గురువారం , 21 నవంబర్ 2024

కడప జిల్లాలో రామాయణ రచనా పరిమళం

కడప: తిరుమల తర్వాత అంతటి గొప్ప క్షేత్రంగా దేవుని కడపను చెప్పినట్టే.. భద్రాచలం తర్వాత ఒంటిమిట్టకు అంత ప్రశస్తి ఉందంటారు. వాస్తవానికి భద్రాద్రి కన్నా ఒంటిమిట్ట ఎంతో పురాతనమైనది. దీన్ని రెండవ భద్రాద్రి అనడం కన్నా భద్రాచలాన్నే రెండవ ఒంటిమిట్టగా పేర్కొనడం సమంజసమంటారు ఇక్కడి పురాణ ప్రముఖులు. ఒంటిమిట్టలాంటి గొప్ప క్షేత్రమున్న ఈ జిల్లాలో శ్రీరాముని పవిత్ర హస్త స్పర్శతో పునీతమైన క్షేత్రాలుగా పేరుగాంచిన ప్రాంతాలు కూడా ఉన్నాయి.

అందులో ఒకటి ప్రొద్దుటూరులోని ముక్తిరామేశ్వరాలయం. ఈ ఆలయంలోని శివలింగాన్ని స్వయంగా శ్రీరాముడే ప్రతిష్టించాడని ప్రతీతి. వేంపల్లె గండి వీరాంజనేయ క్షేత్రం కూడా అలాంటిదే.

 ఈ ఆలయంలోని వీరాంజనేయస్వామి శిల్పాన్ని శ్రీరాముడు తన బాణం ములికతో స్వయంగా మలిచాడని ఆలయ పురాణం చెబుతోంది. అలాగే ఒంటిమిట్ట క్షేత్రంలోని రెండు కోనేర్లు సీతమ్మ కోరిక మేరకు శ్రీరాముడే స్వయంగా బాణం వేసి సృష్టించిన నీటి గుండాలని, అందుకే వాటిలో పెద్ద కోనేటికి రామతీర్థం అని పేరు వచ్చిందని చెబుతారు. అలాగే జిల్లాలో చాలామంది కవులు రామాయణ రచన చేశారు. శ్రీరాముడు దయ చూపడం వల్లే జిల్లావాసులకు ఈ భాగ్యాలన్నీ కలిగాయని భక్తుల విశ్వాసం.

చదవండి :  అన్నమయ్య కథ (మొదటి భాగం)

 రామకథా రచనతో పునీతం..

పూర్వం రామాయణం రాయనివాడు కవియే కాదని భావించేవారు. అందుకే కవులు ఎన్ని రచనలు చేసినా రామాయణ రచనతోనే కవిగా తమ జీవితానికి సార్థకత లభిస్తుందని భావించేవారు. కవులకు గడపగా పేరున్న మన జిల్లాలో కూడా అలాంటి ధన్యజీవులైన కవులున్నారు. వారు తమదైన శైలిలో నిండైన భక్తిభావంతో రామాయణ రచన చేశారు. శ్రీరామనవమి సందర్భంగా అలాంటి వారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం..

 తన జీవితాన్ని ఒంటిమిట్ట కోదండరామయ్యకే అంకితం చేసిన ‘వాసుదాసు’ వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రాశారు. సామాన్యులకూ అర్థం కావాలని దానికి అనుబంధంగా ‘మందరం’ రాశారు. ఆంధ్రవాల్మీకిగా పేరు పొందారు.

చదవండి :  నవ వసంతం (కథ) - తవ్వా ఓబుల్ రెడ్డి

 తెలుగులో రామాయణాన్ని రచించిన తొలి తెలుగు మహిళా మొల్లమాంబ. గోపవరం మండలానికి చెందిన ఆమె వాల్మీకి రామాయణాన్ని అతి తక్కువ పద్య గద్యాలలో రాసి తన ప్రతిభను చాటుకున్నారు.

 తన పద కవితలతో తిరుమలేశుని అర్చించి, తరించిన తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీరామునిపై ద్విపద కావ్యం రచించినట్లు తెలుస్తోంది.(ప్రస్తుతం ఇది అలభ్యం). తొలి తెలుగు కవయిత్రి అన్నమాచార్యుల సతీమణి తాళ్లపాక తిమ్మక్క శ్రీరాముని స్తుతిస్తూ గడియ పాట రాశారు.

సాహితీలోకంలో అభినవ వాల్మీకిగా పేరుగాంచిన జనమంచి శేషాద్రి శర్మ ఆంధ్ర శ్రీమద్‌రామాయణం, ధర్మసార రామాయణం, 13 భాగాల రామావతార తత్వం రాశారు.(ఇవి బ్రౌన్ గ్రంథాలయంలో ఉన్నాయి)

ఒంటిమిట్టకు చెందిన అయ్యలరాజుల రామభద్రకవి రామాభ్యుదయం రాసి ఒంటిమిట్ట రామయ్యకే అంకితమిచ్చారు.(ఇది బ్రౌన్ గ్రంథాలయంలో లభిస్తుంది.)

చదవండి :  అన్నమయ్య కథ - మూడో భాగం

అయ్యలరాజు తిప్పకవి ఒంటిమిట్ట రఘువీర శతకం రచించారు. జనమంచి వెంకటసుబ్రమణ్య శర్మ అమృతోత్తర రామాయణ కావ్యం, శ్రీరామ శతకం రచించారు. మాధవరానికి చెందిన కట్టా వరదారావు వరద రాజారామాయణం రాశారు. దుర్బాక రాజశేఖర శతావధాని సీతా కళ్యాణం, సీతాన్వేషణ, సీతాపహరణం, సీతా పరిగ్రహణం పేరిట 4 నాటకాలు రాశారు. ఉప్పగుండూరు వెంకటకవి దశరథ రామాయణ శతకం రాశారు. అలాగే గడియారం వేంకటశేషశాస్త్రి శ్రీమదాంధ్ర రామాయణం, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణచార్యులు జనప్రియ రామాయణం, భూతపురి సుబ్రమణ్య శర్మ శ్రీభద్రాచల రామ సుప్రభాతం, అవధానం చంద్రశేఖర శర్మ సేతు బంధనం, నారు నాగనార్య రామకథ, వంగీపురం శేషాచార్యులు శేష రామాయణం, గూడూరు పెంచలరాజు కందరామాయణం, కసిరెడ్డిపల్లె వెంకటరెడ్డి నిర్వచన వెంకట రామాయణం రచించారు.(వీటిలో ఎక్కువ శాతం గ్రంథాలు బ్రౌన్ గ్రంథాలయంలో ఉన్నాయి.) మరో 30 మంది కవులు శ్రీరామునిపై శతకాలు రాశారు.

ఇదీ చదవండి!

mahanandayya

మహనందయ్య – జానపద కళాకారుడు (చెక్కభజన)

రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన. చెక్కభజనలో …

ఒక వ్యాఖ్య

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: