లు. అభ్యుదయ సాహితీ చరిత్రలో తమదైన చెరగని ముద్ర వేశారు ఈసోదరత్రయం . వీరిలో జయరాం, రామమోహన్ బయటి ప్రపంచంలో తిరిగినవారు. గోవిందరెడ్డి మాత్రం సాహిత్యంతో , సాహిత్యకారులతో విశేష పరిచయాలున్నప్పటికీ తన జీవిత చరమాంకం వరకూ గోవిందరెడ్డి ఉరుటూరుకే పరిమితం అయ్యారు. సొదుం సోదరులు ముగ్గురూ ఇప్పుడు కీర్తిశేషులు .
1928 లో జన్మించిన గోవింద రెడ్డి పులివెందులలో ఎస్.ఎస్.ఎల్.సి (1944) వరకు చదువుకున్నారు.. టైపు, షార్టు హ్యాండ్ నేర్చుకునేందుకు కొన్నాళ్ల పాటు అప్పట్లో కడపలో ఉన్నాను. సోదరుడైన సొదుం జయరాం కూడా కడపలో చదువుకుంటూ ఉండేవారు. ఈ సమయంలోనే ప్రముఖ కథారచయిత వై.సి.వి.రెడ్డితో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. వై.సి.వి.రెడ్డి ఆ సమయంలో ప్రబంధకావ్యాలను అధ్యయనం చేస్తూ ఉండేవారు. దీంతో గోవిందరెడ్డి కూడా ప్రబంధ కావ్యాల పట్ల ఆకర్షితుడయ్యారు . ఈ సమయంలోనే ప్రఖ్యాత విమర్శకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి కడపలో ” సంవేదన ”, ” సవ్యసాచి ” పత్రికలు నడుపుతూ ఉండేవారు . దీంతో రా.రాతో ఏర్పడిన పరిచయంతో మొదటిసారిగా గోవిందరెడ్డి గేయరచన చేశారు. ఆ గేయాలను చదివి రా.రా. గోవిందరెడ్డిని మెచ్చుకున్నాడు. ఆంగ్లం భాషలో గోవిందరెడ్డికి మంచి పట్టు ఉంది. ఆయనలోని ఆంగ్ల పదజాల ప్రయోగ సామర్థ్యం సంభాషికులను ఇట్టే ఆకట్టుకుంటుంది. చలం, సంజీవదేవ్ , కొడవటిగంటి కుటుంబరావు, గజ్జెల మల్లారెడ్డి వంటి సాహితీ దిగ్గజాలతో వ్యక్తిగత పరిచయాలతోపాటు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన విశిష్ట అనుభవం గోవింద రెడ్డి గారిది. ఉరుటూరులోని ”చైతన్య భారతి ” లో అడుగు పెట్టగానే , చేతిలో ఏ వాసిలీ సుక్సిన్ రచించిన ” ఐ వాంట్ టు లివ్ ” లాంటి పుస్తకంతోనో కనిపిస్తారు.
2005 సెప్టెంబరు 16 న కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి గోవిందరెడ్డితో జరిపిన ఇంటర్వ్యూ ఇది. ఇప్పటిదాకా ఆముద్రితం గా ఉన్న ఈ ఇంటర్యూ విశేషాలు …
*మా కుటుంబంలో నేను, సొదుం జయరామిరెడ్డి, సొదుం రామమోహన్ రెడ్డి గారలు ముగ్గురు సాహితీవేత్తలు కావడం విశేషం. నేను సాహిత్యంపై దృష్టి సారించడంతో టైపు, షార్టుహ్యాండ్ నేర్చుకునే కార్యక్రమం అటకెక్కింది. సికింద్రాబాదులోని మిలిటరీ కార్యాలయంలో, ముంబైలోని రుస్తుంజీ. ఎన్. మెహతా అండ్ కో కంపెనీలో నేనూ ఉద్యోగాలు చేశాను. అయితే ఆ కొలువులు కొన్ని నెలలు మాత్రమే..!
* చదువులోనే కాదు వివాహం, ఉద్యోగం విషయాల్లో కూడా నేను ఒక రకంగా వైఫల్యాలనే ఎదుర్కొన్నాను. అయినా నా జీవితకాలంలో లేశ మాత్రమైనా నిస్పృహకుగానీ, అసంతృప్తికి గానీ గురికాలేదు. మంచి పుస్తకాలతో, మంచి మిత్రులతో ఇప్పటి దాకా జీవితం సాఫీగానే సాగింది.
