(నవంబరు 24 రారా వర్ధంతి సందర్భంగా…)
దిగంబర కవుల మూడవ సంపుటి మీద రారా సమీక్ష
వీళ్ళు ఆరుమంది__అరిషడ్వర్గంలాగా. అందరికీ మారుపేర్లు వున్నాయి. తాము దిగంబర కవులమనీ, తాము రాసేది దిక్‌లు అనీ వీళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళ మొదటి సంపుటి 1965 మేలోనూ, రెండవ సంపుటి 66 డిసెంబర్‌లోనూ వచ్చినాయి. 68 సెప్టెంబర్లో మూడవ సంపుటి వచ్చింది. 120 పేజీలు గల యీ సంపుటిలో దిక్‌లు చాలానే వున్నాయి. కవిత్వం మాత్రం యెక్కడా లేదు.
కవి ఒక అనుభూతిని మాటలద్వారా వ్యక్తం చేస్తాడు; మాటలద్వారా పాఠకులకు అందిస్తాడు. అప్పుడు ఆ మాటలను కవిత్వమంటాం. కవి సాధారణంగా తాను పొందిన అనుభూతినే తన కవిత్వంలో వ్యక్తం చేస్తాడు. కానీ అది కాదు మనకు ముఖ్యం. ఆ అనుభూతిని పాఠకులకు (లేక శ్రోతలకు) అందిస్తున్నాడా అనేదే నిర్ణాయకమైన ప్రశ్న. తాను యెంత గాఢమైన అనుభూతిని పొందినా అందులో కొంతైనా మనకు అందకపోతే అతని మాటలు కవిత్వం కాలేవు. అతన్ని కవి అనవలసిన అవసరం లేదు.
తాము తీవ్రమైన ఆవేశం పొందినామని వీళ్ళు అంటున్నారు. నిజమే కావచ్చు. కుళ్ళిపోయిన యీ సమాజం మీదా, యీ కుళ్ళుకు కారణమైన రాజకీయ నాయకులమీదా, స్వాములవార్ల మీదా, సినిమాలమీదా, సినిమా తారలమీదా (ప్రొడ్యూసర్లమీద కాదు). పెట్టుబడిదార్ల మీదా యింకా యెవరెవరి మీదనో వీళ్ళ కోపం కనపడుతూనే వుంది. వీళ్ళకోపం నిప్పులు కక్కుతున్నట్లు కూడా మనకు అర్థమౌ తుంది. కానీ, వీళ్ళకు నిజంగా కోపం వుందని మనకు తెలిసినంత మాత్రాన అది కవిత్వంకాదు. ఆ కోపంలో కొంతైనా మనకూ కలిగితే – యీ కుళ్ళు సమాజం మీదా, యీ కుళ్ళుకు కారకులై న వాళ్ళ మీదా – అప్పుడు, అప్పుడు మాత్రమే, అది కవిత్వమౌతుంది. ఆది లేదుగనుకనే వీళ్లు రాసింది కవిత్వం కాలేక పోతున్నది.
పై గా, మనకు రోత కలుగుతుంది. వీళ్ళ రచనలు చదివితే అసహ్యం వేస్తుంది. ఆ తిట్లూ, ఆ బూతులూ, ఆ ఆటవిక ఆవేశమూ, ఆ ఒల్లెరగని కుసంస్కారమూ, ఆ నోటితీటా, ఆ మాటల కంపూ మనకు జుగుప్స కలిగిస్తాయి.
మరీ జుగుప్స కలిగేది వీళ్లు అక్కడక్కడా కొన్ని బూతులు రాసినందుకు కాదు; కవిత్వపు వాసన యెక్కడా లేకుండా కవులమని చెప్పుకుంటూ మోసం చేస్తున్నందుకు; సమాజాన్ని ఉధ్ధరిస్తామని విర్రవీగుతున్నందుకు, యీ దురహంకా రానికి తోడు బూతుల దుర్గంధం.
