|
మైదుకూరు పట్టణం చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై ఉన్నది మైదుకురును 'రాయలసీమ కూడలి' అని కూడా చెప్పవచ్చు.ఎందుకంటే కడప, చిత్తూరు జిల్లాల వారు హైదరాబాద్ వెళ్ళాలంటే మైదుకూరు మీదుగానే వెళ్ళవలసి ఉంటుంది అలాగే కర్నూలు జిల్లా వారు నెల్లూరు,తిరుపతి,విజయవాడ లకు మైదుకూరు మీదుగానే వెళ్ళవలసి ఉంటుంది.కడప నగరానికి 32 కి.మీల దూరంలో ఉన్న ఈ పట్టణం కెపి ఉల్లి కి ప్రసిద్ది.మందుల తయారీకి ఉపయోగించే అరుదైన కె పి ఉల్లి అధికంగా మైదుకూరు పరిసర ప్రాంతాలలో సాగవుతుంది.ఈ పట్టణం నియోజకవర్గ కేంద్రం కూడా.మైదుకూరులో జిల్లాలోనే అతి పెద్దదైన మసీదు ఉంది.మధ్వారాయ స్వామి ఆలయం,సాయిబాబా ఆలయం,అమ్మవారిశాల, సి ఎస్ ఐ చర్చి వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు మైదుకూరులో ఉన్నాయి.కడప రోడ్డులో ఉన్న సాయిబాబా ఆలయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.మైదుకూరు కూరగాయల మార్కెట్ నుండి వివిధ రాష్ట్రాలకు కూరగాయలు ఎగుమతి అవుతాయి.పట్టణంలో నాలుగు ప్రధాన రోడ్‌లున్నాయి.వీటిని కడప రోడ్డు,ప్రొద్దుటూరు రోడ్డు,నంద్యాల రోడ్డు,బద్వేలు రోడ్డు అని వ్యవహరిస్తారు.గ్రామ పంచాయతీ గా ఉన్న మైదుకూరు పట్టణం వేగంగా విస్తరిస్తోంది.జాతీయ రహదారి పై నున్నందు వల్ల మైదుకూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా విస్తృతంగానే జరుగుతోంది.పట్టణంలో మొత్తం 5 సినిమా థియేటర్లు ఉన్నాయి.పట్టణంలో పలు ప్రభుత్వ,ప్రైవేటు స్కూళ్లు,కాలేజీలు ఉన్నాయి.పట్టణంలోని బద్వేలు రోడ్డు జనంతో రద్దీగా ఉంటుంది.మైదుకూరు పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంది.ప్రతి శనివారం ఇక్కడ జరిగే సంతలో లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుంది.ఈ సంత కు వివిధ రాష్ట్రాల నుండి వ్యాపారులు అధిక సంఖ్యలో తరలి వస్తారు.రాయలసీమ జిల్లాలకు చెందిన రైతులు కూడా ఈ సంత లో పశువుల,జంతువుల క్రయ విక్రయాలు సాగిస్తారు.మైదుకూరు సంత నుండి ప్రతి వారం వేలాది పశువులు కభేళాలకు తరలుతుంటాయి.
|