* జయరాం సోదరుడుగా కాక ఒక మంచి మిత్రుడిగా ఉండేవాడు. జయరాం మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉద్యోగరీత్యా రామమోహన్ గారు హైదరాబాద్ లో స్థిరపడడంతో, సొదుం జయరాంతో నేను సహజీవనం, సహవాసం సాగించాను. సాహితీ లోకంలో మేము ముగ్గురు సొదుం సోదరులుగా గుర్తింపు పొందాము.
*చలం, సంజీవదేవ్ , కొడవటిగంటి కుటుంబరావు , అవసరాల రామకృష్ణారావు, కాళీపట్నం రామారావు లాంటి సాహితీ దిగ్గజాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు విస్తృతంగానే జరిపాను. నేను రాసిన గేయాన్ని , చలం స్వయంగా తన ” దేవదత్తం ” లో ప్రచురించారు.
*ప్రముఖ సాహితీ విమర్శకుడు కె. వి. రమణారెడ్డి సంపాదకత్వంలో వెలువడిన సంకలనంలో నా గేయం అచ్చయింది. గేయాలతో పాటు, నేను అనేక కవితలు, కొన్ని కథలు కూడా రాశాను. 1968లో విజయవాడ నుండి కాట్రగడ్డ రాజగోపాలరావు సంపాదకత్వంలో వెలువడిన ”ప్రతిభ ” సచిత్ర వార పత్రికలో ” ప్రేమ ” ,అనే కథ, ఉపాధ్యాయవాణి లో రచించిన ” అదృష్టకలం ” ( రష్యన్ రచయిత ” ఇయోనిఫ్ డిక్ ” కథకు అనువాదం ) అనే రెండు కథలు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నా రచనలను చాలా వాటిని భద్ర పరుచుకోలేక పోయాను. ఇప్పటికీ పుస్తక పఠనమే నాకు కాలక్షేపం.
*గోర్కీ , టాల్ స్టాయ్ , పుస్కిన్ , చెహోవ్ డి. హెచ్. లారెన్స్, బెర్నార్డ్‌షా , ఫ్రెంచ్ రచయితలైన బాల్జాక్ , గైదీ మపాసా , లను నేను బాగానే చదివానని అనుకుంటున్నాను. రాస్ పుతిన్ రచించిన ”ది లాస్ట్ టర్మ్” గ్రంధం గురించి గొప్పగా విన్నాను. ఆ పుస్తకాన్ని చదవాలనే కోరిక ఇంకా నెరవేరలేదు.తెలుగులో కొడవటిగంటి కుటుంబరావు, చలం , కాళీపట్నం రామారావు, రా. వి. శాస్త్రి ల రచనలంటే నాకెంతో ఇష్టం.
*కొడవటిగంటి కుటుంబరావు లోని నిబద్దత , చిత్తశుద్ధి నన్ను ముగ్ధున్ని చేసింది.దేన్ని ఆశించని ఆయనలోని ” మాడెస్టీ ” నాకు బాగా నచ్చింది. మధ్యతరగతి మనస్తత్వాలను,మంచి,చెడులను,లోతుకు దిగి విశ్లేషించిన రచయితల్లో కొడవటిగంటి కుటుంబరావు ఆద్యుడు.ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటూ సాహిత్య సృజనలో ముందుకు పోవాలంటే వర్ధమాన రచయితలు కుటుంబరావు సమగ్ర సాహిత్యాన్ని చదవాల్సిన అవసరం ఉంది. కుటుంబరావులోని లక్షణాలను సొదుం జయరాం పట్టుకోగలగడం విశేషం ! నాకు అనారోగ్యంగా ఉన్న సంగతిని ఏదొ యధాలాపంగా ఒకసారి కుటుంబరావుతో ఉత్తరం ద్వారా ప్రస్తావించాను. హోమియో వైద్యుడైన కుటుంబరావు ” పల్సటిల్లా ” అనే మందును పంపారు. ఆ సంఘటన నేను ఎప్పటికీ మరిచి పోలేనిది.