నా అనుమూనమేమంటే, తమకు కవిత్వం రాయడం రాదని వీళ్ళకు తెలుసు. కవిత్వంతో యెవరి దృష్టినీ ఆకర్షించలేమని వీళ్ళకు తెలుసు. కనుకనే పదిమంది దృష్టిని ఆకర్షించడానికి వెకిలి వేషాలూ, వికృత చేష్టలూ మొదలు పెట్టినారు. లేకపోతే చెరబండరాజు, జ్వాలాముఖి వగైరా వింత వింత పేర్లు పెట్టుకోవలసిన అవసరమేముంది? తమ రాతలకు దిక్‌లు అని కొత్తవింతపేరు పెట్టుకోవలసిన అవవసరమేముంది? తమ సంపుటాలను రిక్షావాలాలతోనూ, హోటల్ క్షీనర్లతోనూ, భిక్షగత్తెలతోనూ ఆవిష్కరించవలసిన అవసరమేముంది? ఆ ఆవిష్కరణలు అర్ధరాత్రి పండ్రెండు గంటల వేళనే చేయించవలసిన అవసరమేముంది? వీళ్ళ మొదటి సంచికను ఒక రిక్షావాలా అవిష్కరించినప్పుడు “మంత్రిని పిలవడం స్పాబరీ, లేక స్లేవరీ. రిక్షావాణ్ణి పిలపడం ఒక పోజు, లేకపోతే ఓ రకమైన ‘అత్మవంచన” అని తిలక్ అన్నాడట, ప్‌ల్ల కే ఉత్తరం రాస్తూ. వీళ్లది ఆత్మవంచనగా కనపడదు. కనుక పోజే కావాలి.
రాజకీయ వర్గాలలో వీళ్ళ పోజు కొన్ని భ్రమలు కల్పించినట్లుంది. సమాజపు కుళ్లకు కారకులై నవాళ్లను వీళ్లు బూతులు తిడుతున్నారు గనుక, వీళ్ల రచనలు సమాజ క్షేమానికి వినియోగ పడతాయని వాళ్లు ఆశపడుతున్నట్లుంది. రాజకీయ విలువ యెంత వున్నా ఒక రచన కవిత్వం కాజాలదనే విషయం అటుంచి, రాజకీయ చిత్త శుద్ధి కూడా వీళ్ళ రచనల్లో కనిపించదు. వీళ్ళ ఉద్యమం సమాజపు మురికి గుంటను తొలగించడం కాదు; ఆ మురికి గుంటను కెలికి ఆ కంపును దశదిశలకూ వ్యాపింప జేయడమే.
కాదంటే మరొక విధంగా చెప్పవచ్చు. వీళ్లు మురికి గుంటను పూడ్చి శుభ్రంచేసే ఆరోగ్యశాఖవాళ్ళు కాదు; మురికి గుంటలోనే ఉద్భవించి, అందులోనే తిని, తాగి, తందనాలాడి, ఆనంద పారవశ్యం చెందే క్రిమి సంతానం.
అనగా సమాజం కుళ్ళుకు వీళ్ళు ఒక చిహ్నం. సమాజం కుళ్ళులో వీళ్ళు ఒక భాగం, సమాజం కుళ్ళిపోయిందనడానికి వీళ్ళు ఒక నిదర్శనం. సమాజం కుళ్ళిపోవడానికి వీళ్ళూ ఒక కారణం.
సమాజం కుళ్ళిపోయిన మాట నిజమే. సమాజం పతనమైన మాట నిజమే. విప్లవాగ్ని జ్వాలలతో తప్ప సంస్కరించడానికి సాధ్యం కానంతగా పతనమైన మాట నిజము. కానీ, యెంత పతనమైనా, యీ దిగంబరుల పైత్యాన్ని కవిత్వమనుకునేటంతగా పతనమైందా?
(సంవేదన, జనవరి 1969)