ప్రొద్దుటూరు అమ్మవారిశాల (శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం) పట్టణానికే తలమానికంగా విరాజిల్లుతోంది. జగములనేలే జగజ్జననిగా, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ప్రసిద్ధికెక్కింది. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం 121 ఏళ్ల క్రితం కామిశెట్టి కొండయ్య శ్రేష్టి ఆధ్వర్యంలో రూపుదిద్దుకొంది. చిన్నకొండయ్యకి కలలో అమ్మవారు కనిపించి తనకోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరడంతో 1890 లో ప్రొద్దుటూరులో ఆయన అమ్మవారిశాలను నిర్మించారు.
ఆలయ నిర్మాణంలో నాణ్యమైన రంగూన్ టేకును వినియోగించారు. ప్రొద్దుటూరు అమ్మవారిశాలలోని శిల్పాలు ఎంతో ఆకర్షణీయమైనవిగా చెప్పవచ్చు. కర్నూలు జిల్లా శిరువెల్ల సమీపంలోని గుంపరమానుదిన్నె శిల్పకలకు ప్రసిద్ధి గాంచించింది. గుంపరమానుదిన్నె శిల్పులతో చెక్కించిన సుబ్రమణ్యస్వామికి సంబంధించిన శిల్పంతో పాటు అనేక శిల్పాలు భక్తులను పరవశుల్ని చేస్తాయి. అమ్మవారిశాలను జాతిపిత మహాత్మా గాంధి 1929 మే నెల 17 సందర్శించి శ్రీ వాసవీ మాతను సేవించారు.
ఈ ఆలయంలో లోక కళ్యాణార్థం అమ్మవారికి పంచామృతం, గోక్షీరం, గంధం, మంగళద్రవ్యాలతో విశేష అభిషేకాలు, సహస్ర కుంకుమార్చనలు, రథోత్సవం, వాసవీ నిత్యహోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్దేశిత రోజులలో అమ్మవారికి అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు.
భక్తులు కానుకలుగా సమర్పించిన బంగారు రథం, వెండి ఊయల, బంగారు సింహాసనం, వజ్రపు చీరె, బంగారు, వజ్రపు కెంపులు, రతనాలు, ముత్యాలతో రూపొందించిన వెలకట్టలేని ఆభరణాలు అమ్మవారికి ఉన్నాయి.
బంగారు చీరె
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి బంగారుతో రూపొందించిన చీరె ఉంది. ఈ చీరెను ప్రతి శుక్రవారం, పలు పర్వదినాలలో అమ్మవారికి అలంకరిస్తారు.
వెండి ఊయల:
అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించేందుకు భక్తులు ఇచ్చిన విరాళాలతో వెండి ఊయలను రూపొందించారు. ప్రతి బుధవారం సాయంత్రం అమ్మవారికి వెండి ఊయలలో సేవలు నిర్వహిస్తారు.
అష్టదళ పాదపద్మార వదనం:
ప్రతి మంగళవారం అమ్మవారికి అష్టదళ పాదపద్మారవదన సేవను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. 108 బంగారు, 108 వెండి పూలతో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇవేకాక అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, బంగారు, వెండితో తయారు చేసిన అనేక ఆభరణాలు, వెండి సామగ్రి వంటి విలువైన సంపద ఉంది.
వజ్రపు చీరె
వైకుంఠ ఏకాదశి, విజయదశమి, ఉగాది పర్వదినాల్లో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరికి ఈ వజ్రపు చీరెను అలంకరిస్తారు.
బంగారు కలశం
బంగారు కలశాన్ని శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూల నక్షత్రం, షష్టిరోజు, బిందెసేవలో మాత్రమే ఉపయోగిస్తారు. భక్తులు కలశాన్ని తలపై ఉంచుకొని పట్టణం లో తిరుగుతారు. దీని వల్ల సర్వ అరిష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
గజ వాహనం
అత్యంత సుందరంగా రూపొందించిన ఏనుగు వాహనంపై అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా ఊరేగిస్తారు. ప్రతి సోమవారం సాయంత్రం అమ్మవారికి ఈ గజవాహన సేవ ఉంటుంది.
పంచలోహ రథం
విజయదశమిన అమ్మవారిని పంచలోహ రథంలో ఊరేగిస్తారు. దీన్నే తొట్టిమెరవణి అని కూడా అంటారు. ఈ రథంలో ఉండే శ్రీచక్రం అత్యంత శక్తివంతమైంది. ఈ రథం తిరిగిన చోట అరిష్టాలు తొలగి ప్రజలు సుభిక్షంగా ఉంటారు.
బంగారు రథం
బంగారు రథంలో ప్రతి ఆది, గురువారాల్లో అమ్మవారిని అలంకరించి సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఊరేగిస్తుంటారు. వాసవీమాతకు ప్రొద్దుటూరులో తప్ప మరెక్కడా బంగారు రథం లేదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.