*కడపజిల్లాలో సాహితీ వేత్తలుగా వెలుగొందిన రాచమల్లు రామచంద్రారెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, వై.సి.వి. రెడ్డి, కేతు విశ్వనాథ రెడ్డి , ఎన్. శివరామిరెడ్డి , పి. రామకృష్ణారెడ్డి , మల్లెల నారాయణ, సత్యాగ్ని , కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి , దేవిరెడ్డి వెంకటరెడ్డి , డాక్టర్ ఎం.వి. రమణారెడ్డి, కొమ్మిశెట్టి మోహన్ తదితరులతో నాకు ప్రత్యక్షంగా సాహితీ సంబంధాలున్నాయి. కొత్తతరం కథా రచయితలైన సన్నపు రెడ్డి వెంకటరామిరెడ్డి , దాదాహయాత్ , పాలగిరి విశ్వప్రసాద్ , శశిశ్రీ, డి. రామచంద్రరాజు, నూకా రాంప్రసాద్ రెడ్డి, ఎన్నెస్ ఖలంధర్, సొదుం రమణ, శ్రీకాంత్ తదితరులతో కూడా నాకు పరిచయాలుండడం నాకు ఆనందం కలిగించే విషయం. వారంతా ఉరుటూరుకొచ్చి నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంటారు.
*రా.రా , వై.సి.వి.రెడ్డి లతో కలిసి హంపీ యాత్రకు వెళ్లినప్పుడు, తుంగభద్ర నదిలో మేమందరమూ ఈదుకుంటూ వెళ్తుంటే , దూరంగా ఉన్న సుడిగుండాలను రా. రా. పసికట్టారు. రా.రా . సాహిత్యంలోనే కాకుండా జీవితంలో కూడా సునిశిత పరిశీలకుడని చెప్పడానికి ఈ సంఘటనను ఒక తార్కాణం గా చెప్పవచ్చు. సామాజిక మార్పులు జరిగినప్పుడు మానసిక రోగుల సంఖ్య తగ్గుతుందని రా.రా. సూచించారు. రా. రా. కు అమెరికన్ రచయిత గ్రాహం గ్రీన్ అంటే ఎంతో ఇష్టం. చెహోవ్ ను చదవమని నాకు రా.రా. చెబుతూ ఉండేవారు. ఏది చదివినా, శ్రద్ధగా చదవాలనేది రా.రా. అభిప్రాయం.
*కేతు విశ్వనాథరెడ్డి మంచి కథా రచయిత. రాయలసీమ గ్రామీణ నేపథ్యాన్నీ, పల్లె తాత్వికతనూ పట్టుకున్నవాడు. రంగశాయిపురం నుండీ గుట్టలు దాటుకుంటూ వచ్చి మా ఉరుటూరు మీదుగా చదువుకోవడానికి వెళ్తూ ఉండేవాడు. విశ్వనాథరెడ్డి తో నాకూ, జయరాంకూ మంచి సాహితీ సంబంధాలున్నాయి.
*రష్యాలో స్టాలిన్ నియంతృత్వ ధోరణి, మరికొందరి వ్యక్తిగత ధోరణుల కారణంగా కమ్యూనిజం దెబ్బతినింది. కమ్యూనిజం మీద ఇప్పటికీ నాకు విశ్వాసం ఉంది. ఎప్పటికైనా మార్పు వస్తుంది. మార్పులేకపోతే మానవాళి మనుగడే ప్రశ్నార్థకమౌతుంది. మంచి సమాజం తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాను. రా.రా. కూడా స్టాలిన్ ను రష్యా పాలిట భూతంగా అభివర్ణించేవారు.
*నాలుగైదు దశాబ్దాల కిందట ఉన్నట్లు గా సాహిత్య సృష్టికర్తలూ, సాహిత్య ప్రియులూ ఇప్పుడు కనిపించడం లేదు. ఇది నన్ను ఆవేదనకు గురి చేసే అంశం. ప్రపంచీకరణ లాంటి పరిణామాలు, యువకుల దృష్టిని అమెరికా వైపునకు మళ్లిస్తున్నాయి. అమెరికా జీవనమే సుఖమయమైనదని అనుకోవద్దు. మాతృదేశం గురించి యువత ఆలోచించాల్పిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రొట్టెలు చేసుకోవడానికి జొన్నలు లేవని పూర్వకాలంలొ పల్లెల్లో ఎవరైనా అంటే , రెండు పళ్లో, మూడు పళ్లో, ఎత్తుకుపొమ్మని , ధారాళంగా సాటి మనిషిని ఆదుకునేవారు. కరువు కాలంలో, కష్టకాలంలో ఒకరికొకరుగా ఉండేవాళ్లు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఈరోజుల్లో నువ్వు నువ్వే , నేను నేనే అనే భావన పెరిగిపోయింది. ఇది దురదృష్టకర పరిణామం. ” మనం” అనే భావనను మనుషులు కలిగిఉండడం సమాజానికి ఎంతో అవసరం.